Madhavan's diet: ఏ కష్టం లేకుండా 21 రోజుల్లో బరువు తగ్గానన్న మాధవన్.. ఎలాగో చూడండి
Madhavan's diet: నటుడు మాధవన్ ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఎలా బరువు తగ్గారో ట్విట్టర్లో పంచుకున్నారు. దాని గురించి పూర్తి వివరాలు తెల్సుకోండి.
నటుడు మాధవన్ దర్శకత్వం వహించిన రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ అనే సినిమా మంచి ఆదరణ అందుకుంది. ఈ చిత్రం సమయంలో మాధవన్ చాలా బరువు పెరిగారు. దీని గురించి కర్లీ టెయిల్స్ యూబ్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారాయన. ఈ క్లిప్పింగ్ ను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
పెరిగిన బరువు కఠినమైన ఆహార నియమాలు పాటించి కేవలం 21 రోజుల్లోనే తగ్గగలిగారు. “నా శరీరానికి ఏది మంచిదో అదే తిన్నాను. ఎలాంటి వ్యాయామం చేయలేదు. రన్నింగులు చేయలేదు. ఏ సర్జరీ చేయించుకోలేదు. ధ్యానం లేదు. ఏం లేదు" అని మాధవన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
రాకెట్రీ సమయంలో సెట్స్ లో ఆయన బరువు పెరిగిన ఫొటోలను, బరువు తగ్గిన తర్వాత ఫొటోలను ఆయన పంచుకున్నారు. కేవలం మూడు వారాల్లో బరువు తగ్గడం ఎలా సాధ్యమైందో కూడా వివరంగా చెప్పారు.
మాధవన్ ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ ఎలా చేశారు?
ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్, అలాగే ఆహారాన్ని బాగా నమలడం లాంటి నియమాలు ఆయన బరువు తగ్గడంలో సాయపడ్డాయట. ఆహారాన్ని మింగే ముందు కనీసం 45 నుంచి 60 సార్లు నమిలేవాణ్ని అన్నారు. అలాగే సాయంత్రం పూట 6.45 నిమిషాలకు ఆ రోజులో చివరి భోజనం అయిపోయేది. కేవలం ఉడికించిన ఆహారం మాత్రమే తీసుకున్నారట. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పచ్చి కూరగాయలు, ఆకుకూరలేవీ తినలేదట. ఉదయం మాత్రం కాస్త ఎక్కువ దూరమే వాకింగ్ చేయడం, రాత్రి తొందరగా నిద్రలోకి జారుకునేలా చూసుకునేవారు. పడుకునే కన్నా గంటన్నర ముందు గ్యాడ్జెట్ల జోలికి పోయేవారు కాదట. అంటే స్క్రీన్ టైం లేకుండా చూసుకునేవారు. ఎక్కువగా ద్రవాలు తీసుకునేవారు. ఆకుపచ్చ ఆకుకూరలు, ఆహారాలు తినేవారు. ఇవి తొందరగా జీర్ణం అవుతాయి. ఆరోగ్యానికి కూడా మంచివి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అస్సలే ముట్టుకునేవారు కాదట. ఈ విషయాలన్నీ ఆయనే స్వయానా ట్వీట్ చేశారు కూడా.
ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ వల్ల లాభాలు:
బరువు తగ్గాలనుకుంటున్న వాళ్లలో ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ మంచి ఫలితాలను చూయిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా ఈ డైట్ నియమాలుంటాయి. బరువు తగ్గించడంతో పాటూ గుండె ఆరోగ్యానికి కూడా ఈ డైట్ సాయపడుతుంది. శరీరంలో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కణాల మరమ్మతును వేగిరం చేస్తుంది. కొవ్వును సులువుగా కరిగిస్తుంది. రెండు పూటల తినే భోజనాల మధ్య ఎక్కువ సమయం ఉండేలా చూసుకోవాలి. దానివల్ల శరీరంలో కొవ్వు కరగడమే కాక, తక్కువ కేలరీలూ శరీరంలోకి చేరతాయి.