Immunity Halwa: చలికాలంలో రోజూ ఒక చెంచా ఈ హల్వా తినండి.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది..
Immunity Halwa: చలికాలంలొ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం.అలా ఆరోగ్యం పెంచే హల్వా రెసిపీ ఒకటి తెలుసుకోండి. రోజు ఒకచెంచా తింటే చాలు. ఏ సమస్యా ఉండదు.
శీతాకాలంలో మంచు ఎక్కువగా ఉంటుంది. చలి గాలులూ ఇబ్బంది పెడతాయి. ఇక ఇలాంటి వాతావరణంలో బయట తిరిగి వస్తే చాలు.. చాలా మందికి జలుబు, దగ్గు, జ్వరం.. లాంటివి చుట్టు ముడతాయి. అందుకనే ఈ కాలంలో మనం మన రోగ నిరోధక శక్తిని తప్పకుండా పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకు సహకరించే అల్లం హల్వా ఒక దాన్ని ఇప్పుడు తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. దీన్ని రోజుకో స్పూను తింటే చాలు. మనం ఎక్కువగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాం. గొంతు నొప్పి, దగ్గు, జలుబు లాంటి శ్వాస కోశ సంబంధమైన సమస్యల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది.
అల్లం హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు :
రోగ నిరోధక శక్తిని ఎంతగానో పెంచే అల్లం హల్వా తయారు చేయడానికి తురుముకున్న అల్లం, నెయ్యి, పసుపు, బెల్లం, మిరియాలు కావాల్సి ఉంటుంది. వీటిని సిద్ధం చేసి పెట్టుకుంటే చాలు. దీన్ని తయారు చేయడం ఎంతో సులభం.
అల్లం హల్వా తయారీ విధానం :
- ముందుగా స్టౌ వెలిగించి మందపాటి కడాయిని పెట్టండి. అది కాస్త వేడయ్యాక అందులో రెండు మూడు స్పూన్ల దాకా నెయ్యిని వేసి వేడి కానివ్వాలి.
- తర్వాత అందులో తురుముకున్న అల్లాన్ని పావు కప్పు వరకు వెయ్యాలి. నెయ్యిలో దాన్ని బాగా వేగనివ్వాలి. తర్వాత అందులో నల్ల మిరియాల్ని పొడి చేసి వేసుకోవాలి.
- అలాగే రెండు చిటికెళ్ల పసుపును కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేలా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి తగినంత బెల్లం పొడిని వేసి కలపాలి.
- వేడి తగిలే సరికి బెల్లం కరిగిపోయి పాకం వస్తుంది. ఆ పాకం అంతా మరిగి దగ్గర బడి హల్వా కాస్త చిక్కబడుతుంది. కాస్త గట్టిపడ్డాక స్టౌ కట్టేసుకోవాలి.
- చల్లారిన తర్వాత ఈ మిశ్రమం అంతటినీ గాజు సీసాలోకి తీసుకుని మూత పెట్టుకోవాలి. ఇష్టం ఉంటే చిన్న ముక్కల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే ఫ్రిజ్‌లో అయినా పెట్టుకోవచ్చు.
- అయితే మళ్లీ దీన్ని తినాలని అనుకున్నప్పుడు ఫ్రిజ్ టెంపరేచర్‌లో తినకూడదు. దాన్ని కాసేపు బయటకు తీసుకుని పెట్టుకుని అది సాధారణ గది ఉష్ణోగ్రతకు వచ్చాక మాత్రమే తినాల్సి ఉంటుంది.
ఎలా తినాలి :
తయారు చేసుకున్న అల్లం హల్వాను రోజుకు ఒక స్పూను చొప్పున ఉదయాన్నే తినాలి. దీన్ని తినేప్పుడు రోజూ రెండు తులసి ఆకుల్ని ముక్కలు చేసుకుని దీనిపై చల్లుకుని తింటే ఇది మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. చిన్న పిల్లలైతే రోజుకు అర స్పూను చొప్పున దీన్ని తింటే సరిపోతుంది. అదే పెద్ద వారికైతే ఒక పెద్ద స్పూను వరకు తినొచ్చు.