Flax seeds for Hair: జుట్టు ఆరోగ్యానికి అవిసె గింజలను జెల్‌లా, ప్యాక్‌లా ఇలా వాడాలి..
Flax seeds for Hair: అవిసె గింజల్ని జుట్టు ఆరోగ్యం కోసం ఆహారంలో చేర్చి తినడమే కాకుండా బయటి పూతల్లాగా వాడచ్చు. అదెలాగో చూసేయండి.
జుట్టును సంరక్షించుకోవడానికి మనం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటాం. రకరకాల నూనెల్ని, షాంపూల్నీ వాడుతుంటాం. అయినా సరే జుట్టు రాలిపోవడం, చుండ్రు పెరిగిపోవడం, చివర్లు చిట్లిపోవడం, తెల్ల జుట్టు రావడం లాంటి ఎన్నో సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. మరి ఇలాంటి సమస్యలన్నింటికి ఒక్కటే పరిష్కారం అవిసె గింజలు అని చెప్పవచ్చు.
వీటిని పొడి చేసుకుని ఆహారాల్లో చేర్చుకుని తినడం వల్ల ఎన్నో పోషకాలు మనకు లభ్యమవుతాయి. తద్వారా మన జుట్టుకు శరీరం లోపలి నుంచి బలంగా ఎదుగుతుంది. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. ఇంకా వీటిలో ఉండే ప్రొటీన్‌లు, విటమిన్ బీ1, బీ6, ఈలు జుట్టును ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. అలాగే బయట లేపనంలాగా వీటిని ఉపయోగించీ జుట్టును సంరక్షించుకోవచ్చు. అదెలాగో, ఏంటో తెలుసుకోండి.
అవిసె గింజల నూనె:
ఈ గింజల నూనెను జుట్టు సమస్యలు ఉన్న వారు ఎవరైనా సరే రాసుకోవచ్చు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ.. తదితరాలు మాడుని ఆరోగ్యవంతంగా చేస్తాయి. తద్వారా కుదుళ్లు బలపడి జుట్టు రాలిపోయే సమస్య తగ్గుముఖం పడుతుంది. కాంతివంతంగా పొడవుగా ఎదుగుతుంది.
అవిసె గింజల జెల్:
పావు కప్పు అవిసె గింజల్ని తీసుకుని వాటికి రెండు కప్పుల నీటిని చేర్చండి. రాత్రంతా నానబెట్టండి. మరుచటి రోజు ఉదయాన్నే వాటిని తీసుకెళ్లి స్టౌ మీద పెట్టండి. అవి ఉడికి దగ్గరబడి జెల్‌లా వచ్చేంత వరకు ఉడికించండి. వేడిగా ఉన్నప్పుడే జాలీతో దాన్ని వడకట్టేయండి. ఆ మిశ్రమాన్ని ఓ ఎయిర్ టైట్ డబ్బాలో వేసేసి వేడి చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచుకోండి. దీన్ని కాస్త తీసుకుని సాధారణ ఉష్ణగ్రతకు వచ్చాక హెయిర్‌కి ప్యాక్‌లా వేసుకోండి. దీని వల్ల జుట్టుకు కావాల్సిన పోషణ అంది అది బలంగా ఎదుగుతుంది.
హెయిర్ ప్యాక్:
కొందరికి జుట్టు పొడి బారినట్లుగా ఉండి చూడ్డానికి కాంతి విహీనంగా కనిపిస్తుంది. ఇలాంటి వారు అవిసె గింజలతో చేసే హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది. రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజల పొడిని తీసుకోండి. దాంట్లో అరకప్పు పెరుగు, నాలుగు చుక్కల తేనె వేయండి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించండి. ఈ ప్యాక్‌ని అరగంట పాటు అలా ఉంచేసుకుని తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయండి. మీ జుట్టు ఎంతో మృదువుగా, హైడ్రేటెడ్‌గా మారుతుంది.