2 Min Exercises: నిజమండీ.. ఈ రెండు నిమిషాల ఎక్సర్‌సైజులు మీ జీవితాన్ని మార్చేస్తాయ్!
2 Min Exercises: రెండు నిమిషాల్లో చేయగలిగే కొన్ని రకాల వ్యాయామాల వల్ల ఒత్తిడి తగ్గి, జీవితం మీద సానుకూలత పెరుగుతుంది. ఏ విషయం అయినా పాజిటివ్ గా ఆలోచించగలం. అవేంటో చూసి.. మీరూ ప్రయత్నించండి.
ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్పలేనంత నిరాశా నిస్పృహల్లో జీవితాలను వెళ్లదీస్తున్నారు. ఏదో చేయాలనుకుంటారు. అలా కాకపోయే సరికి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేనే ఇంత దురదృష్టవంతుణ్ణా? నేను ఎప్పటికీ విజయం సాధించలేనా? లాంటి నెగెటివ్ భావాలను ఎక్కువగా లోపల పెట్టేసుకుంటారు. ఫలితంగా నరకంగా రోజుల్ని వెళ్లదీస్తుంటారు. ఇలాంటి భావ జాలాల వల్ల రోజు రోజుకూ వీరిలో ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతుంటాయి. దీంతో జీవనం ఇంకా దుర్భరంగా మారుతుంది. మరి ఇలా కాకుండా ఉండాలంటే రోజుకు ఇలా రెండు నిమిషాల పాటు కొన్ని ఎక్సర్‌సైజులు చేయమని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో స్టెప్ బై స్టెప్ ఇక్కడున్నాయి. చదివేయండి.
- ఈ ఎక్సర్‌సైజులు చేయడానికి ముందుగా ప్రశాంతంగా ఉండే స్థలాన్ని ఎంపిక చేసుకోండి. ఎవ్వరూ మిమ్మల్ని డిస్ట్రబ్ చేయని చోటై ఉండాలి. ఉదయాన్నే ఇవి చేయడం మరింత ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడు కుదరని వారు లంచ్ బ్రేక్‌లో అయినా, రాత్రి పడుకోబోయే ముందైనా కూడా చేసుకోవచ్చు.
- ప్రశాంతమైన చోట మీకు సౌకర్యవంతంగా ఉండేలా నిదానంగా కూర్చోండి. చేతులు కాళ్లు రెస్ట్‌లో ఉండాలి. ఎక్కడా బిగుతుగా, అసౌకర్యంగా ఉండకూడదు.
- కళ్లు మూసుకోండి. ముందు విశ్వాన్ని తలచుకుని కృతజ్ఞతా పూర్వకంగా నవ్వండి. రోజులో మీరు జీవించి ఉండేందుకు ఏమేమి సహకరిస్తున్నాయో వాటన్నింటికీ వరుసగా ధన్యవాదాలు తెలపండి. మీ ప్రియమైన వారికి, మీ కోసం కాయలు కాసిన మొక్కకి, మీ కోసం కొట్టుకుంటున్న మీ గుండెకు, బహుమతిగా వచ్చిన మరో కొత్త రోజుకు ఇలా ప్రతి దానికీ ధన్యవాదాలు తెలపండి. ‘చూస్తున్నందుకు నా కళ్లకు థాంక్యూ, ఊపిరి పీలుస్తున్నందుకు నా ఊపిరితిత్తులకు థాంక్యూ... అంటూ వరుసగా మీకు గుర్తొచ్చిన అన్నింటినీ చెప్పుకుంటూ వెళ్లండి’ కళ్లు తెరవండి. ఓ రెండు నిమిషాల ఎక్సర్‌సైజ్ పూర్తయిపోయినట్లే.
- ఇప్పుడు సమయం దొరికినప్పుడు మరో రెండు నిమిషాల పాటు మైండ్‌ఫుల్‌గా ఉండేందుకు ప్రయత్నించండి. కళ్లు మూసుకుని మీలోకి శ్వాస ఎలా ప్రవహిస్తోంది. తిరిగి అదెలా బయటక వస్తోంది? ఇంకా మీ శరీరంలో ఏమేం జరుగుతున్నాయి. అన్నింటినీ పరిశీలించండి. ఇలా తీక్షణంగా చేస్తే గుండె కొట్టుకోవడం, నరాల చప్పుళ్లలాంటి వాటన్నింటినీ మీరు వినగలుగుతారు.
- మరోసారి టైం దొరికినప్పుడు మరో రెండు నిమిషాలు మీ కోసం కేటాయించుకోండి. మీరు కలలు కంటున్నట్లుగా ఉన్నట్లు ఊహించుకోండి. మీ లక్ష్యాలు సాకారం అయినట్లుగా విజువలైజ్ చేసుకోండి. మీ బంధాలన్నీ ఆనందకరంగా మారుతున్నట్లు అనుకోండి. తర్వాత కళ్లు తెరవండి. మీరెంతో తృప్తిగా ఉంటారు.
రెండేసి నిమిషాల పాటు ఇలాంటి వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు చాలా పాజిటివ్‌గా మారతారు. మీ లక్ష్యాల్ని చేరుకోవడానికి అవసరమైన మార్గాల్ని కనుగొంటారు. నెగెటివిటీకి దూరమై పాజిటివిటీలోకి మీ జీవితాన్ని షిఫ్ట్ చేసుకుంటారు. ప్రయత్నించి చూడండి ఒకసారి.