Kakdichi bhakri: శ్రద్ధా కపూర్ ఫేవరైట్ అల్పాహారం కీరదోస రొట్టెలు.. ఇలా చేసేయండి-know how to make shraddha kapoors favourite breakfast kakdichi bhakri ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kakdichi Bhakri: శ్రద్ధా కపూర్ ఫేవరైట్ అల్పాహారం కీరదోస రొట్టెలు.. ఇలా చేసేయండి

Kakdichi bhakri: శ్రద్ధా కపూర్ ఫేవరైట్ అల్పాహారం కీరదోస రొట్టెలు.. ఇలా చేసేయండి

Kakdichi bhakri: శ్రద్ధా కపూర్ బ్రేక్ ఫాస్ట్ గా కక్డిచి భాకర్ తినడానికి ఇష్టపడుతుంది. ఈ వంటకం పూర్తి రెసిపీ ఇక్కడ తెలుసుకోండి.

శ్రద్ధ కపూర్ ఫేవరైట్ ఫుడ్

సెలబ్రిటీలు ఏం తింటారు, వాళ్ల జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రజలు చాలా ఆసక్తి చూపుతారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఉండటం వల్ల సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన సమాచారం మన దాకా వస్తోంది. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ తనకు ఇష్టమైన అల్పాహారం గురించి చెప్పారు. తనకు కాక్డీచీ భాక్రీ అంటే ఇష్టం అన్నారు. కాక్డీ అంటే దోసకాయ, భాక్రీ అంటే రొట్టె లాంటిది. దోసకాయతో తయారు చేసే ఈ సర్వపిండిని పోలి ఉండే వంటకం చాలా రుచిగా ఉంటుంది. వీటి రుచి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికీ మంచిదే. వీటి తయారీ ఎలాగో వివరంగా చూసేయండి.

దోసకాయ రొట్టె లేదా కాక్డీచీ భాక్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు:

ఒక కీరదోసకాయ

అరకప్పు సన్నం రవ్వ

కొత్తిమీర తరుగు, సన్నగా తరుగుకోవాలి

ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్

రెండు టేబుల్ స్పూన్ల తాజా కొబ్బరి తురుము

అర టీస్పూన్ జీలకర్ర

రుచికి సరిపడా ఉప్పు

దోసకాయ రొట్టె లేదా కాక్డీచీ భాక్రీ తయారీ విధానం:

1. కీర దోసకాయ రొట్టె తయారీ కోసం ముందుగా దోసకాయను బాగా తురుముకోవాలి.

2. తురుమును ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. అందులో సన్నం రవ్వ, సన్నగా తరిగిన కొత్తిమీర, చెంచా పచ్చిమిర్చి ముద్ద, తాజా కొబ్బరి తురుము, జీలకర్ర, ఉప్పు వేసుకోవాలి.

3. అన్నీ బాగా కలిసేలా ఒకసారి కలపాలి. కీర దోసకాయలో ఉండే నీళ్లతోనే రవ్వ మెత్తగా అయిపోతుంది. నీళ్లు అస్సలు వాడక్కర్లేదు.

4. ఒక అయిదు నిమిషాలు పాటూ మూత పెట్టి ఈ మిశ్రమం పక్కన పెట్టుకోవాలి. దాంతో రవ్వ మెత్తగా అయిపోతుంది.

5. ఇప్పుడు పెనానికి నూనె రాసుకోవాలి. దోసకాయ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని పెనానికి రొట్టెలాగా సన్నగా ఒత్తుకోవాలి.

6. అంచుల వెంబడి నూనె వేసుకుని బాగా కాల్చుకోవాలి. రెండువైపులా బంగారు వర్ణంలోకి వచ్చేలా కాల్చుకుంటే కీర దోసకాయ రొట్టె రెడీ అయినట్లే.

7. దీనికి ఏ చట్నీ అవసరం లేదు. ఇష్టం ఉంటే పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చు.

కీరదోసలో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. దీనికి శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. ఈ పోషకాలు అందాలంటే కీరదోసను ఏదో రకంగా ఆహారంలో చేర్చుకోవాల్సిందే. ఈ రెసిపీని ఒకసారి ప్రయత్నించి చూడండి.