Makeup for Dussehra: ప్రొఫెషనల్ మేకప్ లుక్ టిప్స్.. ఈ పండగ కోసం మీకోసం..
Makeup for Dussehra: దసరా, బతుకమ్మ పండగలకు మేకప్ తో మెరిసిపోవాల్సిందే. కొన్ని టిప్స్ పాటిస్తే ప్రొఫెషనల్ మేకప్ లుక్ ఇంట్లోనే వస్తుంది. అదెలాగో చూసేయండ.ి
ముందున్నదంతా పండుగల కాలమే. ఈ ప్రత్యేక దినాల్లో టీనేజ్ అమ్మాయిలు, యువతులు మంచి మంచి సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిపోయేందుకు సిద్ధం అవుతుంటారు. ఆ వస్త్రాలకు తగినట్లుగా కొంచెం మేకప్ కూడా తోడైతే మీ ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది. అందుకనే ఇక్కడ కొన్ని మేకప్ టిప్స్ సిద్ధంగా ఉన్నాయి. వాటితో మీ దసరా, బతుకమ్మ లుక్స్ మరింత ఆకర్షణీయంగా మారిపోతాయి. ప్రయత్నించి చూడండి.
మంచి ప్రైమర్‌ని వాడండి :
మేకప్ వేసుకోవడానికి ముందుగా మంచి ప్రైమర్‌ని వాడండి. దీని వల్ల మేకప్ పని మరింత సులభం అవుతుంది. ముఖంపై ఉన్న రంధ్రాలు, గుంటలు, మచ్చల్లాంటివి అన్నీ అంతగా కనిపించవు. అలాగే వేసుకున్న మేకప్‌ని ఎక్కువ సేపు నిలిపి ఉంచేందుకు సహకరిస్తుంది.
కన్సీలర్ :
కొందరికి కను రెప్పల పైన, కళ్ల కింద, గడ్డం కింద.. చర్మం కాస్త నల్లగా ఉంటుంది. ప్రైమర్ అయిన తర్వాత అలాంటి ప్రాంతాల్లో కన్సీలర్‌ని రాసుకోండి. దీన్ని కూడా మీ చర్మపు రంగుకు సరిపోయే షేడ్‌ని తీసుకోండి. బ్రష్ తీసుకుని ట్రయాంగిల్ ఆకారంలో అప్లై చేయండి. దీని వల్ల అది చర్మంలో మరింత కలిసిపోయి మచ్చలు కనిపించకుండా ఉంటాయి.
చర్మానికి తగిన ఫౌండేషన్ :
ప్రైమర్, కన్సీలర్‌లు పూర్తయిన తర్వాత ఫౌండేషన్ వేసుకోవాలి కదా. అందుకు కచ్చితంగా మీ చర్మపు రంగులో కసిలిపోయే రంగును ఎంచుకోండి. మెరుస్తూ ఉండేవి కాకుండా మ్యాట్ ఫినిషింగ్ ఉన్న వాటిని వాడుకోవడం వల్ల సహజమైన లుక్ వస్తుంది. ముఖ్యంగా జిడ్డు చర్మ తత్వం ఉన్నవాళ్లు మ్యాట్ ఫినిషింగ్ ఉన్నవి ఎంచుకోవడం మర్చిపోవద్దు.
కను బొమ్మలను తీర్చిదిద్దండి :
ఎంత మేకప్ వేసుకున్నా కనుబొమ్మల్ని ఒద్దికగా తీర్చి దిద్దితేనే ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కాబట్టి సహజంగా అవి చక్కగా కనిపించేలా పెన్సిల్‌తో షేప్ తీసుకురండి. అలాగే కళ్లకు మీకు నప్పే ఐ షాడో, మస్కరాలను వేసుకోండి. మస్కారాను అవసరం అనుకుంటే రెండు, మూడు సార్లు కోట్ చేసుకోండి. అప్పుడు కను రెప్పలు మరింత కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
బ్లష్ లిప్ స్టిక్ :
పండుగల సమయంలో డ్రెస్సింగ్ కాస్త రిచ్ లుక్‌లోనే ఉంటుంది. దానికి సరిపోయే విధంగా లిప్ స్టిక్‌లను ఎంచుకోండి. మరీ లేత రంగులు ఈ సమయంలో అంతగా నప్పవన్న సంగతి గుర్తుంచుకోండి. దానికి మంచి బోర్డర్ ఇచ్చి పెదవుల ఆకారాన్ని తీర్చి దిద్దండి. అలాగే చెంపలు, దవడ ఎముకల దగ్గర కాస్త బ్లష్‌ని టచప్ చేయండి. ముక్కు ఎముక దగ్గర కాస్త హైలెడ్ చేయండి.
ఇదంతా పూర్తయిన తర్వాత ఈ మేకప్‌ని చెక్కు చెదరకుండా ఉంచుకోవడానికి సెట్టింగ్ స్ప్రేని ఒకసారి స్ప్రే చేసుకోవాలి. దీంతో మీ మేకప్ లుక్ ఈ పండుగకు పర్ఫెక్ట్‌గా తయారవుతుంది. ట్రై చేస్తారా మారి.