Mineral makeup: ఈ మేకప్ వేసుకుంటే చర్మం ఆరోగ్యం పెరుగుతుంది, మినరల్ మేకప్ గురించి తెల్సుకోండి-know about mineral makeup and advantages of it for skin ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mineral Makeup: ఈ మేకప్ వేసుకుంటే చర్మం ఆరోగ్యం పెరుగుతుంది, మినరల్ మేకప్ గురించి తెల్సుకోండి

Mineral makeup: ఈ మేకప్ వేసుకుంటే చర్మం ఆరోగ్యం పెరుగుతుంది, మినరల్ మేకప్ గురించి తెల్సుకోండి

Koutik Pranaya Sree HT Telugu
Published Oct 30, 2024 12:30 PM IST

Mineral makeup: మినరల్ మేకప్ వేసుకుంటే చర్మం ఆరోగ్యం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. అదెంత వరకు నిజం, అసలు మినరల్ మేకప్ అంటే ఏమిటో తెల్సుకోండి..

మినరల్ మేకప్
మినరల్ మేకప్ (freepik)

మేకప్ ఉత్పత్తుల్లో ఉండే రసాయనాల వల్ల చర్మ పాడవుతుంది. అందుకే చాలా మంది మేకప్ అంటే దూరంగా ఉంటారు. కానీ మినరల్ మేకప్ వల్ల ఆ సమస్య ఉండదని చెబుతున్నారు. ఇది చర్మానికి ఎలాంటి హానీ చేయదట. ఇంతకీ మినరల్ మేకప్ అంటే ఏంటో తెల్సుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇది చదివేయండి..

పాతకాలంలో ముఖానికి రంగులు అద్దుకోవడం కోసం భూమిలో దొరికే వివిధ రకాల మినరళ్లను, రాళ్లను వాడేవాళ్లు. దాన్ని ఆధారంగా చేసుకుని తయారైందే మినరల్ మేకప్. ఈ మినరల్ మేకప్ ఉత్పత్తుల్లో కూడా భూమిలో దొరికే కొన్ని మినరళ్లుంటాయి.

మేకప్ ఉత్పత్తులకు వివిధ రంగుల కోసం ఐరన్ ఆక్సైడ్ వాడతారు. సన్‌స్క్రీన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల కోసం జింక్ ఆక్సైడ్ వాడతారు. మెరిసే గుణం రావడానికి మైకా పొడి వాడతారు. రంగు కోసం, సన్ స్క్రీన్ లక్షణాల కోసం టైటానియం డై ఆక్సైడ్ వాడతారు.

ఇలాంటి సహజమైన పదార్థాలు వాడి మినరల్ మేకప్ ఉత్పత్తులు తయారు చేస్తారు.

మామూలు మేకప్ వల్ల నష్టాలు:

సాధారణ మేకప్ ఉత్పత్తుల్లో కూడా పైన చెప్పిన మినరళ్లుంటాయి. కానీ వాటితో పాటే ఇతర రసాయనాలు, ప్రిజర్వేటివ్స్, రంగులు, పారాబెన్లు, మంచి వాసన కోసం కొన్ని రకాల ఫ్రాగ్రెన్సులు ఉంటాయి. మేకప్ తొందరగా ఆరిపోయి, మ్యాటె ఫినిషింగ్ రావడానికి కొన్ని ఉత్పత్తుల్లో ఆల్కహాల్ వాడతారు. ఇది చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోవడం, ఎలర్జీలు, ఎరుపెక్కడం, యాక్నె లాంటి సమస్యలు వీటివల్ల రావచ్చు.

మినరల్ మేకప్ వల్ల లాభాలు:

1. యాక్నె, ఎగ్జిమా లాంటి చర్మ సంబంధిత వ్యాధులున్నవాళ్లకి, సున్నిత చర్మతత్వం ఉన్నవాళ్లకి ఈ మినరల్ మేకప్ మంచి ఎంపిక. దీనివల్ల చర్మం దెబ్బ తినకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది చర్మ రంధ్రాల్ని మూసుకునేలా చేయదు.

2. జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు ఎన్ని టిప్స్ పాటించి మేకప్ వేసుకున్నా సరే.. వెంటనే ముఖం మీద జిడ్డు వల్ల చర్మం మెరిసినట్లు కనిపిస్తుంది. ఈ మినరల్ మేకప్ ఉత్పత్తుల్లో ఉండే సహజ మినరళ్లు జిడ్డును ఎక్కువగా పీల్చుకుంటాయి. వీటిలో చాలా ఉత్పత్తులు మెరిసే గుణంతో ఉన్నా.. కొన్ని జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లకి సరిగ్గా నప్పుతాయి.

3. ఈ ఉత్పత్తుల్లో జింక్ ఆక్సైడ్, టైటానియం డై ఆక్సైడ్ వాడతారు. ఇవి సహజ సన్‌స్క్రీన్లని చెప్పవచ్చు. కాబట్టి మినరల్ మేకప్ వేసుకోవడం ద్వారా సహజంగానే సూర్యుని కిరణాల నుంచి రక్షణ దొరుకుతుంది.

4. మినరళ్లను వీలైనంత సన్నటి పొడిగా చేసి ఈ మినరల్ మేకప్ ఉత్పత్తుల్ని తయారు చేస్తారు. కాబట్టి ఇవి చాలా తేలికగా ఉంటాయి. మేకప్ వేసుకున్న భావన రాదు. మామూలుగా సాధారణ మేకప్ ఉత్పత్తులతో మేకప్ వేసుకున్నప్పుడు చర్మం కాస్త పట్టినట్లు, లేదంటే ముఖం మీద ఏదో పూత ఉన్న భావన వస్తుంది. మినరల్ మేకప్‌తో అలా ఉండదు. సహజంగా చర్మంలో కలిసిపోయినట్లు ఉంటుంది. అలాగే ఈ మేకప్ శుభ్రం చేసుకోవడం కూడా సులువే. గాఢత ఎక్కువున్న క్లెన్సర్లు వాడక్కర్లేదు.

5. సాధారణ మేకప్ వాడినప్పుడు చర్మం మీద ముడతలు, గీతలు లాంటి సమస్యలు ఎక్కువవుతాయి. కానీ మినరల్ మేకప్‌లో ఉన్న సహజ గుణాల వల్ల ఇలాంటి సమస్యలు కొన్ని తగ్గుతాయని చెబుతారు. యాక్నె లాంటి సమస్యలు కూడా కాస్త తగ్గుతాయట.

5. ఈ మినరల్ మేకప్‌తో చేసిన ఉత్పత్తిని ఏదైనా సరే.. ఫౌండేషన్, పౌడర్, కన్సీలర్.. కొద్దిగా వాడినా ఎక్కువ కవరేజీ ఇస్తాయి. మందంగా పూతలు వేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎక్కువ సేపు చెక్కు చెదరకుండా ఉంటుంది.

Whats_app_banner