Tomato Bath: పుల్లగా, కారంగా టమాటా బాత్.. పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..-know how to cook tomato bath in tastier and easier way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tomato Bath: పుల్లగా, కారంగా టమాటా బాత్.. పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..

Tomato Bath: పుల్లగా, కారంగా టమాటా బాత్.. పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..

Koutik Pranaya Sree HT Telugu
Nov 07, 2023 12:00 PM IST

Tomato Bath: కమ్మటి టమాటా బాత్ రెసిపీ లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుంది. దాన్ని మరింత రుచిగా ఎలా చేయాలో పక్కా కొలతలతో సహా చూసేద్దాం.

టమాటా బాత్
టమాటా బాత్ (https://creativecommons.org/licenses/by-sa/4.0)

లంచ్ బాక్స్ లోకి అన్నం కూర వేరు వేరుగా తీసుకెళ్లడం కన్నా మంచి ఫ్లేవర్డ్ రైస్ చేసుకుని తీసుకెళ్లడం హాయిగా ఉంటుంది. తృప్తిగా తినొచ్చు. అలాంటిదే ఈ టమాటా బాత్. పుల్లగా కారంగా ఉండే ఈ టమాటా బాత్ లంచ్ బాక్స్ లోకి, మధ్యాహ్న భోజనంలోకి చాలా బాగుంటుంది. దాన్నెలా సులభంగా తయారు చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు ఉడికించుకున్న అన్నం

4 లేదా 5 టమాటాలు

2 ఉల్లిపాయలు

అరచెంచా అల్లం వెల్లుల్లి ముద్ద

పావు చెంచా ఆవాలు

పావు చెంచా మినప్పప్పు

పావు చెంచా శనగపప్పు

1 కరివేపాకు రెబ్బ

కొద్దిగా కొత్తిమీర

2 చెంచాల నెయ్యి లేదా నూనె

మసాలా కోసం:

పావు కప్పు ఎండు కొబ్బరి

చిన్న దాల్చిన చెక్క ముక్క

1 యాలక్కాయ

1 లవంగం మొగ్గ

4 పచ్చిమిర్చి

తయారీ విధానం:

  1. ముందుగా టమాటాల్ని, ఉల్లిపాయల్ని పొడవుగా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక కడాయిలో నూనె లేదా నెయ్యి వేసుకుని వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కాస్త రంగు మారాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని కలుపుకోవాలి.
  3. పచ్చి వాసన పోగానే టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
  4. మిక్సీలో కొబ్బరి ముక్కలు, 2 చిన్న ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, యాలకులు, పచ్చిమిర్చి, లవంగాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలాగా చేసుకోవాలి.
  5. ఈ ముద్దను ఉడుకుతున్న టమాటాల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. టమాటాలు పూర్తిగా మెత్తబడి, మసాలా పచ్చివాసన పోయాక కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి.
  6. ముందుగా ఉడికించుకున్న అన్నం ఈ మిశ్రమంలో కలుపుకుంటే సరి. రుచిగా ఉండే టమాటా బాత్ రెడీ.