ప్రపంచ బ్రెయిన్ డేను జులై 22న ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. నాడీ సంబంధ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, తద్వారా మెదడుకు సంబంధించిన సమస్యలను సకాలంలో అధిగమించడం ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉద్దేశం. ప్రపంచ మెదడు దినోత్సవం సందర్భంగా, మీ మెదడు ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీసే, మీ జ్ఞాపకశక్తిని బలహీనపరిచే 5 రోజువారీ అలవాట్ల గురించి తెలుసుకోండి.
నేటి జీవితంలో జ్ఞాపకశక్తి, మెదడు బలహీనత, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ వంటి అనేక తీవ్రమైన మెదడు సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోజూవారీ జీవితంలో కొన్ని సింపుల్ మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. కానీ అంతకంటే ముందు, మీ జ్ఞాపకశక్తిని బలహీనపరిచే అలవాట్లు ఏమిటో చూద్దాం.
సమయాన్ని ఆదా చేయడానికి అనేక పనులను మీదేసుకుని కూర్చోకూడదు. దానివల్ల మెదడుపై చెడు ప్రభావం పడుతుంది. మల్టీటాస్కింగ్ ఒక వ్యక్తి యొక్క జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది. వాస్తవానికి, ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల ఒక వ్యక్తి ఒత్తిడికి గురవుతాడు. ఒత్తిడి కారణంగా జ్ఞాపకశక్తి కూడా బలహీనపడుతుంది. అందుకే నాలుగైదు పనులు సగం సగం చేసుకుంటూ ఒత్తిడికి గురయ్యే బదులు, ఒక పనిని పూర్తి చేసిన తర్వాతనే మరొక పనిని మొదలు పెట్టండి. చూడ్డానికి మల్టీ టాస్కింగ్ చేయడం చాలా ఫ్యాన్సీగా అనిపించినా దానివల్ల నష్టాలు ఎక్కువ.
ఆరోగ్యంగా ఉండటానికి, ప్రతి వ్యక్తి రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర పోవాలి. ఇలా చేయకపోతే జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోతుంది.
ఆహారంలో జంక్ ఫుడ్ ఎక్కువగా చేర్చుకోవడం, భోజనం తినకపోవడం.. ఈ రెండు అలవాట్లు మీ జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం క్రమం తప్పకుండా తీసుకోకపోవడం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. వీటితో పాటు ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోవడం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది. ఇది జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మెదడు పనితీరును మెరుగుపరచడానికి, ఆకుకూరలు, గింజలు, బెర్రీలు వంటి వాటిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోండి.
ఎన్సిబిఐలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, మీ గుండెకు హాని కలిగించే విషయాలు మీ మెదడును కూడా దెబ్బతీస్తాయి. ఉదాహరణకు ఎక్కువ తీపి, కొవ్వు ఆహారం గుండెతో పాటు మెదడు ఆరోగ్యానికి మంచిది కాదు. ఇటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు తగ్గుతుంది. ఇది జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది. తీపి పదార్థాలకు బదులుగా, కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు, ఆలివ్ ఆయిల్ వంటి వాటిని మీ ఆహారంలో చేర్చండి.
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చేసిన 2019 అధ్యయనం ప్రకారం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల జ్ఞాపకశక్తి బలహీనపడటానికి కారణం కావచ్చు. ప్రతి గంటకు ఐదు నిమిషాలు అటూ ఇటూ నడవటం, ఉదయాన్నే కాసేపై నడక వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
టాపిక్