Olympics Medals: ఈఫిల్ టవర్ ఇనుముతో ఒలింపిక్స్ మెడల్స్..బంగారు పతకాల బరువు ఎంతంటే..
Olympics Medals: పారిస్ 2024 ఒలింపిక్స్లో అథ్లెట్లు ఈఫిల్ టవర్ లోని భాగాలతో డిజైన్ చేసిన పతకాలను అందుకుంటారు. ఇది అథ్లెటిక్స్ శ్రేష్టతను పారిస్ ఆకర్షణతో మిళితం చేస్తుంది. ఈ పతకాలు వివరాలు పూర్తిగా తెల్సుకోండి
ఒలింపిక్స్ అంటే గుర్తొచ్చేది బంగారు, రజత, కాంస్య పతకాలు. వీటిలో ఏదో ఒక పతకం తమ మెడలో వేసుకుని పోడియంలో గర్వంగా దేశం తరపున నిలబడడం కోసం ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు పోటీ పడతారు. ఈ ఆటల్లో పతకం సాధిస్తే ఉన్న విలువే వేరు. 2024 సంవత్సరం ప్యారిస్ ఒలింపిక్స్ జులై 26, శుక్రవారం రోజున మొదలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా పతకాలు సాధించే అవకాశం కోసం పోటీ పడుతున్నారంతా.
ప్రతి ఏటా ప్రత్యేకమే:
ఈ పతకాలు అథ్లెటిక్ గొప్పతనానికి చిహ్నాలు. అయితే ప్రతి ఒలింపిక్స్ లో వాటికి కొత్త, ప్రత్యేకమైన ట్విస్ట్ ఇస్తుంది. ఈ ఏడాది ఆ పతకాలు మరీ ప్రత్యేకంగా ఉండనున్నాయి. ఈసారి పతకాలు గెలిచిన అథ్లెట్లు కేవలం కీర్తిని మాత్రమే కాకుండా ఫ్రాన్స్ నగర గొప్ప చిహ్నానికి సంబంధించిన గుర్తునూ తమ వెంట తీసుకెళ్తారు. ఫ్రాన్స్, ప్యారిస్ అంటే ఏం గుర్తొస్తుంది మీకు? ఈఫిల్ టవరే కదా? ప్రపంచ వింతగా పేరొందిన ఈ ఐకానిక్ ఈఫిల్ టవర్ లోని కొంత భాగం ఈ పతకాల తయారీలో వాడారు మరీ. అదెలాగో చూడండి.
ఈఫిల్ టవర్ తో చేసిన ఒలింపిక్ పతకాలు:
పారిస్ 2024 ఒలింపిక్స్ పతకాలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే వాటిలో ఈఫిల్ టవర్ కట్టడంలోని అసలు భాగాలు ఉన్నాయి. ఆగస్టు మధ్య వరకు జరగనున్న 329 ఈవెంట్లలో గెలుపొందిన విజేతలకు ఈ ప్రత్యేక పతకాలు లభిస్తాయి.
పతకాల బరువు:
బంగారు పతకాల బరువు 529 గ్రాములు, రజత పతకాలు 525 గ్రాములు, కాంస్య పతకాలు 455 గ్రాములు బరువులో ఉంటాయి. ప్రతి పతకంలో ఈఫిల్ టవర్ నుండి సేకరించిన 18 గ్రాముల ఇనుముతో చేసిన పనితనం ఉంటుంది. ఈ ఇనుము 20 వ శతాబ్దంలో ఈఫిల్ టవర్‌కు చేసిన అనేక పునరుద్ధరణలు, నిర్వహణ సమయంలో సేకిరంచి పొందుపర్చింది. అంటే ఫ్రాన్స్ ల్యాండ్ మార్క్ అయిన అత్యంత ఐకానిక్ కట్టడ గొప్పతనాన్ని కూడా ఆటగాళ్లు మెడలో ధరించనున్నారన్నమాట. ఈ సృజనాత్మక ఆలోచన వల్ల అథ్లెట్ల విజయంలో పారిస్ వారసత్వమూ భాగం కానుంది. వినడానికే ఈ ఆలోచన చాలా బాగుంది అనిపిస్తుంది కదూ.
పతకాల్లో ఈఫిల్ టవర్ భాగాలను కలిగి ఉండటమే కాకుండా, పతకాల డిజైన్ రూపకల్పన కూడా ఈ ఐకానిక్ కట్టడం నుండి ప్రేరణ పొందింది. సమ్మర్ ఒలింపిక్ పతకాల కోసం చేసిన నీలిరంగు రిబ్బన్ల డిజైన్ ఈఫిల్ టవర్ యొక్క రిబ్బింగ్‌ను గుర్తు చేస్తుంది. వీటిని లగ్జరీ జ్యువెలర్స్ చౌమెట్ డిజైన్ చేశారు. ఈ పతకాలు వెలుగును ఆకర్శించేలా రూపొందించారు. ఇది పారిస్‌కు ఉన్న 'సిటీ ఆఫ్ లైట్స్' అనే మారుపేరును ప్రతిబింబిస్తుంది. పారాలింపిక్ పతకాల కోసం ఇదే విధమైన డిజైన్లను కొద్దిగా మార్పుతో ఎరుపు రంగు రిబ్బన్లతో డిజైన్ చేశారు.