Telugu News / Lifestyle /
Capsicum Rice: క్యాప్సికం, ఆలూ రైస్.. లంచ్ బాక్స్ లోకి పర్ఫెక్ట్ రెసిపీ..
Capsicum Rice: చిటికెలో సిద్ధమయ్యే క్యాప్సికం రైస్ లంచ్ బాక్స్ లోకి పర్ఫెక్ట్ రెసిపీ. దాన్నెలా తయారు చేయాలో పక్కా కొలతలతో సహా చూసేయండి.
క్యాప్సికం రైస్ (flickr)
క్యాప్సికం, బంగాళదుంప వేసుకుని చేసిన పులావ్ ఎప్పుడైనా ప్రయత్నించారా. క్యాప్సికం కూర చేస్తే కొంతమందికి నచ్చదు. అలాంటప్పుడు ఇలా క్యాప్సికం, బంగాళదుంపలు వేసి రైస్ చేయొచ్చు. లంచ్ బాక్స్ లోకి పెట్టిచ్చినా పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినేస్తారు.
ట్రెండింగ్ వార్తలు
కావాల్సిన పదార్థాలు:
2 చెంచాల నెయ్యి
అరచెంచా జీలకర్ర
చిన్న దాల్చిన చెక్క ముక్క
1 బిర్యానీ ఆకు
1 కరివేపాకు రెబ్బ
చిటికెడు ఇంగువ
1 ఉల్లిపాయ తరుగు
1 టమాటా తరుగు
పుదీనా తరుగు
2 బంగాళదుంపలు, ముక్కలు
1 క్యాప్సికం, తరుగు
2 చెంచాల బటానీలు
పావు చెంచా పసుపు
2 చెంచాల పెరుగు
సగం చెంచా నిమ్మరసం
కొద్దిగా కొత్తిమీర
తయారీ విధానం:
- ఒక కుక్కర్‌లో రెండు చెంచాల నెయ్యి వేసుకుని వేడిచేయాలి. కాసేపాగి జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి.
- కాసేపాగి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అందులో టమాటా ముక్కలు, పుదీనా వేసుకుని మెత్తబడేదాకా వేగనివ్వాలి.
- అందులో బంగాళదుంప ముక్కలు, క్యాప్సికం ముక్కలు, బటానీ, పసుపు, ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి.
- అందులో ఒక చెంచా గరం మసాలా వేసుకోవాలి. పెరుగు కూడా వేసుకుని కలుపుతూ నూనె తేలేదాకా వేగనివ్వాలి.
- అందులోనే 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కాస్త మరుగు పట్టాక బియ్యం, నిమ్మరసం, కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి.
- ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. దీన్ని రైతా, కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే సరి. క్యాప్సికం ఆలూ రైస్ రెడీ..