Insect repellents: వర్షాకాలంలో పురుగులు, దోమల బెడదా? ఈ చిట్కాలతో పరిష్కారం..-know best tips and natural repellents for insects in monsoon ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Insect Repellents: వర్షాకాలంలో పురుగులు, దోమల బెడదా? ఈ చిట్కాలతో పరిష్కారం..

Insect repellents: వర్షాకాలంలో పురుగులు, దోమల బెడదా? ఈ చిట్కాలతో పరిష్కారం..

Koutik Pranaya Sree HT Telugu
Jun 27, 2024 06:30 PM IST

Monsoon insect repellents: వర్షాకాలంలో పురుగులు, కీటకాలు, దోమల బెడద ఎక్కువవుతుంది. కొన్ని చిట్కాలతో వీటికి పరిష్కారం దొరుకుతుంది అవేంటో చూడండి.

వర్షాకాలంలో కీటకాల బెడద తగ్గించే చిట్కాలు
వర్షాకాలంలో కీటకాల బెడద తగ్గించే చిట్కాలు (freepik)

వర్షాకాలంలో పురుగులు, బొద్దింకలు, చిన్న చిన్న కీటకాల సమస్య విపరీతంగా పెరుగుతుంది. వర్షం పడ్డ వెంటనే వీటి బెడద మొదలవుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంటి లోపలకు వచ్చేస్తాయి. కొన్ని చిట్కాలు పాటించి ఇంట్లోకి పురుగులు రాకుండా కాపాడుకోవచ్చు. అవేంటో చూడండి.

ఇంట్లో పురుగుల బెడద తగ్గించే చిట్కాలు:

లైట్ రంగులు: 

మామూలుగా ఇంటి బయట తెలుపు రంగు కాంతి వచ్చే బల్బులను వాడతాం. వాటికి పురుగులు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. బదులుగా ఎరుపు రంగు లేదా పసుపు రంగు వెలుతురు నిచ్చే బల్బులను పెట్టేయండి. వీటికి పురుగులు అంతగా రావు.

లైట్లు ఇలా వాడాలి:

బయట వీలైనంత తక్కువ సేపు లైట్లు వేసి ఉంచండి. అలాగే వీలైతే మోషన్ డిటెక్టివ్ లైట్లు వాడండి. వీటివల్ల సగం సమస్య తగ్గుతుంది. మన కదలిక ఉంటేనే ఇవి వెలుగుతాయి. తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతాయి.

సిట్రోనెల్లా:

సిట్రోనెల్లా ఒక గడ్డిజాతి మొక్క. దీనికి సహజంగానే పురుగులను వికర్షించే లక్షణం ఉంటుంది. కాబట్టి సిట్రోనెల్లా నూనెను చల్లడం వల్ల పురుగులు రాకుండా చేయొచ్చు. ఇది సులభంగానే లభ్యం అవుతుంది. లేదంటే సిట్రోనెల్లా వాసన ఉండే క్యాండిళ్లు ఇంట్లో వెలిగించినా వాసనకు పురుగులు రావు.

సహజ రిపెల్లెంట్లు ఇవే:

ఇంట్లో లేదా కిచెన్‌లో కొన్ని సహజంగానే కీటకాలను తరిమికొట్టే మొక్కల్ని పెట్టుకోవాలి. తులసి, ల్యావెండర్, కలబంద, తులసి, నిమ్మగడ్డి, రోజ్మేరీ, పుదీనా.. లాంటి మొక్కల్ని ఒక మూలన పెట్టుకుంటే చిన్ని చిన్న దోమల్లాంటి కీటకాలు రావు.

ఫ్లై మెష్:

వంటల మీద, పండ్లు, కూరగాయల మీద, డైనింగ్ టేబుల్ మీద పెట్టిన వస్తువుల మీద చిన్న చిన్న పురుగులు వచ్చి వాలుతుంటాయి. అలాంటప్పుడు మీద జాలి లాంటిది పెట్టొచ్చు. ఆన్‌లైన్ లో మెటల్ మెష్ బాస్కెట్లు, మెష్ క్యాప్ దొరుకుతాయి. వాటిని వాడితే ఏ ఇబ్బందీ ఉండదు.

ఈ వాసనలకు కీటకాలు రావు:

దోమలు, పురుగులు రాకుండా గది మూలల్లో కర్పూరం వెలగించొచ్చు. రెండు మూడు కర్పూరాలు ప్లేట్ లో పెట్టి వెలిగించి కనీసం పది నిమిషాలు అలా వదిలేయాలి. గది తలుపులు మూసి ఉంచాలి. దాంతో దోమలు కాస్త తగ్గుతాయి. దాంతో పాటే నీలగిరి నూనె, నిమ్మనూనె, ల్యావెండర్ నూనె, పెప్పర్ మింట్ నూనె సమస్య ఎక్కువున్న చోట స్ప్రే చేస్తే పురుగులు రావు.

పేపర్ తో:

లైట్లకు కీటకాలు ఆకర్షించి ఎక్కువవుతాయి. కాబట్టి లైట్ల కింది నూనెలో ముంచి కాగితాన్ని లేదా న్యూస్ పేపర్ వేలాడదీయాలి లేదా అతికించాలి. దీంతో కొన్ని పురుగులు ఆ కాగితానికి అతుక్కుపోతాయి. పురుగులు ఎక్కువగా లేనప్పుడు, చాలా చిన్న చిన్న పురుగులతో ఇబ్బంది ఉంటే ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.

ఈ చిట్కాలతో పాటే కిటికీలకు మస్కిటో నెట్ పెట్టడం, సాయంత్రం అవ్వగానే తలుపులన్నీ మూసి ఉంచడం మర్చిపోవద్దు. అలాగే కిటికీల చుట్టూ ఏమైనా ఖాళీలుంటే వాటిని సిమెంట్ తో నింపేయాలి. బాత్రూంలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడూ పొడిగా ఉండేలా చూడాలి. ఇంటి చుట్టూ నీళ్లు నిల్వ లేకుండా చూడాలి.

 

WhatsApp channel