Ugadi Pachadi Recipe । సాంప్రదాయ ఉగాది పచ్చడిని ఇలా చేయండి, ఆరు రుచులను ఆస్వాదించండి!
Ugadi Pachadi Recipe: షడ్రుచుల కలయిక.. మనలోని భావోద్వేగాలకు ప్రతీక. ఉగాది పండగ రోజున ప్రతీ ఒక్కరు ఉగాది పచ్చడిని సేవించడం ఆనవాయితీ. ఉగాది పచ్చడి రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Happy Ugadi 2023: ఈరోజు ఉగాది పండగ, ఇది అచ్ఛమైన తెలుగు పండగ. ఉగాదిని తెలుగు సంవత్సరానికి ఆది అని కూడా అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి రోజున మనం ఉగాదిగా జరుపుకుంటాం. అది ఈసారి బుధవారం, 22 మార్చి 2023న వచ్చింది. ఉగాది పండగ రోజున ప్రతీ ఒక్కరు కచ్చితంగా ఆచరించవలసిన ఒక సాంప్రదాయం ఉగాది పచ్చడిని సేవించడం. ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల మిశ్రమం. ఇది తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు విభిన్న రుచులను కలిగి ఉంటుంది. ఈ ఆరు రుచులు జీవితంలోని భావోద్వేగాలకు ప్రతీకగా చెబుతారు. ఆనందం, విచారం, కోపం, అసహ్యం, భయం, ఆశ్చర్యం కలగలిసిందే జీవితం అని ఉగాది పచ్చడి సారం మనకు తెలియజేస్తుంది.
దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఈరోజు ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు. మీలో ఎవరైనా ఇంటికి దూరంగా ఉండి, ఉగాది పచ్చడి రుచులను ఆస్వాదించాలనుకుంటే, ఇక్కడ ఉగాది పచ్చడి రెసిపీని అందిస్తున్నాం. ఇక్కడ పేర్కొన్న సూచనల ప్రకారం, సులభంగా ఉగాది పచ్చడిని తయారు చేసుకోవచ్చు.
Ugadi Pachadi Recipe కోసం కావలసినవి
- 1 ½ కప్పు నీరు
- 2 టేబుల్ స్పూన్లు పచ్చి మామిడికాయ ముక్కలు
- 3 రెమ్మలు వేప పువ్వులు
- 3 టేబుల్ స్పూన్లు బెల్లం లేదా రుచికి తగినంత
- 1/4 టీస్పూన్ మిరియాల పొడి
- 1 tsp చింతపండు గుజ్జు
- 1 చిటికెడు ఉప్పు లేదా రుచికి తగినంత
- అరటిపండు ముక్కలు, పుట్నాలు, డ్రైఫ్రూట్స్ (ఐచ్ఛికం)
ఉగాది పచ్చడి తయారు చేసే విధానం
- ముందుగా కొత్త చింతపండును కడిగి, అది మెత్తబడే వరకు ½ కప్పు గోరువెచ్చని నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత చింతపండు గుజ్జును పిండుకుని, జ్యూస్ ఒక గిన్నెలో ఫిల్టర్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఆ గిన్నెలో మరికొన్ని నీళ్లు పోసుకొని, అందులో తరిగిన బెల్లం వేసి బాగా కలపండి.
- ఆ తర్వాత, సన్నగా తరిగిన పచ్చి మామిడికాయల ముక్కలను వేయండి. (మరింత రుచి కోసం అరటిపండు ముక్కలు, వేయించిన శనగ పప్పు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరిని కూడా కలుపుకోవచ్చు. అయితే ఇది ఐచ్ఛికం, కచ్చితం ఏం కాదు.)
- ఇప్పుడు తాజా వేప పువ్వులు వేయాలి. సాంప్రదాయకమైన ఉగాది పచ్చడిలో వేప పువ్వులను మాత్రమే వాడతారు. మీకు వేప పూలు లభించకపోతే నానబెట్టిన మెంతులు లేదా మెంతి పొడి వేసుకోవచ్చు.
- ఇప్పుడు నల్ల మిరియాల పొడిని వేయండి. మీకు నల్ల మిరియాల పొడి అందుబాటులో లేకపోతే కారం కలుపుకోవచ్చు.
అన్నింటిని బాగా కలిపేయండి, అంతే ఉగాది పచ్చడి సిద్ధమైనట్లే.. ఈ ఉగాది పచ్చడిని ముందుగా దేవునికి నైవేద్యంగా సమర్పించండి. ఆపై మీరు, మీ ఆత్మీయులతో కలిసి షడ్రుచులను ఆస్వాదించండి.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
సంబంధిత కథనం
టాపిక్