ద్రాక్షపండ్లతో కర్రీ ఏంటీ అనుకోకండి. ఇది ప్రత్యేకమైన రాజస్థానీ వంటకం. ఫూల్ మఖానా, ద్రాక్ష పండ్లను కలిపి ఈ కూర చేస్తారు. రుచికరంగా ఉండే మసాలా తయారు చేసి ఆ గ్రేవీలో మఖానాను, పచ్చి ద్రాక్షను ఉడికిస్తారు. ఈ కర్రీ చపాతీలు, అన్నం, పూరీల్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. తినేటప్పుడు పుల్లగా కారంగా తియ్యగా ప్రత్యేక రుచితో ఉంటుందీ కూర. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో వివరంగా చూసేయండి.
పావు కేజీ పచ్చ రంగు తాజా ద్రాక్ష
కప్పున్నర ఫూల్ మఖానా
3 చెంచాల నెయ్యి
2 బిర్యానీ ఆకులు
1 చెంచా జీలకర్ర
1 చెంచా ధనియాలు
సగం చెంచా సోంపు
1 చెంచా మిరియాలు
1 చెంచా అల్లం ముద్ద
1 కప్పు ఉల్లిపాయ ముక్కలు
ఏడెనిమిది ఎండుమిర్చి
1 చెంచా వెల్లుల్లి ముక్కలు
1 కప్పు పెరుగు
తగినంత ఉప్పు
1 చెంచా మిరియాల పొడి
సగం చెంచా పసుపు
చెంచా ధనియాల పొడి
సగం చెంచా నల్లుప్పు
1 చెంచా కసూరీ మేతీ
పావు కప్పు కోవా
గుప్పెడు కొత్తిమీర
1. మఖానా ద్రాక్ష్ కర్రీ తయారు చేయడానికి ముందుగా ద్రాక్షపండ్లను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే మఖానాను కడాయిలో కరకరలాడేలా వేయించుకోవాలి.
2. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసుకుని వేడెక్కాక అందులో మసాలాలన్నీ వేసుకోవాలి. అంటే బిర్యాని ఆకులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, సోంపు, మిరియాలు, వెల్లుల్లి వేసి వేయించాలి. మసాలా దినుసులన్నీ వేగనివ్వాలి
3. సన్నగా తరిగిన అల్లం వేసి సువాసన వచ్చే వరకు ఆగాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. అవి బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేయించుకోవాలి.
4. ఈలోపు పది నిమిషాల పాటూ నానబెట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి ముక్కలు కలిపి మిక్సీ పట్టుకోవాలి. దీంతో కూరకు మంచి రంగు రుచి వస్తాయి.
5. అలాగే పెరుగులో మసాలాలు వేసి బాగా కలుపుకోవాలి. అంటే పసుపు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నల్లుప్పు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు మిశ్రమాన్ని వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి.
6. బాగా కలుపుతూ ఉండాలి. కాసేపటికి చుట్టూ నూనె తేలుతుంది. అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి మిశ్రమం వేసుకుని మళ్లీ మరోసారి కలియబెట్టుకోవాలి. రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి.
7. ఇప్పుడు మీగడ, కోవా, 1/4 కప్పు నీళ్లు పోసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. కప్పు నీళ్లు పోసుకుని మరోసారి కలుపుకోవాలి. తర్వాత, మఖానాను వేసి 3-4 నిమిషాలు ఉడకబెట్టాలి. దీని తరువాత, ద్రాక్షపండ్లు వేసి గ్రేవీని మరో 2-3 నిమిషాలు ఉడికించాలి. చివరగా కసూరీ మేతీ, కొత్తిమీర తరుగు వేసుకుని దించేసుకుంటే చాలు. షాహీ మఖానా అంగూర్ రెడీ.