Stuffed Capsicum Curry: నోరూరించే స్టఫ్డ్ క్యాప్సికం కర్రీ.. ఒక్కసారి తింటే ఫ్యాన్ అయిపోతారు..
Stuffed Capsicum Curry: టేస్టీగా ఉండే స్టఫ్డ్ క్యాప్సికం కర్రీ తయారీ చాలా సులువు. పక్కా కొలతలతో దాన్నెలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.
స్టఫ్డ్ క్యాప్సికం కర్రీ (instagram)
ఇంటిళ్లిపాదీ ఇష్టంగా తినే కూర చేయాలనుకుంటే వెంటనే ఈ స్టఫ్డ్ క్యాప్సికం ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే స్నాక్ లాగా లటుక్కున్న క్యాప్సికం నోట్లో వేసేసుకుంటారు. ఈ స్టఫ్డ్ క్యాప్సికం చపాతీ, రైస్ తో కూడా చాలా బాగుంటుంది.
కావాల్సిన పదార్థాలు:
5 క్యాప్సికం కాస్త పెద్దవి
2 బంగాళదుంపలు
100 గ్రాముల పన్నీర్
1 ఉల్లిపాయ, సన్నటి ముక్కలు
పావు కప్పు పచ్చి బటానీ (ఆప్షనల్)
పావు కప్పు ఉడికించిన స్వీట్ కార్న్ (ఆప్షనల్)
2 పచ్చిమిర్చి
3 వెల్లుల్లి రెబ్బలు
చిన్న అల్లం ముక్క
అరచెంచా జీలకర్ర
చెంచా కారం
తగినంత ఉప్పు
సగం చెంచా పసుపు
అరచెంచా ధనియాల పొడి
అరచెంచా గరం మసాలా
కొద్దిగా ఆమ్‌చూర్ పొడి
కొద్దిగా కొత్తిమీర తరుగు
2 చెంచాల వంటనూనె
తయారీ విధానం:
- ముందుగా కడాయిలో నూనె వేసుకుని వేడికాగానే జీలకర్ర వేసుకోవాలి. కాస్త చిటపటమన్నాక అల్లం తరుగు, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి.
- అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. అవి కాస్త రంగు మారాక ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, అమ్‌చూర్ పొడి వేసుకొని కలుపుకోవాలి.
- ఒక నిమిషం ఆగి మసాలాలు వేగాక ఉడికించిన బంగాళదుంపల్ని బాగా మెదిపి వేసుకోవాలి. మసాలా అంతటా అంటేలాగా కలియబెడుతూ ఉండాలి.
- ఈ మిశ్రమంలోనే ఇష్టమైన కూరగాయ ముక్కల్ని ఉడికించుకుని వేసుకోవచ్చు. లేదా వేసుకోకపోయినా పరవాలేదు.
- పన్నీర్ కూడా కలుపుకుని, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. స్టఫ్ఫింగ్ కోసం మిశ్రమం సిద్ధం అయినట్లే.
- ఇప్పుడు క్యాప్సికం పైన తొడిమ దగ్గర కట్ చేసుకోవాలి. అందులో స్టఫ్ఫింగ్ పూర్తిగా నిండుగా పెట్టుకోవాలి. కాస్త గట్టిగా మిశ్రమాన్ని ఒత్తుకోవాలి.
- ఇప్పుడు కాస్త లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. అందులో రెండు చెంచాల నూనె వేసుకుని వేడెక్కాక స్టఫ్ చేసుకున్న క్యాప్సికం సర్దుకోవాలి.
- అలా క్యాప్సికం అన్ని వైపులా ఉడికి, రంగు మారేవరకు కలుపుతూ ఉండాలి. మూత పెట్టుకుని మగ్గనిస్తే పది నిమిషాల్లో క్యాప్సికం ఉడికిపోతాయి.
- దీన్ని వేడివేడిగా చపాతీలతో, అన్నంతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది.