Know about Hing: ఇంగువ తింటే ఆరోగ్యానికి మంచిదా కాదా? వివరంగా తెల్సుకోండి..
Know about Hing: ఇంగువ వంటల్లో వాడితే మంచిదా లేదా అనే సందేహం ఉందా? దాని ఆరోగ్య ప్రయోజనాలు వివరంగా తెలుసుకొని ఆహారంలో భాగం చేసుకోండి.
ఇంగువ.. పూర్వ కాలం నుంచి మన అందరి వంటిళ్లలో వాడతున్నాం. ముఖ్యంగా శాకాహారులు ఎక్కువగా దీన్ని వంటల్లో వినియోగిస్తూ ఉంటారు. పులిహోర, రోటి పచ్చళ్లలాంటి వాటిల్లో దీన్ని వాడుతుంటారు. ఇది వంటలకు మంచి రుచిని ఇవ్వడంతోపాటు అరుగుదల సమస్యలు రాకుండా చేస్తుంది. పొట్టను శుభ్రం చేస్తుంది. అంతే అనుకుంటే పొరపాటేనండోయ్. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మరెన్నో ఉన్నాయి. అవేంటో తెలిస్తే తప్పకుండా మీరూ మీ వంటల్లో దీన్ని వేసుకునే ప్రయత్నం చేస్తారు.
ట్రెండింగ్ వార్తలు
ఇంగువ ఎలా వస్తుందంటే..
ఇంగువ మొక్క గుబురుగా పొదలాగా పెరుగుతుంది. దీని కాండం సన్నగా బోలులా ఉంటుంది. ఈ కాండం నుంచి జిగురు లాంటి పదార్థం తయారవుతుంది. ఆ ద్రవం తర్వాత ఎండిపోయి రాయిలా మారుతుంది. దీన్నే మనం ఇంగువగా వాడుతూ ఉంటాం. ఈ మొక్క ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ లాంటి చోట్ల ఎక్కువగా పెరుగుతుంది. మన దేశంలో కశ్మీర్, పంజాబ్ లాంటి చల్లగా ఉండే ప్రాంతాల్లో వీటిని పెంచుతూ ఉంటారు.
ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు :
- దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇది చెడు బ్యాక్టీరియాను దరి చేరనివ్వదు. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జీవ క్రియను మెరుగుపరుస్తుంది.
- పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ ఇంగువ వాడటం వల్ల తగ్గుముఖం పడతాయి. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మాటిమాటికీ తేడా చేస్తున్నట్లు అనిపించడం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇంగువ కచ్చితంగా పరిష్కారం చూపిస్తుంది. పొట్టలో గాలిని బయటకు పంపించి గ్యాస్ సమస్యలనూ పోగొడుతుంది. మల బద్ధకం ఉన్నవారు రాత్రి పడుకోబోయే ముందు ఇంగువ చూర్ణం తీసుకుంటే ఫలితం ఉంటుంది.
- అతి వేడి ఉండే వారు దీన్ని తరచుగా వాడుతూ ఉండాలి. ఇది చలువ చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. ఎక్కువ వేడి చేస్తూ ఉంటే మన శరీరంలో కణాలు తొందరగా చనిపోతూ ఉంటాయి. ఇలాంటివి ఇంగువ తినడం వల్ల తగ్గుతాయి.
- జలుబు, దగ్గు, శ్వాస కోశ సమస్యలతో ఉన్న వారు దీన్ని తరచుగా తినడం వల్ల ఇవి తగ్గుముఖం పడతాయి. ఆస్తమా ఉన్న వారు వాడినా ఫలితం ఉంటుంది.
- చర్మంపై దురదలు, దద్దుర్లు, అలర్జీ వంటివి ఉంటే ఇంగువ పొడిని కూరల్లో తప్పక వాడాలి. లేదంటే ఇంగువ పొడిని కొబ్బరి నూనెలో కలిపి దురద ఉన్న చోట రాసుకోవాలి. ఫలితం వెంటనే కనిపిస్తుంది.
- అధిక రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తుంది.