Pumpkin Pulusu: గుమ్మడికాయ ముక్కల పులుసు ఇలా పెట్టి చూడండి.. పర్ఫెక్ట్‌గా వస్తుంది..
Pumpkin pulusu: ఆంధ్రా స్పెషల్ గుమ్మడికాయ ముక్కలు పులుసు ఒక్కసారి తింటే ఫ్యాన్ అయిపోతారు. దాన్నెలా తయారు చేయాలో పక్కా కొలతలతో చూసేయండి.
గుమ్మడికాయ పులుసు (instagram)
గుమ్మడికాయతో కూర ఎలా చేయాలో తెలియట్లేదా. చాలా రుచిగా పులుసుపెట్టి చేసి చూడండి. చింతపండు రసంలో గుమ్మడి కాయ ముక్కలు ఉడికించి చేసుకునే ఈ కూర అన్నం, చపాతీలోకి కూడా బాగుంటుంది. తయారీ ఎలాగో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు:
2 కప్పుల గుమ్మడికాయ ముక్కలు
2 పచ్చిమిర్చి
నిమ్మకాయ సైజంత చింతపండు
2 చెంచాల బెల్లం
1 చెంచా బియ్యం పిండి
1 చెంచా కారం
పావు చెంచా పసుపు
తగినంత ఉప్పు
కొద్దిగా కొత్తిమీర తరుగు
2 చెంచాల నూనె
సగం చెంచా ఆవాలు
సగం చెంచా జీలకర్ర
1 ఎండుమిర్చి
పావు చెంచా ఇంగువ
1 కరివేపాకు రెబ్బ
తయారీ విధానం:
- ఒక కడాయిలో గుమ్మడికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసుకుని ముక్కలు మునిగేనన్ని నీళ్లు పోసుకుని మూత పెట్టుకోవాలి.
- ఈ ముక్కల్ని పది నిమిషాల పాటూ ఉడకనివ్వాలి. అందులోనే కారం, ఉప్పు కూడా కలుపుకోవాలి.
- ఈ లోపు చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రసాన్ని గుమ్మడికాయ ముక్కల్లో పోసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటూ ముక్కల్ని పులుసులో ఉడకనివ్వాలి.
- అందులోనే కొద్దిగా బెల్లం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతా ఉడికిపోయాక ఒక చెంచా బియ్యంపిండిలో నీళ్లు కలుపుకుని ఆ మిశ్రమాన్ని పులుసులో పోసుకోవాలి.
- స్టవ్ కట్టేసి కొత్తిమీర తరుగు కూడా చల్లుకుని దింపేయాలి.
- మరో చిన్న కడాయిలో రెండు చెంచాల నూనె పోసుకుని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి.
- ఈ తాలింపును ముక్కల పులుసులో కలుపుకుంటే సరి. గుమ్మడికాయ ముక్కల పులుసు రెడీ అయినట్లే.