ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి అమ్మాయిలు రకరకాల ఫేస్ ప్యాక్‌లను ప్రయత్నిస్తూ ఉంటారు. మార్కెట్‌లో దొరికే ఫేస్ ప్యాక్ క్రీముల్లో రకరకాల రసాయనాలు ఉంటాయి. కాబట్టి అవి కొంత ముఖ చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంట్లో దొరికే సహజమైన పదార్థాలతో ప్యాక్‌లు వేసుకోవడం వల్ల చర్మపు ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యలను నెయ్యి చక్కగా పరిష్కరిస్తుంది. ఈ కాలంలో పొడి చర్మం ఎక్కువగా విసుగు కలిగిస్తుంది. అందుకనే నెయ్యితో వేసుకునే ఫేస్ ప్యాక్‌లు మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి. ఫలితాన్ని చూసి వావ్ అనకుండా ఉండలేరు.
ఒక గిన్నెలో ఒక స్పూను ఆర్గానిక్ పసుపును తీసుకోండి. దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కరిగించిన నెయ్యిని వేయండి. రెండింటిని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మొటిమల వల్ల వచ్చే వాపులు తగ్గుతాయి. అలాగే చర్మం మరింత తెల్లగా మారుతుంది. నిగారింపును సంతరించుకుంటుంది.
కొందరు పొడి చర్మం సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలాంటి వారు రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జును తీసుకోండి. దానిలో ఓ టీ స్పూను కరిగించిన నెయ్యిని వేయండి. రెండింటినీ బాగా కలిపి ముఖానికి, మెడకు బాగా పట్టించండి. 20 నిమిషాల సేపు అలా వదిలేయండి. తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోండి. ఇలా చేయడం వల్ల పొడి చర్మం సమస్య తగ్గి చర్మం మృదువుగా, నిగారింపుగా తయారవుతుంది.
కొందరికి వయసుతో సంబంధం లేకుండా ముఖంపై గీతలు, ముడతలు వచ్చేస్తుంటాయి. వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. చర్మం బిగుతు దనాన్ని కోల్పోవడం వల్ల ఈ ఇబ్బంది వస్తుంది. దీన్ని తగ్గించుకునేందుకు రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో ఓ టేబుల్ స్పూను నెయ్యిని కలిపి ముఖానికి పట్టించండి. ఇందుకు కాస్త గట్టిగా ఉన్న పెరుగును ఉపయోగించండి. పావుగంట తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోండి. దీని వల్ల చర్మం ఎలాస్టిసిటీ మెరుగవుతుంది. గీతల్లాంటివి చర్మంలో కలిసిపోతాయి. ఇబ్బంది ఉన్న వారు వారానికి కనీసం రెండు సార్లయినా ఈ ఫేస్ ప్యాక్‌ని ప్రయత్నించడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి.