Liquid Nitrogen: పొగలుగక్కే బిస్కట్లు, పాన్, స్వీట్లు తినొచ్చా? లిక్విడ్ నైట్రోజన్ వల్ల ఆరోగ్యానికి హాని ఉంటుందా?-know about liquid nitrogen and how it effects health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Liquid Nitrogen: పొగలుగక్కే బిస్కట్లు, పాన్, స్వీట్లు తినొచ్చా? లిక్విడ్ నైట్రోజన్ వల్ల ఆరోగ్యానికి హాని ఉంటుందా?

Liquid Nitrogen: పొగలుగక్కే బిస్కట్లు, పాన్, స్వీట్లు తినొచ్చా? లిక్విడ్ నైట్రోజన్ వల్ల ఆరోగ్యానికి హాని ఉంటుందా?

Koutik Pranaya Sree HT Telugu
Jun 30, 2024 06:30 PM IST

Liquid Nitrogen: పొగలతో సర్వ్ చేసే లిక్విడ్ నైట్రోజన్ ఆహారం ఈ మధ్య ఫ్యాన్సీ అయిపోయింది. దీన్ని తినడం వల్ల ఎలాంటి ఫలితాలుంటాయి, దీన్ని ఎక్కడెక్కడ వాడొచ్చో వివరంగా తెల్సుకోండి.

లిక్విడ్ నైట్రోజన్‌ పొగలతో ఐస్ క్రీం
లిక్విడ్ నైట్రోజన్‌ పొగలతో ఐస్ క్రీం (freepik)

రెస్టారెంట్లలో, వేడుకల్లో మన దృష్టిని ఆకర్షించడానికి లిక్విడ్ నైట్రోజెన్ ఎక్కువగా వాడతారు. మన ముందున్న ఆహారానికి కొత్త లగ్జరీ లుక్ తీసుకురాడానికి లిక్విడ్ నైట్రోజెన్ ఉపయోగిస్తారు. మూత తీయగానే పొగలు గక్కుతూ చూడ్డానికి భలే అనిపిస్తుంది. బిస్కట్లు, స్వీట్ పాన్, డెజర్ట్స్, కేకులు.. అలాగే కొన్ని రకాల ప్రత్యేకమైన వంటకాల్ని ఈ లిక్విడ్ నైట్రోజన్ వాడి మరింత కొత్తగా తయారు చేస్తారు. అసలు ఈ లిక్విడ్ నైట్రోజన్ ఏంటని వివరంగా తెల్సుకుందాం.

లిక్విడ్ నైట్రోజన్ అంటే ఏమిటి?

ద్రవ రూపంలో ఉన్న నైట్రోజన్‌ని లిక్విడ్ నైట్రోజన్ అంటాం. వాయువు రూపంలో ఉండే నత్రజని చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ద్రవ రూపంలో ఉంటుంది. దాదాపు −196 °C వద్ద వచ్చాక నత్రజని ద్రవ రూపంలోకి మారుతుంది. దీన్ని పరిశ్రమల్లో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ పద్ధతిలో తయారు చేస్తారు. అంటే గాలిని నీళ్లగా మారేంత వరకు తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్ల బరుస్తారు. ఈ ద్రవరూప నత్రజనికి రంగు ఉండదు. వాసన ఉండదు. రుచి ఉండదు.

లిక్విడ్ నైట్రోజెన్ ఎక్కడ ఉపయోగిస్తారు?

వైద్య రంగంలో లిక్విడ్ నైట్రోజన్ ను చాలా రకాలుగా వాడతారు. అలాగే ఆహారాన్ని పాడవ్వకుండా నిల్వ చేయడానికి, దూర ప్రాంతాలకు ఆహారాన్ని సరఫరా చేసేటప్పుడు లిక్విడ్ నైట్రోజన్ వాడతారు. పెద్ద పెద్ద పైపులు మరమ్మతు చేసేటప్పుడు వాటిలో ఉన్న ద్రవాన్ని బ్లాక్ చేసే సదుపాయం లేనప్పుడు.. లిక్విడ్ నైట్రోజన్ పంపి వాటిలో ఉన్న నూనెను లేదా నీళ్లను గడ్డ కట్టేట్లు చేసి, పైపులకు మరమ్మతు చేస్తారు.

అలాగే లిక్విడ్ నైట్రోజన్ వాడి ఐస్ క్రీమ్ తయారు చేస్తారు. చాలా తక్కువ సమయంలో చల్లబరిచే గుణం ఉండటం వల్ల దీన్ని వాటి తయారీకి వాడతారు. వీటికున్న పొగ గుణం వల్ల కాక్‌టెయిల్ లాంటివి సర్వ్ చేయడానికి వాడతారు. వాటిని కంటికి ఇంపుగా కనిపించేలా చేస్తుంది.

స్మోక్ బిస్కట్లు, ఇతర ఆహారాలు తినకూడదా?

ద్రవరూప నత్రజని లేదా లిక్విడ్ నైట్రోజన్ ఉష్ణోగ్రత -196 °C ఉంటుంది. మనం తినే ఐస్‌క్రీం ఉష్ణోగ్రత -10°C నుంచి -15°C మధ్యలో మాత్రమే ఉంటుంది. దాన్నిబట్టి లిక్విడ్ నైట్రోజన్ ఎంత విపరీతమైన చల్లదనంతో ఉంటుందో ఊహించొచ్చు. ఇది వేడి గాలిని తగలగానే పొగరూపంలో ఆవిరి అయిపోతుంది. దానికున్న ఈ గుణాన్నే ఉపయోగించుకుని పొగతో రకరకాలు ఆహారాలు సర్వ్ చేస్తున్నారు. ఇది పొరపాటున చేయికి తగిలితే విపరీతమైన గాయం అయిపోతుంది. కాబట్టి నిపుణులు మాత్రమే దీన్ని వాడాలి.

అలాగే కేవలం జ్యూసులు, పండ్లు, పండ్ల రసాల్లాంటివి నిల్వ చేయడానికి, వేరే ఆహారాలేవైనా పాడవ్వకుండా నిల్వ చేయడానికి మాత్రమే దీన్ని వాడాలి. కానీ దీంట్లో ఉంచి పొగ వచ్చేలా చేసే బిస్కట్లు, స్వీట్ పాన్, స్మోక్ పానీపూరీలు తినడం అస్సలు మంచిది కాదు. ఒక పన్నెండు సంవత్సరాల అమ్మాయికి, లిక్విడ్ నైట్రోజెన్ ఉన్న స్మోక్ పాన్ తినడం వల్ల కడుపులో రంధ్రం ఏర్పడిందనే వార్త వైరల్ అయ్యింది. మీరు కూడా ఇలాంటివి వినే ఉంటారు. కాబట్టి చూడ్డానికి బాగుందని వాటి జోలికి పోకండి. పిల్లలను వాటికి దూరంగా ఉంచండి.

WhatsApp channel