Bedtime Skincare: పడుకునే ముందు ఈ స్కిన్‌కేర్ రొటీన్ ఫాలో అవ్వండి.. చర్మం మెరిసిపోతుంది..-know best 7 skincare tips to follow before going to bed ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bedtime Skincare: పడుకునే ముందు ఈ స్కిన్‌కేర్ రొటీన్ ఫాలో అవ్వండి.. చర్మం మెరిసిపోతుంది..

Bedtime Skincare: పడుకునే ముందు ఈ స్కిన్‌కేర్ రొటీన్ ఫాలో అవ్వండి.. చర్మం మెరిసిపోతుంది..

HT Telugu Desk HT Telugu

Bedtime Skincare: పడుకునే ముందు చర్మ సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 7 టిప్స్ పాటిస్తే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. అవేంటో తెల్సుకోండి.

స్కిన్ కేర్ రొటీన్ (pexels)

ముఖాన్ని, చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి ముఖ్యంగా టీనేజర్లు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అందు కోసం రకరకాల ఫేస్‌ ప్యాక్‌లు, క్రీములు, మాయిశ్చరైజర్లు, సన్‌ స్క్రీన్ల లాంటి వాటిని వాడేస్తుంటారు. రకరకాల స్కిన్‌ రొటీన్లనూ అనుసరిస్తూ ఉంటారు. అయితే ఒక్క రోజు శ్రద్ధ తీసుకున్నంత మాత్రాన చర్మం ఆరోగ్యవంతంగా కాంతివంతంగా తయారవుతుందని అనుకోవడానికి కుదరదు. అందుకనే ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు స్కిన్‌ కేర్ రొటీన్‌ని అలవాటుగా చేసుకోమని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.

స్కిన్ కేర్ రొటీన్ టిప్స్:

1. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మేకప్‌ లాంటివి ఏమైనా ఉంటే తీసేయండి. ముఖాన్ని మంచి క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోండి. సహజమైన మాయిశ్చరైజర్‌ని అప్లై చేసుకుని మెల్లగా మర్దనా చేసుకోండి. రసాయనాలతో కూడి ఉన్న వాటిని వేటినీ కూడా ఈ సమయంలో ఉపయోగించవద్దు. పొరపాటున మేకప్‌ తీయకుండా పడుకోవడం లాంటివి చేస్తే చర్మ రంధ్రాలు వాటితో పూడుకుపోయి లేని పోని చర్మ సమస్యలు ప్రారంభం అవుతాయి.

2. శరీర చర్మాన్ని కూడా రాత్రి కచ్చితంగా శుభ్రం చేసుకునే నిద్రకు ఉపక్రమించండి. అంటే గోరు వెచ్చటి నీటితో శుభ్రంగా స్నానం చేయండి. అందువల్ల దానిపైన పేరుకుపోయిన వ్యర్థాలు అన్నీ శుభ్రపడతాయి.

3. మిగిలిన ముఖ చర్మంతో పోలిస్తే కళ్ల చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అయితే చాలా మంది ముఖం అంతటికి మాయిశ్చరైజర్ల లాంటివి రాసుకుంటారు. కానీ కళ్ల చుట్టూ వదిలేస్తుంటారు. అలా చేయకండి. కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్తగా చుట్టూ కూడా అప్లై చేయండి.

4. రాత్రి పడుకునే ముందు దాహంగా గనుక అనిపిస్తే కచ్చితంగా నీటిని తాగి మాత్రమే నిద్రపోవడానికి వెళ్లండి. అలాగే ఈ సమయంలో మద్యంలాంటి వాటికి దూరంగా ఉండండి. నీరు మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచితే మద్యం డీ హైడ్రేట్‌ చేస్తుంది.

5. ముఖాన్నైనా, శరీర చర్మానికి అయినా ఏదైనా చేస్తున్నప్పుడు చాలా సున్నితంగా హ్యాండిల్ చేయండి. దానికి ఎక్కువ ఒత్తిడి కలిగించకుండా చూసుకోండి. ఒత్తిడి కలిగే కొద్దీ చర్మం పాడై అనారోగ్యకరంగా తయారవుతుంది.

6. ఎనిమిది గంటల పాటు చక్కగా నాణ్యమైన నిద్ర పోయేందుకు ప్రయత్నించండి. లేదంటే శరీరలో కోర్టిసోల్‌ స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల చర్మంపై ఇన్ఫ్లమేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

7. పడుకునే మంచంపై ఉండే దుప్పటి, తలగడలు సున్నితమైన వస్త్రంతో ఉండేలా చూసుకోండి. సిల్క్‌లాంటి వస్త్రాలతో చేసిన మృదువైన తలగడలు ఎంచుకోండి. అలాగే వెల్లకిలా పడుకోవడానికి ప్రయత్నించండి. అందువల్ల ముఖ చర్మంపై ఎలాంటి ఒత్తిడీ పడకుండా ఉంటుంది.