Alu Bhujia: ఆలూ భుజియా.. ఓపికుంటే ఇంట్లోనే గంపెడైనా చేసుకోవచ్చు..
Alu Bhujia: ఆలూ భుజియా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.

ఆలూ భుజియా తినాలంటే బయట రెడీమేడ్‌గా దొరికే ప్యాకెట్లే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. చూడ్డానికి సేవ్ లాగా ఉండే ఈ ఆలూ బుజియా ఎక్కువగా బయటే కొనుక్కుని తింటూ ఉంటాం. కానీ కాస్త ఓపిక తెచ్చుకుంటే ఇంట్లోనే చాలా రుచిగా తయారు చేయొచ్చు. రుచిలో ఏ మార్పు ఉండదు. పిల్లలకు మంచి స్నాక్ లాగా ఇవ్వచ్చు. దాని తయారీ ఎలాగో చూసేయండి.
ఆలూ భుజియా తయారీకి కావాల్సిన పదార్థాలు:
2 బంగాళదుంపలు
1 కప్పు శనగపిండి
తగినంత ఉప్పు
1 చెంచా కారం
1 చెంచా ఆమ్‌చూర్ పొడి
సగం చెంచా గరం మసాలా
సగం చెంచా చాట్ మసాలా
పావు చెంచా ఇంగువ
డీప్ ఫ్రైకి సరిపడా నూనె
ఆలూ భుజియా తయారీ విధానం:
1. ముందుగా బంగాళదుంపల్ని 3 విజిళ్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. తొక్క తీసేసి మెత్తగా మెదుపుకోవాలి. కుక్కర్లో ఉడికించుకోకపోతే ముందుగానే తొక్కతీసి చిన్న ముక్కలు కోసుకుని నీళ్లలో ఉడికించుకోవాలి.
2. ఉడికిన బంగాళదుంపల్ని మెత్తగా ఎలాంటి ముక్కలు లేకుండా పేస్ట్ లాగా మెదుపుకోవాలి.
3. ఇప్పుడు మరొక పాత్ర తీసుకుని అందులో శనగపిండి వేసుకోవాలి.
4. అందులోనే గరం మసాలా, కారం, ఆమ్ చూర్ పొడి, ఇంగువ, చాట్ మసాలా, ఉప్పు కూడా వేసుకోవాలి. అన్నీ బాగా కలిపేసుకోవాలి.
5. చాట్ మసాలాను పిండి తడుపుకునేటప్పుడు కలుపుకోవచ్చు. లేదంటే భుజియా చేయడం పూర్తయ్యాక మీద చల్లుకోవచ్చు.
6. ఇప్పుడు మసాలాలన్నీ కలుపుకున్న పిండిని బంగాళదుంప ముద్దలో వేసుకోవాలి. అన్నీ కలిసేలా ముద్దలా కలుపుకోవాలి.
7. ముందు కలిపేటప్పుడు పొడిగా అనిపిస్తుంది. అప్పుడే నీళ్లు కలిపేయకూడదు. పిండిని కలుపుతూ ఉంటే మెత్తగా మారుతుంది.
8. ఒక అయిదు నిమిషాలు కలుపుకున్నాక అవసరం అయితేనే నీళ్లు కలుపుకోవాలి.
9. ఇప్పుడు సేవ్ ఒత్తుకునే మెషీన్ తీసుకుని లోపలి వైపు నూనె రాసుకుని పిండిని పెట్టుకోవాలి.
10. సన్నం సేవు ఒత్తుకునే అచ్చు దీనికోసం వాడుకోవచ్చు. లేదంటే కాస్త మందంగా చేసే సేవు అచ్చు అయినా వాడొచ్చు.
11. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. వేడెక్కాక సేవు ఒత్తుకోవాలి.
12. నూనెలో రంగు మారేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే.. బయటకు తీసుకుంటే ఆలూ భుజియా రెడీ అయినట్లే.