Balance Your Hormones: ఈ 4 రకాల గింజలు గుప్పెడు తినండి చాలు.. మీ హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్‌ దూరం..-know about different nuts and seeds which balances your hormones ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Balance Your Hormones: ఈ 4 రకాల గింజలు గుప్పెడు తినండి చాలు.. మీ హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్‌ దూరం..

Balance Your Hormones: ఈ 4 రకాల గింజలు గుప్పెడు తినండి చాలు.. మీ హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్‌ దూరం..

Koutik Pranaya Sree HT Telugu
Nov 14, 2023 11:04 AM IST

Balance Your Hormones: శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని రకాల గింజల్ని రోజూ గుప్పెడు తినడం వల్ల ఆ సమస్యని కాస్త తగ్గించుకోవచ్చు.

హార్మోన్ల సమతుల్యత
హార్మోన్ల సమతుల్యత (freepik)

మన శరీరం ఆరోగ్యం ఉండాలంటే మనలో ఉండే హార్మోన్లన్నీ చక్కగా వాటి విధుల్ని నిర్వర్తించాలి. అవి ఎక్కువగా విడుదలయినా, తక్కువగా విడుదలైనా రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కారణం లేకుండా బరువు పెరిగిపోవడం, మలబద్ధకం, థైరాయిడ్‌, పీసీఓడీ, ఒత్తిడి, ఆందోళన లాంటివి తలెత్తి దీర్ఘ కాలికంగా ఉంటాయి. మరి హర్మోన్లు ఇన్‌బ్యాలెన్స్‌ లేకుండా తగినంగా విడుదలై సరిగ్గా వాటి విధుల్ని నిర్వర్తించాలంటే ఎక్కువ ప్రొటీన్‌ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, జంక్‌ ఫుడ్‌, కెఫిన్‌, సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వీటితో పాటుగా కొన్ని విత్తనాలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఫలితం ఉంటుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.

ప్రొద్దు తిరుగుడు గింజలు:

ఈ గింజల్లో ఎక్కువగా ఐరన్‌ ఉంటుంది. విటమిన్‌ ఈ, సెలీనియంలు ఉంటాయి. ఇవి ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. రక్త హీనత, ఐరన్‌ లోపంతో బాధ పడేవారు వీటిని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్‌లు దరి చేరవు.

చియా సీడ్స్‌ :

అత్యంత ఆరోగ్యకరమైన గింజల్లో చియా సీడ్స్‌ ఒకటి. వీటిలో మనకు అవసరం అయిన పోషకాలు, విటమిన్లు, మినరళ్లు, పీచు పదార్థం లాంటివి సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మన జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగవుతుంది. పేగుల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అందువల్ల ఒకవేళ మన శరీరంలో ఏదైనా హార్మోన్‌ ఎక్కువగా విడుదలైనా దాన్ని పేగులు బయటకు పంపించేయ గలుగుతాయి. దీంతో ఇన్‌బ్యాలెన్స్‌లు తగ్గుతాయి. చియా గింజల్ని రెండు గంటల పాటు నానబెట్టి స్మూతీలు, జ్యూస్‌లు, పెరుగులో కలుపుకుని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి లాభాలే గుమ్మడి గింజల్ని తినడం వల్లా కలుగుతాయి.

అవిశె గింజలు :

అవిశె గింజలు హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్‌లను తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సంతానోత్పత్తి విషయంలో సమస్యలు ఉన్న వారికి ఇవి చక్కగా పని చేస్తాయి. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని పెంచి ఫెర్టిలిటీని బలోపేతం చేస్తాయి. వీటిని పొడి చేసుకుని పెరుగు, సలాడ్లు, స్మూతీలు, మజ్జిగ తదితరాల్లో కలుపుకుని తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది.

నువ్వులు :

ఆరోగ్యకరమైన కొవ్వులు నువ్వుల్లో పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు ప్రొటీన్‌లు, బీ విటమిన్లు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ తగినంతగా ఉత్పత్తి కావడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చూస్తాయి. కూరలు, వేపుళ్లు, చట్నీలు, లడ్డూల్లో నువ్వుల్ని వేసుకుని తినవచ్చు. రుచికి రుచిగానూ ఉంటాయి. ఆరోగ్యాన్నీ ఇస్తాయి.