రామ నవమి ప్రత్యేకం.. పూరి పానకం, దీని రుచి తెప్పిస్తుంది మీకు పూనకం!
పండగ నాడు ఇంట్లో చేసే ప్రత్యేకమైన వంటకాలు కూడా మన కడుపుకు పండగలా ఉంటాయి. ఈ శ్రీరామ నవమి నాడు మీలోని ఆత్మరాముడ్ని సంతృప్తిపరిచే రుచికరమైన రెసిపీ ఇక్కడ అందిస్తున్నాం...
పండగల కోసం ఇంట్లో చేసుకునే కొన్ని ప్రత్యేకమైన వంటకాలు మన పాత మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెస్తాయి. అందులో 'పానకం పూరి' కూడా ఒకటి. ఈ వేసవికాలంలో ఎన్నో రకాల మామిడి పండ్లు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మంచి తీపి రకాలైన మామిడిపండ్లను ఎంచుకొని పానకం చేసుకొని పూరీతో అద్దుకొని తింటే ఎంతో గమ్మత్తుగా ఉంటుంది.
ముఖ్యంగా పండగ పూట చాలా మంది ఉపవాసం ఉంటారు. పానకం పూరి రెసిపీ వారిని ఈ రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. రామ నామ జపంతో రసాలూరే మామిడి పానకం స్వీకరిస్తే ఒంట్లోని ఆత్మారాముడు కూడా సంతృప్తిపడతాడు. మరి ఫెస్టివల్ స్పెషల్ పానకం పూరీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి..
పానకం తయారీకి కావాల్సిన పదార్థాలు
- 3 బాగా కండ కలిగిన మామిడి పండ్లు (ఎలాంటి రకమైన ఎంచుకోవచ్చు)
- మామిడిపండు తీపి తక్కువగా ఉంటే 1 టేబుల్ స్పూన్ చక్కెర
- ¼ కప్పు పాలు
- ¼ టీస్పూన్ ఏలకుల పొడి
- కుంకుమ పువ్వు (ఐచ్ఛికం)
- ¼ tsp అల్లం లేదా శొంటి (ఐచ్ఛికం)
పూరి కోసం:
- 2 కప్పులు గోధుమ పిండి
- ¼ స్పూన్ ఉప్పు
- పిండిముద్ధ చేయడానికి అవసరమైనంత నీరు
- పూరీలను డీప్ ఫ్రై చేయడానికి సరిపడే నూనె.
ఇక పూరీలను ఎలా చేసుకోవాలో తెలిసిందే. పిండి ముద్దలను చిన్నచిన్న ముద్దలుగా చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఒత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేస్తే పూరీలు సిద్ధమవుతాయి.
పానకం తయారు చేసుకునే విధానం:
- మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తొక్క తీయాలి.
- ఆ తరువాత పండ్లను ముక్కలుగా కోయాలి, టెంకను తీసివేయాలి.
- ఆపై ఈ మామిడి పండ్ల ముక్కలను ఒక మిక్సీ బ్లెండర్లో వేసి, పైన పేర్కొన్న పదార్థాలను కూడా వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి.
- చిక్కని జ్యూస్‌ను గిన్నెలలోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.
ఈ పానకాన్ని పూరీతో అంటించుకుంటూ తింటే దాని టేస్టే వేరు.
సంబంధిత కథనం