Dora cake: ఓవెన్, గుడ్లు అవసరం లేని డోరా కేక్, డోరేమాన్ ఫేవరైట్ స్నాక్ పిల్లలకూ చేసివ్వండి..
Dora cake: డోరేమాన్, నోబితాకు ఇష్టమైన డోరాకేకులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వాటి తయారీ ఎలాగో చూసేయండి.
డోరేమాన్ కార్టూన్ అంటే పిల్లలకే కాదు పెద్దలకూ తెగ ఇష్టం. ఆ కార్టూన్‌లో డోరేమాన్, నోబితా ఎప్పుడూ చేతిలో పట్టుకుని డోరా కేకులు తింటుంటారు. ఆ కేకుల్ని మీరూ ఇంట్లో చేయొచ్చు. వీటి తయారీకి గుడ్లు అవసరం లేదు, ఓవెన్ అవసరం లేదు. చాలా సింపుల్ గా రెడీ అవుతాయి. డోరేమాన్ కార్టూన్ చూస్తే మీరు, పిల్లలు ఈ డోరాకేకులు తింటూ ఎంజాయ్ చేయండి. వాటి తయారీ చూసేయండి.
డోరా కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు మైదా పిండి
ముప్పావు కప్పు పంచదార (పొడిగా చేసుకోవాలి)
4 చెంచాల మిల్క్ మెయిడ్ లేదా కండెన్స్డ్ మిల్క్
సగం చెంచా బేకిగ్ పౌడర్
1 చెంచా తేనె
1 టీస్పూన్ వెనీలా ఎసెన్స్
సగం కప్పు పాలు
1 చెంచా బటర్
ఫిల్లింగ్ కోసం హాజెల్ నట్ బటర్, ఆల్మండ్ బటర్, పీనట్ బటర్ ఏదైనా తీసుకోవచ్చు.
డోరా కేక్ తయారీ విధానం:
1. ముందుగా ఒక పెద్ద వెడల్పాటి పాత్ర తీసుకోవాలి. అందులో మైదాను జల్లిస్తూ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పొడిపొడిగా ఉంటుంది. ఉండలు ఉండవు.
2.అందులోనే జల్లించుకుంటూ పంచదార పొడి కూడా వేసుకోవాలి.
3. అందులోనే కండెన్స్డ్ మిల్క్, బేకింగ్ పౌడర్, తేనె, వెనీలా ఎసెన్స్, పాలు, బటర్ వేసుకుకోవాలి.
4. అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. విస్కర్ తో బాగా కలుపుకోవాలి. దానివల్ల గాలి నిండి పిండి తేలిగ్గా అవుతుంది.
5. ఇప్పుడు ఒక నాన్‌స్టిక్ పెనం పెట్టుకోవాలి. దానిమీద అంతటా బటర్ రాసుకోవాలి. ఒక గరిటెడు పిండి పోసుకోవాలి. వెడల్పుగా కొద్దిగా అనాలి. లావుగానే ఉండాలీకేకులు.
6. ఒకవైపు కాస్త రంగు మారి బంగారు వర్ణం లోకి రాగానే మరోవైపు కూడా మళ్లీ రంగు మారేదాకా కాల్చుకోవాలి. ఇవి లావుగా వేసుకోవడం వల్ల మధ్యలో కాస్త ఎక్కువగా పొంగి చూడ్డానికి కేకు లేదా బ్రెడ్ లాగా కనిపిస్తాయి.
7. ఇప్పుడు ఒక కేక్ తీసుకుని దాని మీద మీకిస్టమైన స్ప్రెడ్ లేదా ఏదైనా బటర్ రాసుకోవాలి. దానిమీద మరో కేక్ పెట్టి కాస్త నొక్కాలి. అంతే.. డోరా కేకులు రెడీ. వెంటనే తినేస్తే చాలు.