Hair ends trimming: జుట్టు చివర్లు కట్ చేస్తే వేగంగా పెరుగుతుందా?
Hair ends trimming: జుట్టు చివర్లు కట్ చేసుకుంటూ ఉండటం వల్ల జుట్టు పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అది ఎంత వరకు నిజమో తెల్సుకోండి. జుట్టు పెరగాలంటే ఏం చేయాలో చూడండి.
జుట్టు చివర్లు కట్ చేస్తూ ఉంటే జుట్టు పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. తరచూ అంగుళం అయినా కట్ చేస్తూ ఉంటారు. కేవలం దీనికోసమే పార్లర్లకు వెళ్లేవాళ్లూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెల్సుకోండి.
చివర్లు కట్ చేస్తే జుట్టు పెరుగుతుందా?
చివర్లు కట్ చేస్తే జుట్టు పెరుగుతుందనడంలో నిజం లేదు. అది కేవలం అపోహ మాత్రమే. జుట్టు పెరిగేది కుదుళ్ల నుంచి కానీ, చివర్లలో కాదు. చివర్లు కట్ చేసినంత మాత్రానా జుట్టు పెరగదు. దానికోసం కుదుళ్లు బలంగా ఉండాలి. జుట్టు చివర్లు కట్ చేయడం వల్ల ఆరోగ్యంగా కనిపిస్తుంది. కాస్త పోగులుగా లేచినట్లుండే చివర్లు మాయమయ్యి జుట్టు అందం పెరుగుతుంది తప్ప జుట్టు పెరగడానికి, చివర్లు కట్ చేయడానికి సంబంధం లేదు.
ఎన్ని రోజులకోసారి కట్ చేస్తే మంచిది?
జుట్టు పొడవు, సమస్య బట్టి ఈ సమాధానం ఉంటుంది. జుట్టు కింది భాగంలో పలుచగా అయిపోతే చూడ్డానికి అందంగా అనిపించదు. నెలకు జుట్టు ఒకటి నుంచి రెండు సెంటి మీటర్లు పెరుగుతుంది. అలాగే రోజూ 50 నుంచి 100 వెంట్రుకలు ఊడతాయి. ఈ లెక్కంతా సరిపోయి జుట్టు మందంగా కనిపించాలంటే రెండు లేదా మూడు నెలలకోసారి అంగుళం పొడవు కట్ చేయొచ్చు. దీనివల్ల పైనుంచి కిందిదాకా జుట్టు మందంగా ఉన్నట్లనిపిస్తుంది.
జుట్టు పెరగాలంటే..
జుట్టు పెరగాలంటే పోషణ అవసరం. అది షాంపూలు, కండీషనర్లు పెడితే రాదు. కుదుళ్ల నుండీ బలం పెరగాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
- గుడ్లలో ప్రొటీన్ బయోటిన్ ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. ప్రొటీన్ తగ్గడం వల్ల జుట్టు రాలే సమస్య వస్తుంది. గుడ్లలో జింక్, సెలేనియం, ఇతర పోషకాలూ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు అవసరం.
- పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్ ,ఫోలేట్లుంటాయి. జుట్టు పెరుగుదలకు విటమిన్ ఏ కూడా అవసరమే. కాబట్టి దీన్ని ఆహారంలో వీలైనంత ఎక్కువగా భాగం చేసుకోవాలి. ఇనుము లోపం కూడా తగ్గిస్తుందిది.
- చిలగడదుంపల్లో బీటీ కెరోటీన్ ఉంటుంది. ఇది తీసుకుంటే శరీరం దీన్ని విడగొట్టి విటమిన్ ఏ లాగా మారుస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్. ఒక చిన్న సైజు చిలగడదుంపలో రోజూవారీ కావాల్సిన బీటా కెరోటిన్ దాదాపు రెండింతలు అందుతుంది.
- కొన్ని గింజల్లో విటమిన్ ఈ, జింక్, సెలేనియం ఉంటాయి. వీటిలో పోషకాలు ఎక్కువ, కేలరీలు తక్కువుంటాయి. అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లుంటాయి. ఇవి రోజుకు చెంచాడు తీసుకున్నా జుట్టు పెరుగుదలకు సాయపడతాయి.
స్టైలింగ్:
జుట్టు అందంగా కనిపించాలని తరచూ వేడి గాలితో బ్లో డ్రైయింగ్ చేయడం, స్ట్రెటియినింగ్ చేయడం, కర్లింగ్ చేయడం మంచిది కాదు. ఇవన్నీ జుట్టు సహజ అందాన్ని పాడుచేస్తాయి. నల్లని, ఆరోగ్య వంతమైన జుట్టుకు మించిన అందం దేంతోనూ రాదు. వేడి గాలి వల్ల జుట్టు బలహీనంగా మారిపోతుంది. సలువుగా తెగిపోతుంది. కుదుళ్లలోనూ బలం తగ్గి క్రమంగా జుట్టు రాలడం ఎక్కువవుతుంది.