Mouthwash: రోజూ మౌత్‌వాష్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలియాల్సిందే..-know about mouth wash and its side effects benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mouthwash: రోజూ మౌత్‌వాష్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలియాల్సిందే..

Mouthwash: రోజూ మౌత్‌వాష్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలియాల్సిందే..

Mouthwash: నోటి ఆరోగ్యం కాపాడుకోవడానికి మౌత్ వాష్ వాడుతుంటాం. దీన్ని ప్రతిరోజూ వాడటం ఆరోగ్యకరమేనా కాదా? వివరంగా తెల్సుకోండి.

మౌత్ వాష్ (freepik)

మౌత్ వాష్ వాడటం చాలా మంది రొటీన్ లో భాగమైపోయింది. బ్రష్ చేశాకా మౌత్ వాష్ వాడితేనే తాజాగా అనిపిస్తుంది కొందరికి. ద్రవ రూపంలో ఉండే మౌత్ వాష్ ఒక చిన్న మూతాలో తీసుకుని నోట్లో పోసుకుని పుక్కిలించేయాలి. అయితే దాన్ని సరిగ్గా వాడితేనే మంచి ఫలితాలు పొందొచ్చు. దాన్ని వాడటం శ్రేయస్కరమా కాదా? ఎలాంటి ప్రభావాలుంటాయో చూడండి.

మౌత్ వాష్ లాభాలు:

  1. యాంటీ సెప్టిక్ మౌత్ వాష్ వాడటం వల్ల నోట్లో బ్యాక్టీరియా ఎదగకుండా చూస్తాయి. దాంతో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి.
  2. ఫ్లోరైడ్ ఉన్న మౌత్ వాష్ వాడటం వల్ల పంటి ఎనామిల్ పొరను కాపాడుతుంది. దంతక్షయాలు రాకుండా కాపాడుతుంది.
  3. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్న మౌత్ వాష్ వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను ఇది నశింపజేస్తుంది.
  4. పళ్ల మీద పాచి ఎక్కువగా రాకుండా కూడా మౌత్ వాష్ కాపాడుతుంది. దీనివల్ల చిగుళ్లు, పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు.
  5. కొన్ని రకాల మౌత్ వాష్ లలో అలోవెరా, పుదీనా లాంటి పదార్థాలుంటాయి. వీటివల్ల నోట్లో ఏమైనా మంట లాంటివి ఉంటే వాటి చల్లదనం వల్ల తగ్గిపోతాయి.

ప్రతిరోజూ మౌత్ వాష్ వాడొచ్చా?

మౌత్ వాష్ వాడటం దాదాపుగా చాలా మందిలో మంచి ఫలితాలే ఉంటాయి. కానీ దాన్ని ఎన్ని సార్లు వాడాలి, ఎలాంటిది వాడాలో వ్యక్తిని బట్టి మారుతుంది.

  1. యాంటీ సెప్టిక్ మౌత్ వాష్ ఎక్కువగా వాడటం వల్ల రుచి సరిగ్గా తెలియకపోవడం, పళ్ల రంగు మారడం లాంటివి జరగొచ్చు. కాబట్టి లేబుల్ సరిగ్గా చదివి దీన్ని వాడాలి.
  2. థెరపాటిక్ మౌత్ వాష్ దంతక్షయం, పొడిబారిన నోటి సమస్యలకు వాడొచ్చు. వీటిని డెంటిస్ట్ సలహాతోనే వాడాలి.
  3. కాస్మోటిక్ మౌత్ వాష్ వాడటం వల్ల తాజా శ్వాస వస్తుంది తప్ప ఇతర ప్రయోజనాలుండవు.

మౌత్ వాష్ ఎలా వాడాలి?

రోజుకు ఒకటి లేదా రెండు సార్లు దీన్ని వాడొచ్చు. నోట్లో వేసుకున్న తర్వాత అర నిమిషం పాటూ పుక్కిలించి ఉమ్మేయాలి. ఇంకేదైనా ప్రత్యేక అవసరం కోసం వాడితే వైద్యుల సలహా ప్రకారం ఉపయోగించాలి. దీన్ని మింగితే చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ముఖ్యంగా పిల్లలకు దీన్ని దూరంగా ఉంచాలి. తాజా శ్వాస కోసం కదాని బ్రష్ చేయకుండా ఇదొక్కటే వాడి ఊరుకోకూడదు. తప్పకుండా రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి.

మౌత్ వాష్ వాడిన తర్వాత కనీసం అరగంట పాటూ ఏమీ తినకూడదు. తాగకూడదు.

ఈ మార్పులు గమనించాలి..

  1. ఆల్కహాల్ ఉన్న మౌత్ వాష్ వాడటం వల్ల పొడిబారే సమస్య రావచ్చు. అందుకే ఆల్కహాల్ లేనివి ఎంచుకోవాలి.
  2. సున్నితత్వం ఉన్నవాళ్లు గాఢత ఎక్కువున్న యాంటీసెప్టిక్ మౌత్ వాష్ వాడకపోవడం ఉత్తమం.
  3. కొన్ని రకాల మౌత్ వాష్ లలో క్లోరెక్సిడైన్ లాంటి పదార్థాలుంటాయి. దీనివల్ల కొద్దిసేపటి దాకా ఏం తిన్నా సరిగ్గా రుచి తెలీదు. ఈ ఇబ్బంది తలెత్తితే వెంటనే మౌత్ వాష్ వాడటం ఆపేయాలి.
  4. దీర్ఘకాలికంగా యాంటీసెప్టిక్ మౌత్ వాష్ వాడితే పళ్లు, నాలుక మీద బ్రౌన్ రంగు మచ్చలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అవగాహన లేకుండా మౌత్ వాష్ వాడకూడదు.
  5. పొరపాటున మౌత్ వాష్ మింగేస్తే తల తిరగడం, వాంతులు రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా మొత్త ఉమ్మివేయాలి. ఈ ఆరోగ్య సమస్యలొస్తే వెంటనే ఒకసారి మీరు సరిగ్గా వాడుతున్నారో లేదో గమనించుకోండి.