Urad dal Puri: వడల పిండి మిగిలిపోయిందా.. ఇలా పూరీలు చేసేయండి..
Urad dal Puri: మినప్పప్పుతో వడలెలా చేయాలి అనుకోకండి. వడల కోసం తయారు చేసుకున్న మినప్పప్పు పిండిలోనే కొన్ని మార్పులు చేసి సులువుగా ఈ పూరీలు చేసుకోవచ్చు. అదెలాగో వివరంగా చూడండి.
మినప్పప్పుతో చేసే వడలపిండి మిగిలిపోతే మరోసారీ వడలు తినాలనిపించదు. అలాంటప్పుడు చిన్న మార్పులు చేసి దాంతోనే పూరీలు చేసుకోవచ్చు. మినప్పప్పు వడల కోసం మినప్పప్పు రాత్రంతా నానబెట్టి కనీసం 6 గంటల పాటూ పులియబెడతాం. అలా చేసిన పిండీకే కొన్ని మార్పులు చేసి, మరికొన్ని పదార్థాలు కలుపుకుని రుచికరమైన మినప్పప్పు మసాలా పూరీలు చేసేయొచ్చు. వీటికి ఇంకేం కర్రీ కూడా అవసరం లేదు. వాటి తయారీ ఎలాగో చూసేయండి.
మినప్పప్పు పూరీల తయారీకి కావాల్సిన పదార్థాలు:
సగం కప్పు మినప్పప్పు
సగం కప్పు సన్నం రవ్వ
2 కప్పుల గోధుమపిండి
అంగుళం అల్లం ముక్క
2 పచ్చిమిర్చి
తగినంత ఉప్పు
సగం చెంచా ధనియాల పొడి
సగం చెంచా జీలకర్ర పొడి
సగం చెంచా గరం మసాలా
సగం చెంచా వాము
గుప్పెడు కొత్తిమీర తరుగు
1 చెంచా ఉప్పు
డీప్ ఫ్రైకి సరిపడా నూనె
మినప్పప్పు పూరీల తయారీ విధానం:
1. మీ దగ్గర మిగిలిపోయిన మినప్పప్పు వడల పిండి ఉంటే దాన్నే నేరుగా వాడుకోవచ్చు. లేదంటే ముందుగా మినప్పప్పు కడిగేసి రాత్రంతా నానబెట్టాలి.
2. ఉదయాన్నే మినప్పప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసుకోవాలి. ముందుగా ఉన్న వడల పిండీలో నేరుగా పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవచ్చు. లేదా ఆ రెండింటినీ మిక్సీ పట్టి కలుపుకోవచ్చు.
3. పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, వాము కలుపుకోవాలి. అన్నీ కలిసేలా కలుపుకోవాలి.
4. ఇప్పుడు సన్నం రవ్వ, కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
5. మరో పాత్ర తీసుకుని అందులో గోదుమపిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మినప్పప్పు మిశ్రమంలో కలిపేసుకోవాలి.
6. అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. మినప్పప్పులో ఉన్న నీళ్లు సరిపోవు అనుకుంటే కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పూరీల పిండికోసం గట్టిగా కలుపుకోవాలి.
7. ఈ పిండిని కనీసం పది నిమిషాల పాటూ పక్కన పెట్టుకోవాలి.
8. ఇప్పుడు పిండిలో చెంచా నూనె వేసి కలుపుకుని మరోసారీ బాగా కలుపుకోవాలి.
9. ఈ పిండితో చిన్న చిన్న ఉండలు చేసుకుని పూరీల్లాగా ఒత్తుకోవాలి.
10. కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని పూరీలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి.
11. ఈ పూరీలు బాగా పొంగి రెండు వైపులా రంగు మారేదాకా కాల్చుకోవాలి. అంతే మినప్పప్పు పూరీలు రెడీ అయినట్లే.
వీటిలో మసాలాలు కలిపి చేస్తాం కాబట్టి ఏ కూర అంచుకు లేకున్నా నేరుగా తినేయొచ్చు. అలాగే మిగిలిన మినప్పప్పు పిండిని పడేయకుండా వాడుకోవడానికి ఇదొక మంచి మార్గం. ఇడ్లీ లేదా దోసెల పిండి మిగిలిపోయినా కూడా ఇలా కాస్త గోధుమపిండి, మసాలాలు కలుపుకుని పూరీల్లా చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.