Ovulation signs: ఈ రోజుల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎక్కువ.. అండం విడుదలని నిర్ధారించే లక్షణాలివే
Ovulation Symptoms: ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకు మహిళల్లో అండం విడుదలయ్యే సమయం గురించి అవగాహన ఉండాల్సిందే. శరీరంలో అండం విడుదలైందని చెప్పే లక్షణాలేంటో తెల్సుకోండి.

మహిళల్లో నెలకు ఒకసారి అండం విడుదల అవుతుంది. ఆ సమయంలో కలయికలో పాల్గొంటేనే అండం శుక్రకణంతో ఫలదీకరణం చెంది ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే వాళ్లకు దీని గురించి పూర్తి అవగాహన అవసరం. శరీరంలో అండం విడుదలవ్వడాన్ని ఓవ్యువేషన్ అంటారు. ఈ సమయంలో కొన్ని ప్రత్యేక మార్పులు మహిళ శరీరంలో రావచ్చు. వాటిని గమనించుకుంటే గర్భదారణ జరగడం సులభతరం అవుతుంది.
ఓవ్యులేషన్ లక్షణాలు:
పీరియడ్స్ ముందు లక్షణాలు గుర్తించడం చాలా మందికి తెలుస్తుంది. కానీ, అండం విడుదలైనప్పుడు కూడా అలాంటి మార్పులే శరీరంలో కొన్ని వస్తాయి. చాలా మంది వాటిని గమనించరు. ప్రతి మహిళలో ఈ లక్షణాలు వేరుగా ఉంటాయి. అండం విడుదలయ్యే రోజు, దానికన్న కనీసం అయిదు రోజుల ముందునుంచే ఈ మార్పులు కనిపించడం మొదలవుతుంది. అండం విడుదలైన తర్వాతి రోజూ కూడా ఆ లక్షణాలుంటాయి. చాలా తక్కువ మందిలో మాత్రం ఏ లక్షణాలు కనిపించకపోవచ్చు. అలాగని అండం విడుదలవ్వలేదని అనుకోకూడదు. ఆ లక్షణాలు తెల్సుకోండి.
1. సర్వైకల్ మ్యూకస్:
యోని నుంచి వచ్చే డిశ్చార్జిలో కొంత మార్పు వస్తుంది. ఓవ్యులేషన్ సమయం దగ్గర పడేకొద్దీ శరీరంలో ఈస్ట్రోజెన్ ఎక్కువగా విడుదలవుతుంది. దానివల్ల డిశ్చార్జి పారదర్శకంగా, గుడ్డు తెల్లసొన లాగా అయిపోతుంది. చేతి వేళ్లతో కానీ, టిష్యూతో గానీ డిశ్చార్జిని గమనిస్తే చాలా సాగినట్లు ఉంటుంది. ఇది అండం విడుదలవుతోంది అనడానికి గుర్తు.
2. వాసనలు:
మామూలుగా కన్నా ఈ సమయంలో చాలా ఎక్కువగా వాసనలు వస్తాయట. కాకపోతే ఈ లక్షణం చాలా తక్కువ మహిళల్లోనే ఉంటుంది. ఓవ్యులేషన్ ప్రభావం ఈ రకంగానూ ఉండొచ్చు.
3. రొమ్ముల్లో మార్పు:
రొమ్ము సున్నితంగా అనిపించడం, చనుమొనల్లో నొప్పి లాంటివి కూడా అండం విడుదల అయ్యిందని చెప్పే సంకేతాలే. కొంతమందిలో ఈ నొప్పి ఓవ్యులేషన్ ముందుంటే ,కొంతమందిలో తర్వాత ఉండొచ్చు. అయితే కొన్నిసార్లు నెలసరి సమయంలోనూ ఇలా జరగొచ్చు. నెలసరి మధ్యలో ఇలా ఏమైనా మార్పులు కనిపిస్తే మాత్రం మీకొక హింట్ దొరికినట్లే.
4. కటి ప్రాంతంలో నొప్పి:
కటి ప్రాంతంలో, పొత్తి కడుపులో కాస్త నొప్పి రావచ్చు. ఈ నొప్పి చాలా తక్కువే ఉంటుంది. రెండు వైపులా లేదా ఒక్క వైపే ఈ నొప్పి ఉండొచ్చు. అయితే రోజంతా ఈ నొప్పి ఉండదు. కొన్ని నిమిషాలు, గంటల వ్యవధిలో తగ్గిపోతుంది. కొంతమందిలో చాలా తక్కువ రక్తస్రావం అవ్వొచ్చు. మరికొందరిలో తల తిప్పినట్లు, వాంతి వచ్చినట్లూ అనిపిస్తుంది.
5. బ్లీడింగ్:
కొంతమందిలో నెలసరి సమయంలో కాకుండా మధ్యలోనూ చాలా తక్కువ బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఓవ్యులేషన్ కి సంకేతం కావచ్చు. లేదంటే డిశ్చార్జి రంగులోనూ మార్పు రావచ్చు. కాస్త బ్రౌన్ రంగులో కనిపించొచ్చు. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగితే ఇన్ఫెక్షన్ కు సంకేతం కావచ్చు. అలాంటప్పుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
6. శృంగార వాంఛలు:
అండోత్సర్గము లక్షణాలలో ఇదీ ఒకటి. కొంతమంది మహిళల్లో అండోత్సర్గము సమయంలో వారి సెక్స్ డ్రైవ్ పెరుగుతుంది. ఇది సంతానోత్పత్తిని ప్రోత్సహించడానికి శరీరంలో సహజంగా వచ్చే మార్పు కావచ్చు.
7. తలనొప్పి, వికారం:
అండం విడుదలయ్యే సమయంలో కొంతమంది చాలా నీరసంగానూ ఉంటారు. వికారంగా అనిపిస్తుంది. తలనొప్పి వస్తుంది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ స్థాయుల్లో మార్పు వల్ల ఇది జరుగుతుంది. అలాగే శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త పెరుగుతుంది.