Unbelievable news: ఈ కవలలకు తల్లి ఒక్కరే, తండ్రులు వేరట, చిత్రంగా అలాగెలా పుడతారు?
Unbelievable Bad news: ఇటీవల విడుదలైన విక్కీ కౌశల్ చిత్రం బ్యాడ్ న్యూస్ విభిన్న కథాంశంతో వార్తల్లో నిలిచింది. ఒకే మహిళ గర్భంలో జన్మించిన కవలలు వేర్వేరు తండ్రులను కలిగి ఉన్న పరిస్థితి గురించి ఈ సినిమా కథ ఉంది. దీని గురించి వివరాలు తెల్సుకుందాం.
హెటెరోపెటర్నల్ సూపర్‌ఫికండేషన్.. ఏదీ ఈ పదానికి ఇంగ్లీషులో స్పెల్లింగ్ తడుముకోకుండా చెప్పండి చూద్దాం. గందరగోళంగా ఉంది కదా. దాని అర్థం తెలిస్తే కూడా అంతే గందరగోళంగా అనిపిస్తుంది.

హెటెరోపెటర్నల్ సూపర్‌ఫికండేషన్ ఆధారంగానే బ్యాడ్ న్యూస్ సినిమా తాజాగా విడుదల చేశారు. ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. బోల్డ్ టాపిక్ ఆధారంగా తీసిన ఈ సినమా అందరి దృష్టి ఆకర్షించింది. ఈ సినిమా కథ విన్న చాలా మంది ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఈ సినిమాలో ఓ మహిళ కవల పిల్లలతో గర్భవతి అవుతుంది. కానీ ఆ ఇద్దరు కవల పిల్లలకు తండ్రులు వేరు. అంటే ఒకే గర్భంలో, ఒకేసారి పెరుగుతున్న ఇద్దరు పిల్లలకు వేరు వేరు తండ్రులన్నమాట. ఇది చాలా వింతగా, దాదాపు అసాధ్యమనే అనిపించవచ్చు. కానీ అటువంటి పరిస్థితి నిజంగా సాధ్యమే. ఈ పరిస్థితిని వైద్య భాషలో హెటెరోపెటర్నల్ సూపర్‌ఫికండేషన్ అంటారు. మరి ఇది ఎలా సాధ్యమో తెలుసుకుందాం.
హెటెరోపెటర్నల్ సూపర్‌ఫికండేషన్ అంటే ఏమిటి?
హెటెరోపెటర్నల్ సూపర్‌ఫికండేషన్ అనేది గర్భిణీ స్త్రీ తన గర్భంలో ఇద్దరు వేర్వేరు తండ్రుల పిల్లలను మోస్తున్న పరిస్థితి. హెటెరో పెటర్నల్ అంటే వేర్వేరు తండ్రులు అని అర్థం. వేర్వేరు పురుషుల స్పర్మ్ ద్వారా మహిళలో రెండు లేదా అంతకంటే ఎక్కువ అండాలు ఫలదీకరణం చెందినప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులు చాలా అరుదుగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ చాలానే కేసులు నమోదయ్యాయి.
కాస్త వివరంగా అర్థం చేసుకుందాం:
మీరు ఈ పరిస్థితిని చాలా సరళంగా అర్థం చేసుకోవాలి అనుకుంటే, సాధారణంగా స్త్రీ ఓవల్యూషన్ సమయంలో ఒక అండం మాత్రమే విడుదల అవుతుంది. ఈ సమయంలో పురుషుడితో శృంగారంలో పాల్గొంటే వీర్యం స్త్రీ శరీరంలోకి ప్రవేశించి అండం ఫలదీకరణం చెందుతుంది. ఇది సాధారణంగా జరిగేదే. కానీ కొన్నిసార్లు మహిళ శరీరంలో రెండు అండాలు విడుదలవుతాయి. ఒకటి కంటే ఎక్కువ అండాలు కొన్నిసార్లు విడుదల అవ్వచ్చు.
ఈ పరిస్థితిలో, రెండు అండాలు విడుదలైన స్త్రీ, ఇద్దరు వేర్వేరు పురుషులతో శృంగారంలో పాల్గొంటే, రెండు అండాలు వేర్వేరు పురుషుల వీర్యంతో ఫలదీకరణం చెందుతాయి. ఫలితంగా గర్భంలో పెరుగుతున్న ఇద్దరు కవలలకు తండ్రి వేరన్న మాట. అలాంటి పిల్లలు చూడటానికి ఒకరికొకరు పూర్తి భిన్నంగా ఉంటారు. అలాంటి పిల్లల ఎత్తుల్లో కూడా చాలా తేడా కనిపిస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. అంటే సాధారణంగా కవలలిద్దరు ఒకేలా కనిపిస్తారు. కొంతమందిలో పోలికలు కాస్త అటూఇటూగా ఉన్నా కూడా, శరీర పరిమాణం రంగు ఒకేలా ఉంటాయి. హెటెరోపెటర్నల్ సూపర్‌ఫికండేషన్ వల్ల పుట్టిన పిల్లలు మరీ పొంతన లేకుండా ఉంటారు. ఒకరు పొట్టిగా, మరొకరు చాలా పొడుగ్గా, లేదా నల్లగా తెల్లగా.. ఇలా చాలా తేడాలుంటయి.
ఈ పరిస్థితి ఎంత సాధారణమో తెలుసుకోండి
ఈ పరిస్థితి చాలా అరుదు. అంటే, ఇది జరిగిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ, ఆవులు, పిల్లులు వంటి కొన్ని జంతువులలో ఈ పరిస్థితి చాలా సాధారణం. 2020 నాటికి ప్రపంచంలో కేవలం 20 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మన దేవంలో ఇలాంటి కేసుల సంఖ్య అయితే మరీ చాలా తక్కువగా ఉంది.