Fasting drinks: శ్రావణ సోమవారం ఉపవాసం ఉంటున్నారా? ఈ పానీయాలు తాగితే తక్షణ శక్తి
Fasting drinks: ఉపవాసం సమయంలో కాస్త అలసట, బలహీనత ఉంటాయి. అలాంటప్పుడు తక్షణ శక్తి కోసం ఈ 5 రకాల పానీయాలను తాగొచ్చు.
శ్రావణ మాసం మొదలైపోయింది. ఈ రోజే శ్రావణ మాస మొదటి సోమవారం. చాలా మంది ఈ రోజు ఉపవాసం ఉంటారు. నియమనిష్టలతో శివుణికి పూజాది అభిషేకాలు చేస్తారు. అయితే ఉపవాసం ఉన్నా కూడా శరీరంలో బలహీనత పెరగకుండా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. లేదంటే నీరసం వచ్చి ఏ పనీ చేయలేము.
ఉపవాసం రోజు శక్తినిచ్చే పానీయాలు:
1) మజ్జిగ:
పెరుగులో కొన్ని నీళ్లు కలిపి చిలికితే మజ్జిగ రెడీ అయిపోతుంది. లేదంటే పెరుగులోనే కాస్త ఉప్పు, పంచదార, నీళ్లు కలిపి మిక్సీ పడితే చిక్కటి మజ్జిగ రుచిగా తయారవుతుంది. దీన్ని రోజంతా ఆస్వాదించొచ్చు. రుచి మరింత పెరగాలంటే ఈ మజ్జిగలోనే వేయించిన జీలకర్ర పొడి, పుదీనా ఆకులు వేసి తాగొచ్చు. దీన్ని తాగిన తర్వాత శరీరం తాజాగా అనిపించడంతో పాటు శరీరానికి తక్షణ చల్లదనం కూడా లభిస్తుంది. తేమతో కూడిన వాతావరణంలో దాహం తీర్చడానికి, శరీరాన్ని చల్లబరచడానికి, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి కూడా ఇది మంచిది.
2) నిమ్మరసం:
నిమ్మరసం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడమే కాకుండా ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి ఐరన్ శోషణను పెంచడానికి సహాయపడుతుంది. అది తాగిన తర్వాత కూడా వెంటనే శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది.
3) కొబ్బరి నీరు:
కొబ్బరి నీరు పోషకాల గురించి చెప్పక్కర్లేదు. ఉపవాసం రోజు ఈ నీరు తాగడం మంచిది. ఈ నీటిలో పొటాషియం, సోడియం, మాంగనీస్ వంటి ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి. ఇవి మీ గుండెకు ప్రయోజనం చేకూరుస్తాయి. శరీరానికి తక్షణ శక్తినీ ఇస్తాయీనీళ్లు.
4) మ్యాంగో షేక్:
ఇంకా కొన్ని చోట్ల మామిడిపండ్లు దొరుకుతున్నాయి. మీకిష్టం అనిపిస్తే మామిడిపండ్ల గుజ్జు, పాలు కలిపి మిక్సీ పట్టుకుని మ్యాంగో మిల్క్ షేక్ చేసి తాగొచ్చు. దీంతో కడుపు నిండిపోతుంది. మామిడిపండు బదులు ఇంకేవైనా పండ్ల రసాలు కూడా మంచి ప్రత్యామ్నయాలే.
5) బాదం పాలు:
బాదం పాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ తేమతో కూడిన వాతావరణంలో చల్లటి బాదం పాలు తాగుతారు. దీన్ని తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. దీనికోసం ముందుగా కొన్ని బాదాంలను వేయించి పెట్టుకోవాలి. అందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. వీటిని పంచదార కలిపి మిక్సీ పట్టుకోవాలి. వేడి పాలల్లో ఈ పొడిని కలుపుకుని తాగితే సరిపోతుంది.