Unhappy Marriages । పెళ్లంటే నూరెళ్ల మంట అనేది ఇందుకే.. ఈ జీవితానికి పరిష్కారం అదొక్కటే!
Unhappy Marriages: పెళ్లి చేసుకోకపోతే పెళ్లెప్పుడు చేసుకుంటావు అంటారు. తీరాపెళ్లికి సిద్ధమైతే పెళ్లి వద్దంటారు. చాలా మంది తమ వైవాహిక జీవితంపై అసంతృప్తితో ఉండటమే ఇందుకు కారణం. మరి అసంతృప్తికి కారణాలేవో ఇక్కడ చూడండి.
Loveless Marriage: వివాహం అనేది ఆడ, మగ ఇద్దరూ కలిసి ఒక కుటుంబంగా, ఒకరికి ఒకరు తోడునీడగా జీవితకాలం కలిసి ఉండటానికి ఉద్దేశించిన ఒక పవిత్రమైన కార్యం. వివాహబంధం ద్వారా భార్యాభర్తలుగా మారిన వారు సమాజంపరంగా, చట్టప్రకారంగా ఒకే కుటుంబానికి చెందిన వారు అవుతారు. ఇది వారి వంశ వృద్ధికి తోడ్పడటానికి అవకాశం ఇస్తుంది. జీవితానికి ఒక భరోసాని ఇస్తుంది.
ట్రెండింగ్ వార్తలు
వివాహం బంధంతో ఒక్కటైన జంట సంతోషంతో సాంగత్యాన్ని పంచుకోవాలి. అయితే చాలామంది భార్యభర్తల మధ్య పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల వరకు ప్రేమ, అన్యోన్యత, సాంగత్యం అనేది రోజులు గడిచేకొద్దీ పలుచబడుతున్నాయి. ముఖ్యంగా నేటికాలంలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. బబుల్ గమ్ నములుతున్నప్పుడు మొదట్లో తియ్యగా ఉండి, నమిలే కొద్దీ ఎలా అయితే చప్పబడుతుందో, అదేవిధంగా చాలా మంది జంటల మధ్య మొదట్లో ఉండే తియ్యదనం రానురాను చప్పగా, కొన్నిసార్లు చేదుగా మారి బంధం చెడిపోయే వరకు దారితీస్తుంది.
Reasons for Unhappy marriages- అసంతృప్తికర వైవాహిక జీవితానికి కారణాలు
చాలా మంది భార్యాభర్తలు తమ వివాహ జీవితంపై సంతోషంగా ఉండటం లేదని నిపుణులు అంటున్నారు. ఇందుకు కొన్ని కారణాలను తెలియజేశారు. కారణాలు తెలుసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగితే బంధం పదిలంగా ఉంటుందని అంటున్నారు. మరి పెళ్లంటే పంట కాదు నూరేళ్ల మంట అని చాలా మంది చెప్పడానికి కారణాలేవో ఇక్కడ చూడండి.
1. మార్పు భయం
వైవాహిక జీవితంలో చోటు చేసుకునే మార్పులు భార్యాభర్తలిద్దరిలో ఒకరికి కచ్చితంగా నచ్చకపోవడం. తన భర్త తన మాట వినడం లేదు లేదా తన నియంత్రణలో ఉండటం లేదని భావించి భార్య చేసే కొన్ని చర్యలు భర్తకు నచ్చవు. భార్య గానీ, తన తరఫు బంధువులు గానీ తన మాటకు విలువ ఇవ్వడం లేదని భర్త చూపే అసహనం. ఈ రెండూ ఇద్దరి మధ్య చిచ్చుకు కారణం అవుతాయి. అందుకే ఏ సమస్య వచ్చినా భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం గానీ, బయటి శక్తులు నియంత్రించడం గానీ ఉండకూడదు.
2. అలవాట్లు
ఎవరి వ్యక్తిగత అలవాట్లు వారికి ఉంటాయి. భార్యలోని కొన్ని అలవాట్లు భర్తకు నచ్చకపోవచ్చు, భర్తకు సంబంధించిన చాలా అలవాట్లు భార్యకు నచ్చకపోవచ్చు. ఒకరి అలవాట్లు ఎత్తిచూపినపుడు, అదేరకమైన ప్రతిస్పందన మరొకరి నుంచి ఎదురవుతుంది. ఇది ఇరువురి మధ్య వాగ్వివాదానికి దారితీయవచ్చు. అప్పటికప్పుడు సర్దుకుపోయినా, అది ఎప్పుడూ వారి మనసులో ఉంటుంది.
3. ఆర్థిక వ్యవహారాలు
సంతోషంగా లేని వైవాహిక జీవితంలో ఉండాలా, వద్దా ? అని నిర్ణయించేటప్పుడు డబ్బు విషయాలు పెద్ద పాత్ర పోషిస్తాయి. భార్యాభర్తల మధ్య చాలా సార్లు గొడవలకు డబ్బు, ఆస్తులు ప్రధాన కారణం అవుతాయి. విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు భర్త ఆస్తులు రెండు కుటుంబాలకు విభజించడం అనేది చాలా కఠోరమైన అంశం. భార్యాభర్తల మధ్య డబ్బు విషయంలో గొడవలు చెలరేగకుండా వారే ఒక ఒప్పందానికి రావడం ప్రశాంతతకు మార్గం.
4. అనుమానం
భార్యాభర్తలు ఇరువురు తెలిసి లేదా తెలియక చేసే ఒక చర్యలు, కొన్ని సందర్భాల్లో వారివారి నోటి నుంచి వచ్చే మాటలు అనుమానంను కలిగిస్తాయి. చిన్న అనుమానం పెనుభూతంగా మారవచ్చు. ఈక్రమంలో కొన్నిసార్లు ఆ అనుమానం నిజం చేసే ఉద్దేశ్యంతో ఉండవచ్చు. ఇది మరిన్ని అనర్థాలకు దారితీస్తుంది. ఏదిఏమైనా భార్య తన భర్త గురించి కాకుండా మరొకరి గురించి గొప్పగా చెప్పడం, భర్త మరొక అమ్మాయి అందాన్ని, గుణాలను పొగడడం చేస్తే వారి వైవాహిక జీవితం అసంతృప్తితో సాగుతుంది.
5. సామాజిక బాధ్యతలు
విడాకులు తీసుకోవడం లేదా విడిపోవడం అనే అంశంలో ఇరువురి కుటుంబ నేపథ్యాలు లేదా మతపరమైన అనుబంధం, తీసుకునే బాధ్యతలు కూడా కారణం అవుతాయి. ప్రేమకు, పెళ్లికి ఈ కట్టుబాట్లు ఏమి అడ్డుకాకపోవచ్చు. కానీ కలిసి జీవించేటపుడు ఒకరి కుటుంబ నేపథ్యాన్ని, మతపరమైన విశ్వాసాలను ఇద్దరులో ఏ ఒక్కరు పాటించకపోయినా వారి వైవాహిక జీవితం అసంతృప్తిగా సాగుతుంది.
కొన్నిసార్లు, వైవాహిక జీవితంలో అసంతృప్తి ఉన్నప్పటికీ కలిసి ఉండాలనే ఆశ ఉంటే అది చాలు. భాగస్వామిపై అప్పటికీ నమ్మకం ఉంటే, చివరి సమయాల్లో కూడా వారు విడిపోయే విషయంలో వెనకడుగు వేస్తారు. మెల్లిమెల్లిగా పరిస్థితులు మెరుగుపడతాయి. అలా సయోధ్య కుదరడం చాలా కీలకం.
సంబంధిత కథనం