Telugu News  /  Lifestyle  /  Know How To Communicate In Relationships And Its Importance
బంధం దృఢంగా ఉండాలంటే మెరుగైన కమ్యూనికేషన్ ఉండాలి
బంధం దృఢంగా ఉండాలంటే మెరుగైన కమ్యూనికేషన్ ఉండాలి (Pexels)

Communication in relationships: మీ బంధం తుమ్మితే ఊడిపోతుందా? ఇలా మాట్లాడండి..

23 January 2023, 14:32 ISTHT Telugu Desk
23 January 2023, 14:32 IST

Communication in relationships: కేవలం ఒక్క మాట వల్ల బంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మీరు రిలేషన్‌షిప్‌లో ఉంటే మాత్రం మెరుగ్గా కమ్యూనికేట్ చేయడం నేర్చుకోండి. కమ్యూనికేషన్‌లో వీక్‌గా ఉంటే మీ బంధం కూడా తెగిపోయినట్టే.

ఏ ఆరోగ్యకరమైన బంధానికైనా సమర్థవంతమైన కమ్యూనికేషన్ బ్యాక్‌బోన్ లాంటిది. భాగస్వాముల మధ్య నమ్మకం, సాన్నిహిత్యం, అవగాహన పెంపొందించుకోవడానికి ఇది చాలా ముఖ్యం. సరైన కమ్యూనికేషన్ లేనిపక్షంలో రిలేషన్‌షిప్స్ త్వరగా దెబ్బతింటాయి. ఇద్దరి మధ్య ఎడబాటు, ఆవేదన, ఆగ్రహం, ద్రోహం వంటి భావనలకు దారితీస్తాయి. అయితే సరైన సాధనాలు, టెక్నిక్‌ల ద్వారా భాగస్వాములు వారి బంధం బలపడేలా కమ్యూనికేట్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

రిలేషన్‌షిప్స్‌లో ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పరస్పరం అర్థం చేసుకోవడాన్ని, సహానుభూతిని పెంపొందిస్తుంది. వారి ఆలోచనలను, భావాలను, అవసరాలను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసుకోగలగాలి. అప్పుడే పరస్పరం అర్థం చేసుకోగలుగుతారు. సహానుభూతి పొందుతారు. నమ్మకం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య గాఢమైన బంధానికి, సాన్నిహిత్యానికి ఉపయోగపడుతుంది. 

దీనికి తోడు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగుంటే విభేదాలు, వైరుద్ధ్యాలను నిర్మాణాత్మకంగా పరిష్కరించుకోవచ్చు. ఇద్దరూ సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసుకుని వారివారి దృక్కోణాలను ఎక్స్‌ప్రెస్ చేయగలిగినప్పుడు ఒక ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది విభేదాలను తొలగిస్తుంది. బంధం మరింత చెడకుండా ఉంటుంది.

అంతేకాకుండా హెల్తీ కమ్యూనికేషన్ గొప్ప భావోద్వేగపు సాన్నిహిత్యానికి దోహదపడుతుంది. రిలేషన్‌షిప్‌లో ఉన్న వారు ఓపెన్‌గా, నిజాయతీగా వారి వారి ఆలోచనలు, భావాలు పంచుకున్నప్పుడు ఆ రిలేషన్‌షిప్‌లో వారు సేఫ్‌గా, సెక్యూర్‌గా ఉన్నట్టు లెక్క. దీనివల్ల గాఢమైన భావోద్వేగపు బంధానికి, సాన్నిహిత్యానికి ఉపయోగపడుతుంది.

రిలేషన్‌షిప్‌లో కమ్యూనికేషన్ హెల్తీగా ఉండాలంటే 

వినడం నేర్చుకోండి: మీ భాగస్వామి చెప్పేది మీరు ఓపెన్‌ మైండ్‌తో వినండి. అంటే జడ్జ్ చేయకుండా వినాలి. ఆ క్షణంలో వారి సంభాషణను శ్రద్ధగా వినండి.

స్పష్టంగా, దృఢంగా వ్యక్తపరచాలి: మీ ఆలోచనలు, భావాలు నిజాయతీగా, నేరుగా వ్యక్తపరచగలగాలి. కోపం అస్సలు పనికిరాదు. మీరు ఎమోషన‌ల్ అయినా ఉపయోగం ఉండదు. మద్యం మత్తులో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కమ్యూనికేట్ చేయడం వద్దు. మీ భావోద్వేగాలు అదుపులో ఉండవు.

చేతలు జాగ్రత్త: మీరు మాట్లాడేటప్పుడు మీ ముఖం ద్వారా భావాల వ్యక్తీకరణ, మాట తీరు, బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం. ఇవి ఒక్కోసారి మీ మాటల కంటే ఈ చేతలే ఎక్కువగా నష్టపరుస్తాయి.

ఊహలు వద్దు: అవసరమైనప్పుడు స్పష్టంగా చెప్పమని కోరండి. మీకు మీరు ఊహించుకుని మీరు తప్పు చేసినట్టు బాధపడడం కంటే ఫ్రస్ట్రేషన్ మరొకటి ఉండదని గుర్తించండి. అలాగే మీ పార్ట్‌నర్‌పై విశ్వాసం ఉంచండి. అవతలి వ్యక్తి ఏ పరిస్థితుల్లో తప్పు చేశాడో గుర్తించి క్షమించండి.

సహానుభూతిని ప్రాక్టీస్ చేయండి: అంటే మీరు అవతలి వ్యక్తి కోణం నుంచి ఆలోచించడం. అంటే మీ భాగస్వామి ఫీలింగ్స్‌తో ఏకీభవించకపోయినా, వాటిని గుర్తించి వారి కోణంలో ఆలోచించడం, వారి భావాల్ని అనుభవించడం.

పార్ట్‌నర్ సుముఖంగా ఉన్నప్పుడే: మీ వల్ల పార్ట్‌నర్‌కు ఇబ్బంది కలిగిన సందర్భంలో మీతో దూరంగా ఉండేందుకు వారు ప్రయత్నించవచ్చు. ఇలాంటప్పుడు కమ్యూనికేట్ చేయడం కష్టం. వారికి కొంత సమయం ఇచ్చి అప్పుడు కమ్యూనికేట్ చేయడం మేలు. లేదంటే ఈ సమయంలో మీ తప్పు ఒప్పుకుని మీరు సారీ చెప్పినా.. వారు సుముఖంగా లేనప్పుడు మీ ఫీలింగ్స్ పరిగణనలోకి తీసుకోరు.

పదేపదే దెబ్బతింటుందా: మీ రిలేషన్‌షిప్ పదే పదే దెబ్బతింటుంటే మీలో ఉన్న లోపాన్ని గుర్తించండి. మీ పార్ట్‌నర్‌కు ఇబ్బంది కలిగించే మీ ప్రవర్తనను గుర్తించి మార్చుకోండి. లోపాన్ని గుర్తించి సవరించుకోవడంలో తప్పులేదు. లేదంటే పదేపదే అదే ప్రవర్తన మీ మధ్య బంధాన్ని శాశ్వతంగా వీడిపోయేలా చేస్తుంది. మీరు పదేపదే సారీ చెబుతున్నారంటే మీ ప్రవర్తనలో ఏదో లోపం ఉండిఉంటుంది. లేదా మీ పార్ట్‌నర్ విశ్వాసాన్ని మీరు పొందలేకపోయి ఉంటారు. మెరుగ్గా కమ్యూనికేట్ చేయడానికి ముందు ఆ విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్నం చేయండి.