Radish benefits: ఈ లాభాలు తెలిస్తే.. శీతాకాలంలో ముల్లంగిని తినే చాన్స్ మిస్ చేసుకోరు..
Radish benefits: శీతాకాలంలో ముల్లంగి తినడం లాభదాయకం. దాని లాభాలు తెలిస్తే ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకుంటారు. అవేంటో చదివేయండి.
కాలానుగుణంగా దొరికే కూరగాయల్ని ఆయా కాలాల్లో తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. శీతాకాలంలో సహజంగానే మన అందరిలోనూ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే శరీర జీవ క్రియ మెల్లగా ఉండటం వల్ల అరుగుదల, గ్యాస్ సమస్యల్లాంటివి చాలా మందిలో ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమస్యలన్నింటికి ముల్లంగి చక్కని పరిష్కారంగా ఉంటుంది. మరి ఈ కాలంలో దీన్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రెండింగ్ వార్తలు
ముల్లంగిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. కప్పు ముల్లంగి ముక్కల్లో 16 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు, పీచు పదార్థం, విటమిన్ సీ, బీలు పుష్కలంగా ఉన్నాయి. రోటి పచ్చడి, కూర, చారు, సాంబారుల్లో వేసుకుని దీన్ని ఆరగించవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ముఖ్యంగా 4 లాభాలు ఉన్నాయి.
1. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది :
సాధారణంగా శీతాకాలంలో జీర్ణ కోశ సంబంధిత సమస్యలు చాలా మందిలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటి వారు ముల్లంగిని తినే ప్రయత్నం చేయాలి. దీనిలో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. అందువల్ల తిన్న ఆహారం ఒక్కసారిగా జీర్ణమై రక్తంలో కలిసిపోదు. ఫలితంగా చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం ముప్పు తగ్గుతుంది. అడిపోనెక్టిన్ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిల హెచ్చుతగ్గులకు కారకమయ్యే హార్మోన్. ముల్లంగిలో అడిపోనెక్టిన్‌ను నియంత్రించే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. అవి గ్లూకోజ్‌ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే దీనిలో ఉండే పీచు పదార్థాలు పేగుల కదలికల్ని మెరుగుపరచడంలో సహకరిస్తాయి. దీంతో మలబద్ధకం సమస్యలు తగ్గుముఖం పడతాయి.
2. రక్త పోటును నియంత్రిస్తుంది :
ముల్లంగిలో పొటాషియం ఎక్కువగా లభ్యం అవుతుంది. ఇది రక్త పోటును నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే దీనిలో ఉండే ఆంథోసైనిన్లు రక్త ప్రసరణను మెరుగుపరిచి రక్త పోటును తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
3. క్యాన్సర్‌లతో పోరాడుతుంది :
ఇష్టారాజ్యంగా పెరిగిపోయే క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో ముల్లంగి సహాయపడుతుంది. దీనిలో క్యాన్సర్లతో పోరాడే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
4. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది :
ఈ కాలంలో చాలా మందికి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకనే ఎక్కువగా వ్యాధుల బారిన పడుతుంటారు. ఈ కాలంలో ముల్లంగి దుంపను తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. దీనిలో నీటి శాతం, పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపించివేయడానికి ఇది సహకరిస్తుంది.