International Kissing Day: ముఫ్పై కండరాలకు పని చెప్పే ముద్దుకీ మహిమ ఉంది.. దానికీ ఓ రోజుంది..-know about international kissing day benefits of kissing ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  International Kissing Day: ముఫ్పై కండరాలకు పని చెప్పే ముద్దుకీ మహిమ ఉంది.. దానికీ ఓ రోజుంది..

International Kissing Day: ముఫ్పై కండరాలకు పని చెప్పే ముద్దుకీ మహిమ ఉంది.. దానికీ ఓ రోజుంది..

International Kissing Day: ఈ రోజు ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే. వ్యక్తి మీద ప్రేమను కురిపించడానికే కాదు ముద్దుతో లాభాలు ఎన్నో ఉంటాయట. అవేంటో తెల్సుకోండి.

ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే (Photo by Danie Franco on Unsplash)

ముక్కు పై ముద్దు పెట్టు.. ముక్కెరయి పోయేట్టు.. చెంప పై ముద్దు పెట్టు.. చక్కెరయి పోయేట్టు.. ఏంటీ మీరు కూడా పాట పాడేస్తున్నారా? ముద్దు అనే పదం మీద కవులు ఎన్ని కావ్యాలు రాసుంటారో. రచయితలు ఎన్ని పాటలు రాసుంటారో. ఎంత చెప్పినా ముద్దులోని మ్యాజిక్ వివరించడం సాధ్యం కాదు మరి. ముఖంలో ముప్పై కండరాలకు పని చెప్పే ముద్దులో ఎన్ని రకాలో.. రొమాంటిక్ ముద్దు, స్నేహ పూర్వక ముద్దు, ఆప్యాయతతో పెట్టే ముద్దు.. బంధం ఏదైనా చిన్న ముద్దుతో ఆ బంధంలో ఉన్న మమకారాన్ని బయటపెట్టొచ్చు. వ్యక్తిని బట్టి, ఎదుటి వ్యక్తితో ఉన్న బంధాన్ని బట్టి ముద్దుకున్న విలువ, మహిమ మారిపోతాయి. అలాంటి ముద్దుకూ ఓరోజుంది. జులై 6న ఇంటర్నేషనల్ ముద్దుల రోజుగా జరుపుకుంటున్నారంతా.

ముద్దు మీద స్టడీ:

ముద్దు గురించి 2013 లో ఒక స్టడీ చేశారు. భాగస్వామి ఎంత అనుకూలంగా ఉన్నారో అంచనా వేయడానికి, జంట మధ్య అనుబంధాన్ని తెలియజేయడానికి, లేదా శృంగారాన్ని మొదలు పెట్డడానికి ముద్దు ఒక మంత్రంలా పనిచేస్తుంది. దీర్ఘకాలిక సంబంధాల్లో ముద్దు చాలా ముఖ్యమట. ఎన్ని ఎక్కువ ముద్దులు ఇస్తే బంధాల్లో అంత ఎక్కువ సంతృప్తి ఉంటుందట.

ముద్దుతో మానసికంగా చాలా లాభాలుంటాయట. శరీరంలో ఒత్తిడి కలిగించే హార్మోన్లను ముద్దు తగ్గిస్తుంది. ఆనందాన్నిచ్చే ఆక్సిటోసిన్, డోపమైన్ స్థాయుల్ని పెంచుతుంది. ప్రేమ బంధంలో ఇద్దరి మధ్య అన్యోన్యతను ముద్దు మరింత బలంగా మారుస్తుంది. అందుకే ముద్దు పెట్టుకోవడం వల్ల మూడ్ బాగుంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఆనందంగా అనిపిస్తుంది.

ముద్దు వల్ల మానసికంగానే కాక ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో చూడండి:

1. వెయిట్ లాస్:

కొన్ని పరిశోధనల ప్రకారం ముద్దు వల్ల నిమిషానికి 26 కేలరీలు ఖర్చవుతాయట. అంటే 5 నిమిషాల గాఢమైన ముద్దు వల్ల దాదాపు 100 కేలరీలు కరిగిపోతాయి. ముద్దులో మీరెంత లీనమయ్యారనే దాని బట్టి నిమిషానికి 2 నుంచి 26 కేలరీల వరకు ఖర్చవుతాయి. ఇది నేరుగా మీ బరువు తగ్గించకపోయినా మీ ఒత్తిడిని తగ్గించి ఆనందంగా ఉండేలా చేస్తుంది. దీని ప్రభావం నేరుగా మీ బరువుపై ఉంటుంది.

2. గుండె ఆరోగ్యం:

మీ భాగస్వామిని ముద్దు పెట్టుకోవడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయని తెల్సా? ముద్దు వల్ల గుండెలయ క్రమబద్దంగా అవుతుందట. దీంతో రక్తపోటు తగ్గుతుంది.

3. దంతాల ఆరోగ్యం:

ఉమ్ములో బ్యాక్టీరియాతో, వైరస్ తో పోరాడే కారకాలుంటాయి. గాఢమైన ముద్దు పెట్టుకున్నప్పుడు ఉమ్ము ఎక్కువగా తయారవుతుంది. దీనివల్ల నోరు, దంతాల ఆరోగ్యం బాగుంటుంది. ముద్దుతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందట.

4. ముఖ కండరాలు:

ముద్దు ముఖానికి ఒక వర్కవుట్ లాంటిది. ముద్దు పెట్టుకునేటప్పుడు ముఖంలో దాదాపుగా 30 కండరాలు పనిచేస్తాయి ముద్దు ముఖంలో 30 కండరాలను ఉత్తేజితం చేస్తుంది. ముఖ కండరాలు పనిచేయడం వల్ల కొలాజిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ముఖం ఇవ్వనంగా కనిపించేలా చేస్తుంది.రక్త సరఫరా వల్ల చర్మం ఇవ్వనంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది.