Thumb sucking habit: పిల్లలు నోట్లో వేలు పెట్టడం ఆపట్లేదా? ఇలా మాన్పించండి
Thumb sucking habit: పిల్లలు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు మానుకోవట్లేదా? ఈ చిట్కాలు, కారణాలు తెల్సుకోండి.
చిన్నపిల్లలు నోట్లో వేలు పెడుతున్నారా? ఈ విషయంలో చాలా సందేహాలుంటాయి. కొంతమంది పిల్లలు అలా నోట్లో వేలు పెడితేనే మంచిదని చెబితే, మరికొంతమంది ఇది వాళ్ల ఆకలిని తగ్గిస్తుందని చెబుతారు. అసలు వైద్యులు దీని గురించి ఏమంటున్నారో తెల్సుకోవాలి. లేదంటే చిన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి ఇది ప్రశ్నలాగే ఉండిపోతుంది. ఈ అలవాటు మంచిదేనా? ఉంటే ఏ వయసు దాకా పరవాలేదు? ఈ అలవాటు ఎలా మాన్పించాలో తెల్సుకోండి.
పిల్లలు నోట్లో వేలు ఎందుకు పెడతారు?
పిల్లలకు చాలా మందిలో పుట్టుకతోనే నోట్లో వేలు పెట్టి చప్పరించే గుణం ఉంటుంది. వేలు చప్పరిస్తే వాళ్లకు సాంత్వన ఉంటుందట. చాలా సౌకర్యంగా అనిపిస్తుంది వాళ్లకి. కాస్త వయసు పెరిగినా కొద్దీ కొందరు ఈ అలవాటు మానేస్తారు. కొందరు పిల్లలు మాత్రం దానికే అలవాటు పడిపోతారు.
ఏ వయసు దాకా పరవాలేదు:
కొంతమంది పిల్లలు ఆరు నుంచి ఏడు నెలల వయసులోనే ఈ అలవాటు మానుకుంటారు. కొందరు 2 నుంచి 4 సంవత్సరాల వయసులో మానేస్తారు. మరికొందరు సంవత్సరాల కొద్దీ మానేయలేరు. అయితే 5 సంవత్సరాల వరకు ఈ అలవాటున్నా తీవ్ర ప్రమాదం ఏమీ లేదట. కాకపోతే దీన్ని మాన్పించే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉండాలి.
ఎప్పుడు మాన్పించాలి?
నెలల వయసు నుంచి సంవత్సరం వయసు పిల్లల్లో ఈ అలవాటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి పెద్ద పిల్లల్లోనే ఈ సమస్య ఉంటే కాస్త శ్రద్ధపెట్టి ఆలోచించాలి. అయిదు సంవత్సరాలు దగ్గర పడుతుంటే వాళ్లలో పళ్ల వరస రావడం మొదలవుతుంది. అప్పుడు నోట్లో వేలు పెట్టుకోవడం వల్ల ఆ పలువరుస సరిగ్గా ఉండకపోవచ్చు. మూతి ఆకారం మారిపోవచ్చు. కాబట్టి 4 నుంచి 5 ఏళ్లు వస్తున్నాయంటే ఈ అలవాటు మాన్పించేయడం మంచిది.
అలవాటు ఎలా మాన్పించాలి?
1. చేతికి కాకరరసం, మిర్చి లాంటివి పెట్టి మాన్పించే ప్రయత్నాలు వద్దు. పిల్లలను ఒకేసారి అవి ఆందోళనకు గుర్తుచేస్తాయి. ఒకట్రెండు రోజుల్లో ఈ అలవాటు మాన్పించలేరు. కాస్త ఓపిక అవసరం.
2. చాలా మంది పిల్లలు కొన్ని సందర్భాల్లోనే వేలు పెడతారు. వాటిని గమనించాలి. స్కూళ్లో వదిలిపెట్టినప్పుడు, నిద్ర పోయేముందు, తినేటప్పుడు, మీరు వాళ్లని వదిలి ఆఫీసుకు వెళ్తున్నప్పుడో.. ఇలా ఏదో ఒక కారణం ఉంటుంది. వాటిని గుర్తిస్తే అలవాటు మాన్పిండం సులువవుతుంది. ఆ సమయంలో వాళ్లను బిజీగా ఉంచాలి. కథలు చెప్పాలి. ఆటలు ఆడ్పించాలి.
3. వాళ్లకు నోట్లో వేలుపెట్టుకోకూడదని నిదానంగా చెప్పి, గుర్తుచేస్తూనే ఉండాలి. నోట్లో పెట్టుకున్న ప్రతిసారీ తియ్యమని గుర్తుచేయాలి. ఒక వారం ఓపికగా వాళ్లని గమనిస్తూ ఉంటే అలవాటు కాస్త తగ్గుతుంది. కోపగించుకుంటే పని అవ్వదు.
4. వాళ్లకు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టండి. ఒక గంట పాటూ నోట్లో వేలు పెట్టుకోకపోతే వాల్లకిష్టమైంది ఏమైనా కొనిస్తామని చెప్పండి. అలా క్రమంగా ఒక రోజు పాటూ చేస్తే పెద్ద బహుమతి ఉంటుంది అని చెప్పండి. ఈ మంత్రం కాస్త పనిచేయొచ్చు. ప్రయత్నించండి.
5. ఎన్ని ప్రయత్నాలు చేసినా అలవాటు మానకపోతే వైద్యుల్ని సంప్రదించాల్సిదే. వైద్యులు పరిస్థితి బట్ట వాళ్ల చేతికి ఏదైనా చేదుగా ఉండే మందు రాయడం, బ్యాండ్ ఎడిడ్, థంబ్ కోటింగ్, థంబ్ గార్డ్ లాంటివి సూచిస్తారు.