అల్లనేరేడు పండ్ల సీజన్.. ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు
అల్ల నేరేడు పండ్ల సీజన్ ఇది. ఈ పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు తినకుండా ఉండలేరు.
అల్లనేరేడు పండ్ల సీజన్ వచ్చేసింది. చాలా ఔషధ గుణాలు ఉన్న ఈ పండ్ల ధర మార్కెట్లో కాస్త ఎక్కువగానే ఉన్నా.. వీటిలో పోషకాలు కూడా అంతే విలువైనవని గుర్తు పెట్టుకోవాలి. ప్రొటీన్, కాల్షియం, కార్బొహైడ్రేట్లు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, విటమిన్ సీ, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బీ6, విటమిన్ ఏ, ఆరోగ్యకరమైన కొవ్వుల సమ్మేళనం అయిన అల్లనేరేడు పండ్లు అనేక వ్యాధులను నియంత్రించే శక్తికలిగినవని గుర్తించాలి. అల్లనేరేడు పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని వైద్యులు తరచూ చెబుతుంటారు.
అల్లనేరేడు పండ్లు తినడం వల్ల లాభాలు
అల్లనేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయంగా రుజువైంది. వీటిలో పొటాషియం అధిక స్థాయిలో ఉంటుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తరచుగా అల్ల నేరేడు పండ్లు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. మీ గుండె సక్రమంగా పనిచేసేందుకు పొటాషియం సహకరిస్తుంది. అంతేకాకుండా స్ట్రోక్ రాకుండా, హై బ్లడ్ ప్రెషర్ రాకుండా నిరోధిస్తుంది.
శ్వాస నాళాలు, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది
విష వాయువులు, వాయు కాలుష్యం కారణంగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు, శ్వాసనాళాలను శుభ్రం చేసే శక్తి అల్ల నేరేడు పండ్లకు ఉంది. వాయు కాలుష్యం కారణంగా ఎదురయ్యే ఫ్రీరాడికల్స్‌ను ఇవి నియంత్రిస్తాయి. వీటిలో ఉండే జింక్, విటమిన్ సీ ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి.
కొలన్ క్యాన్సర్‌ను నిరోధిస్తుంది
అల్ల నేరేడులో ఉండే సైనైడిన్ వంటి సమ్మేళనాలు కొలన్ క్యాన్సర్‌ను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి. అల్లనేరేడు పండ్లలో ఉండే యాంటాక్సైడ్లు ఫ్రీరాడికల్స్‌పై పోరాడుతాయి. క్యాన్సర్ కణాలు వృద్ధిని అడ్డుకుంటాయి.
డయాబెటిస్‌కు చికిత్సగా
అల్ల నేరేడు పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడానికి దోహదం చేస్తాయి. అధిక మూత్ర విసర్జన, దప్పిక వంటి డయాబెటిస్ లక్షణాలను అల్ల నేరేడు పండ్లు తగ్గిస్తాయి.
కొలాజెన్ పెంచుతాయి
అల్లనేరేడు పండ్లు తింటే చర్మం మిలమిల మెరుస్తుంది. వీటిలోని యాంటాక్సిడెంట్ల సమ్మేళనాలు, విటమిన్ సీ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. అందుకే చర్మం యవ్వనాన్ని సంతరించుకుంటుంది.
ఇతర ప్రయోజనాలు
అల్ల నేరేడు పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను ఇవి అడ్డుకుంటాయి. అలాగే దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.