జన ఔషధి కేంద్రాలు రోడ్డు పక్కన కనిపిస్తున్నా వాటిని పట్టించుకునేవాళ్లు చాలా తక్కువ. ప్రజలకు తక్కువ ధరలకే మందులు అందించేందుకు వాటిని ప్రభుత్వం జన్ ఔషధి స్కీమ్ పేరుతో 2008 లో ప్రారంభించింది. చివరగా 2016 లో దీని పేరును ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (PMBJP) అని మార్చారు. ఇక్కడ అమ్మే మందులనే జనరిక్ మెడిసిన్ అంటారు. వీటి ధర బ్రాండెడ్ మందులకన్నా 50 నుంచి 90 శాతం తక్కువుంటుంది. అంటే బయట 100 రూపాయలు ఖరీదు చేసే మాత్ర ధర ఇక్కడ 50 నుంచి 10 రూపాయల్లో దొరకొచ్చు. అయితే అసలు వాటిని వాడితే బ్రాండెడ్ మందులు వాడిన ఫలితాలుంటాయా లేదా అనే సందేహంతో చాలా మంది వాటిని వాడట్లేదు. దీని గురించి నిజాలు తెల్సుకోవాల్సిందే.
ఒక కంపెనీ మందు కనిపెట్టిన తర్వాత దాని పేటెంట్స్ తీసుకుంటుంది. అంటే దాని ఫార్ములాను, తయారీ విధానాన్ని ఎవ్వరైనా కాపీ కొట్టి అలాంటి మందులు తయారు చేస్తే వాళ్ల మీద చట్టపరమైన శిక్షలుంటాయి. అలా కనిపెట్టిన మందును ఒక బ్రాండ్ పేరు పెట్టి అమ్ముతుంది. అయితే ప్రభుత్వం ఈ పేటెంట్ హక్కులను 20 సంవత్సరాల వరకు ఇస్తుంది. అచ్చం ఒక రోడ్డుకు మనం కొన్ని సంవత్సరాలు టోల్ చెల్లించాక అది టోల్ ఫ్రీ అవుతుంది కదా.. అలాగే జెనరిక్ మెడిసిన్ కూడా. హక్కుల వ్యవధి పూర్తయ్యాక తక్కువ ధరతో అదే ఫార్ములాతో తయారు చేసిన మందులను జెనరిక్ మెడిసిన్ పేరుతో అమ్ముతారు. అంటే వీటి ఫార్ములాలో, పనితీరులో ఏ తేడా ఉండదు. అచ్చం బ్రాండెడ్ మందుల్లాగే వీటి పనితీరు కూడా ఉంటుంది.
ఆసుపత్రిలో వైద్యులు ఎక్కువగా బ్రాండ్ పేరు రాస్తారు తప్ప ఫార్ములా రాయరు. అంటే జ్వరం వస్తే డోలో ట్యాబ్లెట్ రాస్తారు కానీ పారాసిటమల్ అని ఫార్ములా రాయరు. దాంతో మనకు వైద్యులు చెప్పే బ్రాండెడ్ మందులు మాత్రమే వాడటం అలవాటు అవుతుంది మన నోళ్లలోనూ ఎక్కువగా బ్రాండ్ పేరు నానుతుంది తప్ప. ఫార్ములాల మీద పరిజ్ఞానం ఉండదు. వైద్యులు బ్రాండ్ పేరు రాయకుండా ఫార్ములానే రాయాలనే నియమం ఉన్నా దాన్ని అనుసరించేవాళ్లు తక్కువే. కాబట్టి సరైన అవగాహన ఉంటే మీరు వాడాలనుకుంటున్న బ్రాండ్ మందు ఫార్ములాలో అందుబాటులో ఉండే జనరిక్ మందును వాడవచ్చు. పనితీరులో ఏ మార్పు ఉండదు. అంత అనుమానం ఉంటే ఒకసారి వైద్యుల్ని సంప్రదిస్తే సరిపోతుంది. వీటి ధర బ్రాండెడ్ మందులతో పోలిస్తే సగం కన్నా తక్కువ ఉంటుంది.
మందులే కాకుండా ఈ జన ఔషది కేంద్రాల్లో శ్యానిటరీ న్యాప్‌కిన్లు లేదా ప్యాడ్స్ అందుబాటులో ఉంటాయి. వీటి ధర కేవలం 1 రూపాయి. వీటిని జనఔషధి సువిధ శ్యానిటరీ న్యాప్‌కిన్ పేరుతో అమ్ముతారు. ఒక ప్యాకెట్లో నాలుగు,10 సంఖ్యలో ప్యాడ్స్ ఉండే ప్యాకెట్లుంటాయి. ఇవి ఆక్సీ బయోడిగ్రేడబుల్ అవ్వడం వల్ల పర్యావరణానికి కూడా హితమే. బయట దొరికే ప్యాడ్స్ కన్నా వీటి ధర దాదాపుగా 75 శాతం తక్కువ. ప్యాడ్స్ తో పాటే డైపర్లు, మాస్కులు, రబ్బర్ గ్లోవ్స్ లాంటివన్నీ ఈ జన ఔషది కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి.
మీ దగ్గర్లో ఉన్న జన్ ఔషది స్టోర్ ఎక్కడుంది? ఏఏ మందులు అందుబాటులో ఉన్నాయి లాంటి వివరాలన్నీ తెల్సుకోడానికి ప్రభుత్వం యాప్ కూడా తీసుకొచ్చింది. యాప్ పేరు JAN AUSHADHI SUGAM . ప్లేస్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకుని మందుల ధరలు, అందుబాటు తెల్సుకోవచ్చు.
ఇంకేం.. జనరిక్ మందులంటే భయపడకుండా, తక్కువ ధరకొస్తున్నాయంటే నాణ్యత తక్కువనే అపనమ్మకం నుంచి బయటకు వచ్చి వీటిని మీకు అవసరం అయినప్పుడు ఉపయోగించండి. ఆర్థికంగా లబ్ది పొందండి.
టాపిక్