Gender prediction: వాంతులుంటే అమ్మాయి, తీపి తింటే అబ్బాయి పుడతాడని చెప్పే మాటలు నిజమేనా?
Gender prediction: గర్భం దాల్చిన వెంటనే పుట్టబోయేది మగబిడ్డా లేదా ఆడబిడ్డా అని అందరూ రకరకాల అంచనాలు వేస్తారు. కొన్ని లక్షణాల ఆధారంగా పక్కాగా చెప్పేస్తారు కూడా. అవెంతవరకూ నిజమో తెల్సుకోండి.
మన దేశంలో గర్భధారణ సమయంలో శిశువు లింగాన్ని తెల్సుకోవడం చట్ట విరుద్ధం. అందుకే విదేశాల్లో బిడ్డ పుట్టక ముందే జెండర్ రివీల్ వేడుకలు చేసుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఆ అవకాశం ఉండదు. అందుకే బిడ్డ పుట్టేదాకా ఆడపిల్లా, మగపిల్లాడా అనే ప్రశ్న తప్పకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు గర్బంతో ఉన్న స్త్రీ లక్షణాల కారణంగా లింగం నిర్దారిస్తారు. కొన్ని విషయాలు కూడా చెప్తారు. అవెంత వరకూ నిజమో, అవి అపోహలా కాదా తెల్సుకోండి.
1) తీపి తినడం:
అపోహ: గర్భిణీ స్త్రీకి స్వీట్ల తినాలనే కోరిక ఉంటే పుట్టబోయేది అబ్బాయి అని చెబుతారు. పుల్లని ఆహారం తినాలనిపిస్తే, వాటిమీదే కోరిక ఉంటే అమ్మాయి పుడుతుందని చెబుతారు.
వాస్తవం: మీ బిడ్డ పెద్దయ్యాక స్వీట్ల పట్ల ఇష్టం పెంచుకోవచ్చు. కానీ కడుపులో ఉన్నప్పుడే ఐస్ క్రీం, చాకోలేట్లు కావాలని మాత్రం కోరుకోరు. కేవలం హార్మోన్లలో వచ్చే మార్పుల వల్లే ఇలా తినాలనే కోరికలు ఏర్పడతాయి.
2) మార్నింగ్ సిక్‌నెస్:
అపోహ: ఉదయం లేవగానే నీరసం, వాంతులుండంతో పాటూ రోజంతా అలాగే ఉంటే అమ్మాయి పుడుతుందని చెబుతారు.
వాస్తవం: నిజంగానే హైపెర్మిసిస్ గ్రావిడారమ్ అనే తీవ్రమైన మార్నింగ్ సిక్ నెస్ తో బాధపడుతున్న మహిళలు ఆడపిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే, మగబిడ్డకు జన్మనివ్వబోయే గర్భిణీ స్త్రీలలో కూడా ఈ సమస్య ఉండొచ్చు. దీనికి అవకాశాలున్నా కూడా కేవలం ఈ లక్షణం బట్టే లింగ నిర్దారణ చేయలేరు. ఇది కూడా హార్మోన్లు మారడం వల్ల వచ్చే సమస్య.
3) ఛాతీలో మంట లేదా హార్ట్ బర్న్:
అపోహ: ప్రెగ్నెన్సీలో ఛాతీలో మంట లేదా ఎసిడిటీ లాంటి సమస్యలుంటే పుట్టబోయే బిడ్డకు జుట్టు బాగా ఒత్తుగా ఉంటుందని, అలాగే ఆడపిల్ల పుడుతుందని చెబుతారు.
వాస్తవం: బిడ్డ ఎదిగే కొద్దీ పొట్ట పెరగడం వల్ల ఒత్తిడితో ఆహారం సులభంగా జీర్ణం కాదు. దాంతో ఎసిడిటీ అవ్వడం మొదలవుతుంది. ఇది కేవలం హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల జరుగుతుంది.
4) హృదయ స్పందన:
అపోహ: శిశువు గుండె నిమిషానికి 140 సార్ల కంటే వేగంగా కొట్టుకుంటే అది ఆడపిల్ల అని నమ్ముతారు.
నిజం - ఇది చాలా మంది నమ్మే అపోహ మాత్రమే. దీనికి శిశువు లింగ నిర్దారణకు ఎలాంటి సంబంధం లేదు.
5) రింగ్ టెస్ట్:
అపోహ: మీ పెళ్లి ఉంగరానికి లేదా మీరు ఎప్పుడూ వాడే ఉంగరానికి మీ వెంట్రుకను చుట్టి, ఆ తర్వాత పొట్ట మీద పెట్టాలి. ఉంగరం గుండ్రంగా తిరుగుతుంటే అది అమ్మాయి. అది అటూ ఇటూ ముందుకు వెనక్కి కదిలితే అబ్బాయి అని చెబుతారు.
వాస్తవం: సాంప్రదాయ చైనీస్ వైద్యాన్ని అనుసరించే వ్యక్తులు వేలాడే ఉంగరాన్ని శరీర సహజ శక్తులు పనిచేయడానికి పరీక్ష కోసం వాడతారని చెబుతారు. దీనిని నిరూపించడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు.
6) పొట్ట స్థితి:
అపోహ: ప్రెగ్నెన్సీలో పొట్ట నాభికి మీది వైపున ఎక్కువగా పెరిగితే ఆడపిల్ల అనీ, ఎక్కువగా పొట్ట జారినట్లుగా కిందికి అని ఉంటే అబ్బాయి అని చెబుతారు.
వాస్తవం: గర్భాశయ ఆకారం, స్థితి బట్టి ప్రెగ్నెన్సీలో పొట్ట ఉంటుంది. పుట్టబోయే బిడ్డ పరిమాణం కూడా పొట్ట స్థితిలో మార్పు తెస్తుంది.
7) పొట్ట ఆకారం:
అపోహ: పొట్ట గుండ్రంగా ఉంటే అమ్మాయి. కాస్త కొచ్చగా, ముందుకు వచ్చినట్లుంటే అబ్బాయి.
వాస్తవం: పొట్టలో శిశువు స్థితి ఆధారంగా పొట్ట ఆకారం ఉంటుంది. అంతే తప్ప దీన్ని బట్టి ఆడబిడ్డా, మగబిడ్డా అని చెప్పలేం.
టాపిక్