Tofu tikka masala: చట్‌పటా టోఫు టిక్కా మసాలా.. చపాతీల్లోకి అదిరిపోతుంది..
Tofu tikka masala: టోఫుతో టిక్కా మసాలా చేసుకుని రుచి చూడండి. పక్కా కొలతలతో దాన్నెలా తయారు చేయాలో చూడండి.

టోఫు టిక్కా మసాలా
పన్నీర్ కొనడానికి మార్కెట్ వెళ్లినప్పుడు మన కళ్లకు కనిపించేలా ముందు వరసలో పెట్టిన టోఫును పక్కకు నెట్టేసి వెనకాల ఉన్న పన్నీర్ తీసుకుంటాం. ఎందుకోమరి టోఫు జోలికి పెద్దగా పోము. కానీ అది రుచిలో తీసిపోదు. దాంతో బోలెడు వంటకాలు చేసుకోవచ్చు. అలాంటిదే టోఫు టిక్కా మసాలా.. దాని తయారీ ఎలాగో చూసేయండి.
టోఫు టిక్కా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు పెరుగు
1 చెంచా నిమ్మరసం
1 చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
1 చెంచా ధనియాల పొడి
1 చెంచా జీలకర్ర పొడి
సగం చెంచా పసుపు
1 చెంచా కారం
2 చెంచాల గరం మసాలా
200 గ్రాముల టోఫు
4 చెంచాల వంటనూనె
1 క్యాప్సికం, పెద్ద ముక్కలు
2 ఉల్లిపాయలు, పెద్ద ముక్కలు
2 బిర్యానీ ఆకులు
2 టమాటాలు, సన్నం ముక్కలు
1 టమాటా గుజ్జు
4 చెంచాల జీడిపప్పు
2 చెంచాల కసూరీ మేతీ
గుప్పెడు కొత్తిమీర
తగినంత ఉప్పు
టోఫు టిక్కా మసాలా తయారీ విధానం:
- ఒక పెద్ద బౌల్ లో పెరుగు, నిమ్మరసం, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
- ఇందులో ముక్కలుగా చేసి పెట్టుకున్న టోఫు వేసుకోవాలి. అన్ని అంటుకునేలా చూడాలి. అరగంటసేపు మ్యారినేట్ చేయాలి.
- ఒక ప్యాన్ పెట్టుకుని అందులో రెండు చెంచాల నూనె వేసుకోవాలి. వేడెక్కాక మ్యారినేట్ చేసుకున్న టోఫు ముక్కల్ని పెట్టుకుని అన్ని వైపులా కాల్చుకోవాలి.
- ఇప్పుడు అదే ప్యాన్‌లో పెద్దగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకుని రెండు నిమిషాల పాటూ వేయించుకోవాలి. వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
- సాస్ కోసం అదే ప్యాన్ లో చెంచా నూనె వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, ఉప్పు, మిరియాల పొడి వేసుకుని వేయించుకోవాలి.
- కాస్త రంగు మారాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. కాస్త పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు , టమాటా గుజ్జు కూడా వేసుకుని కలుపుకోవాలి.
- జీడిపప్పు, ధనియాల పొడి, పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకుని కలుపుకోవాలి. అన్నీ కలుపుకుని నిమిషం పాటూ వేగనివ్వాలి.
- ఈ మిశ్రమాన్ని చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలి. అంతే సాస్ రెడీ అయినట్లే.
- ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసుకుని వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని రంగు మారేదాకా వేయించుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకుని మగ్గనివ్వాలి.
- కసూరీ మేతీ, గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్ టోఫు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి.
- ఒక నిమిషం అన్నీ కలుపుకున్నాక మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని కలుపుకోవాలి.
- ఇప్పుడు గ్రేవీ కాస్త పలుచగా ఉండాలంటే కప్పు నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. ఒక పదినిమిషాలు మగ్గనిచ్చి చివరగా కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటే టోఫు టిక్కా మసాలా రెడీ.
టాపిక్