migraine treatment in ayurveda: మైగ్రేన్ తలనొప్పికి ఆయుర్వేద చికిత్స.. ఆ దోషాలు
Ayurveda treatment for migraine: నిత్యం వేధించే మైగ్రేన్ తలనొప్పికి ఆయుర్వేద చికిత్స విధానం ఉపశమనాన్ని ఇస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని కొన్ని దోషాలను తొలగించడం వల్ల మైగ్రేన్ మాయమవుతుందని చెబుతున్నారు.
migraine treatment in ayurveda: మైగ్రేన్ తలనొప్పికి ఆయుర్వేదం బాగా పనిచేస్తుందని పేషెంట్లు, నిపుణులు చెబుతారు. మైగ్రేన్ అనేది నాడీ సంబంధిత రుగ్మత. నాడీ పోటు వల్ల తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంది. వికారం, వాంతి, వెలుతురు అలాగే శబ్దాలను తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు దీనిలో కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే దానిని మైగ్రేన్ అటాక్ లేదా మైగ్రేన్ తలనొప్పిగా పిలుస్తారు.
ట్రెండింగ్ వార్తలు
మైగ్రేన్ తలనొప్పి విషయంలో వైద్యులు సాధారణంగా అలోపతిక్ మందులు, జీవన శైలి మార్పులు సూచిస్తారు. ఈ చికిత్సలో మీ లక్షణాలు తగ్గనప్పుడు మీలో స్ట్రెస్ పెరిగిపోతుంటుంది. అలాంటప్పుడు ఈ మందులు కొనసాగిస్తూనే మీరు సహజమైన ఉపశమనం కోసం ప్రయత్నించవచ్చు. ఈ సహజ పద్దతుల్లో ఆయుర్వేద వైద్యం కూడా ఒకటి. అయితే ఇది శాస్త్రీయంగా నిరూపితమైందనడానికి ఆధారాలు లేకపోయినప్పటికీ.. ఆయుర్వేదం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయని మనకు తెలుసు.
ఆయుర్వేద చికిత్సతో మైగ్రేన్ తగ్గుతుందా?
ఆయుర్వేదం మీ అనారోగ్యానికి గల మూల కారణాలను కనుక్కొని వాటికి పరిష్కారం చూపడం ద్వారా మీ రోగాన్ని నయం చేస్తుంది. అంటే ఒక సమగ్ర విధానంగా ఆయుర్వేదాన్ని భావిస్తారు. శరీరం, మనస్సు, ఆత్మను పరిగణనలోకి తీసుకుంటుంది. జీవం ఐదు అంశాలపై ఆధారపడి ఉంటుందని చెబుతారు. వాటినే పంచభూతాలుగా భావిస్తారు.
గాలి, ఆకాశం, అగ్ని, భూమి, నీరు.. ఈ ఐదు అంశాల ఆధారంగా జీవం ఉంటుందని చెబుతారు. ఇందులో గాలి శ్వాస, నాడీ వ్యవస్థతో ముడివడి ఉంటుంది. ఇక ఆకాశం మీ శరీరంలోని స్పేస్‌తో ముడివడి ఉంటుంది. అంటే నోరు, చెవులు వంటివి. ఇక అగ్ని మీ జీవక్రియతో ముడివడి ఉంది. భూమి మీ శరీర స్వరూపంతో ముడివడి ఉంటుంది. అంటే ఎముకలు వంటివి. ఇక నీరు ద్రవాలతో.. అంటే రక్తం, లాలాజలం వంటివి.
ఈ ఐదు ఎలిమెంట్స్ మీలోని శక్తిని, దోషాలను నిర్ధారిస్తుంది. శరీరంలో వాత (వాయువు, ఆకాశ సంబంధిత), పిత్త (అగ్ని, నీటి సంబంధిత), కఫ (భూమి, నీటి సంబంధిత) దోషాలు ఉంటాయి. అందరిలో ఈ మూడు దోషాలు ఉంటాయి. అయితే ఇందులో ఏదో ఒక దోషం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల సమస్యలు రాకుండా ఉండాలంటే మిగిలిన వాటిని సమతుల్యం చేసుకోవాలి. అలా లేనప్పుడు మిమ్మల్ని అనారోగ్యం వెంటాడుతుంది. మైగ్రేన్ కూడా ఈ వాత దోషాల్లో సమతుల్య లోపం వల్లే వస్తుంది. ఎక్కువగా వాత దోషం గానీ, వాతం, కఫ దోషాల వల్ల గానీ మైగ్రేన్ వస్తుంది. ఆయుర్వేదం ద్వారా దోషాలను సరి చేస్తే మైగ్రేన్ నయమవుతుంది.
మైగ్రేన్‌కు ఆయుర్వేద చికిత్స విధానం..
మైగ్రేన్ నయం చేసేందుకు వాత, కఫ దోషాలను సమతుల్యం చేస్తారు. ఇందులో భాగంగా శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తారు. అలాగే కొన్ని ఆయుర్వేద మూలికలను సిఫారసు చేస్తారు. ఆహారం, జీవన శైలి మార్పులు సూచిస్తారు. అలాగే ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉంచేందుకు కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ సూచిస్తారు. ఆయా దోషాలను తగ్గించేందుకు ఏ విధానాలు సరైనవో ఆయుర్వేద వైద్య నిపుణులు నిర్ణయిస్తారు.
మైగ్రేన్ చికిత్సలో ఉండే పద్ధతులు ఇవే
మైగ్రేన్ తలనొప్పి నివారణకు పంచకర్మ థెరఫీ సిఫారసు చేయవచ్చు. దీనిలో భాగంగా మాలిన్యాలు బయటకు పంపి శరీరాన్ని శుభ్రం చేస్తారు. అంటే మైగ్రేన్‌కు కారణమైన టాక్సిన్స్ బయటకు పంపిస్తారు. ఈ మాలిన్యాల తొలగింపులో భాగంగా నస్య కర్మ (ముక్కులో ఔషధ గుణాలు ఉన్న నూనెలు పోయడం), శరీరానికి ఔషధ గుణాలు ఉన్న నూనెలతో మర్ధన చేయడం, స్వేద కర్మ సిఫారసు చేస్తారు.
ఇక మీ మనస్సును, శరీరాన్ని తేలికపరిచే అద్భుతమైన విధానం యోగా. ఇందులో విభిన్న శ్వాస పద్ధతులు, యోగ భంగిమలు మిమ్మల్ని మైగ్రేన్ నుంచి దూరం చేస్తాయి. మీ స్ట్రెస్, యాంగ్జైటీని తగ్గిస్తాయి. ముఖ్యంగా కొన్ని రకాల యోగ భంగిమలతో మీ మెదుడుకు రక్త ప్రసరణ మెరుగవడం వల్ల మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. బాలాసన, అధోముఖ స్వానాసనం, సేతు బంధాసనం వంటివి మైగ్రేన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
మైగ్రేన్ నుంచి ఉపశమనానికి యోగా, వ్యాయామం ఎందుకు అవసరం
యోగాసనాల వల్ల నిర్ధిష్ట ప్రాంతాలకు రక్తప్రసరణ, ఆక్సిజన్ మెరుగవడం వల్ల ఆయా భాగాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. అలాగే వ్యాయామం వల్ల మీ శరీరం నుంచి ఎండార్ఫిన్లు విడుదలై మీకు నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. మీ మనస్సును కూడా తేలికపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన మటుమాయం అవడం వల్ల మీ మైగ్రేన్ తలనొప్పి కూడా దూరమవుతుంది. అయితే ఇందుకోసం మీరు కఠిన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. నడక, వేగంగా నడక, ఈత వంటివి పాటించాలి.
మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనానికి రిలాక్సేషన్ టెక్నిక్స్
మైగ్రేన్ నుంచి ఉపశమనానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా చికిత్సలో భాగమే. ఇవి పాటిస్తే మీరు మైగ్రేన్ వంటి నొప్పులే కాకుండా డయాబెటిస్, హైబీపీ, థైరాయిడ్ వంటి వాటి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
రిలాక్సేషన్ టెక్నిక్స్‌లో లోతైన శ్వాస పద్ధతులు (డీప్ బ్రీత్ వ్యాయామాలు), ధ్యానం, సానుకూల చిత్రాలను ఊహించడం ఉంటాయి. డీప్ బ్రీత్‌లో భాగంగా మీరు శ్వాస తీసుకున్నప్పుడు, అలాగే వదిలేసినప్పుడు ఆ స్థితిని ఆపగలగడమే. అంటే నెమ్మదిగా ఊపిరి తీసుకుని నాలుగైదు సెకండ్లు నిలిపి నెమ్మదిగా వదలడం. అలాగే నాలుగైదు సెకెండ్లు అదే స్థితిలో ఉండి మళ్లీ గాలి పీల్చుకోవడం. ఈ సైకిల్‌ను అలా కొన్ని నిమిషాలు కొనసాగించడం వల్ల మీరు అద్భుతమైన స్థితికి వస్తారు. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకునే స్థితికి చేరుకుంటారు. అలాగే ధ్యానం కూడా మీకు ప్రశాంతతను ఇస్తుంది. అలాగే మీకు బాధ కలిగించే దృశ్యాల స్థానంలో సానుకూల దృశ్యాలను మీ మనస్సులో ఊహించుకోవడం వల్ల మీలో ప్రశాంతత చేకూరుతుంది.
మైగ్రేన్‌కు నిర్ధిష్ట ఆహారాలు, ఔషధాలు ఉన్నాయా?
కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, పసుపు, వేపాకు వంటివి మైగ్రేన్ తలనొప్పికి ఔషధంలా పనిచేస్తాయి. ఆయుర్వేద వైద్య నిపుణులు వీటి కాంబినేషన్లతో కూడిన మందులు సూచిస్తారు.