Sleeping Tips : మంచి నిద్ర కోసం ఈ 4 విషయాలు పాటించండి
Sleeping Tips In Telugu : నిద్రలేమి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ఇది అలాగే కంటిన్యూ అయితే చాలా పెద్ద ప్రమాదం. కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే హ్యాపీగా నిద్రపోవచ్చు. అవేంటో కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. ఒక్కరోజు నిద్రలేకుంటే మరుసటి రోజున ప్రతీ పని మీద ప్రభావం పడుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే సరైన నిద్రపోవాలి. రోజులో 8 గంటల నిద్రపోతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ 4 విషయాలను పాటిస్తే హాయిగా నిద్రపోవచ్చు.
రాత్రిపూట మంచి నిద్ర పొందడానికి మీరు కచ్చితంగా సమయపాలన పాటించాలి. ప్రతిరోజూ పడుకోవడానికి నిర్దిష్ట సమయాన్ని పెట్టుకోవాలి. రాత్రి 10 గంటల తర్వాత మెలకువగా ఉండకూడదు. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి మేల్కొలనడం అలవాటు చేసుకుంటే తప్పకుండా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
నిద్రవేళకు 1 గంట ముందు సెల్ ఫోన్‌లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయండి. వీలైతే దాన్ని మీ దగ్గర పెట్టుకోకుండా పక్క గదిలో పెట్టి ప్రశాంతంగా నిద్రపోవడం మంచిది. టైమ్ ఫాలో అయ్యే సమయంలో మెుదట్లో అలారం పక్కన పెట్టుకుంటే చాలు. సమయానికి నిద్ర లేవడానికి మాత్రమే కాకుండా సరైన సమయానికి నిద్రపోవడానికి కూడా దీన్ని ఉపయోగించండి.
నిద్రను ఆలస్యం చేసే టీ, కాఫీ, శీతల పానీయాలు వంటి పానీయాలు తాగడం మానేయాలి. కంటి నిండా నిద్రపోతే చాలా సమస్యలు దూరమవుతాయి. కెఫిన్ అధికంగా ఉండే పానీయాల జోలికి అస్సలు పోకూడదు. మీరు ఎంత ట్రై చేసినా నిద్రరాకుండా చేస్తాయి.
నాల్గోది అతి ముఖ్యమైనది ఏంటంటే అనవసరమైన ఆలోచనల పెట్టుకోకూడదు. ఎక్కువగా ఆలోచించడం మన సమస్యలను పరిష్కరించదు. ఎంత ఆలోచించినా జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. జీవితంలో గెలవాలి అంటే.., ఏదైనా విషయం నుంచి బయటపడాలి అంటే.. శరీరానికి, మనస్సుకు విశ్రాంతి అవసరం. అందుకే సరైన నిద్రపోతే మానసికంగానూ స్ట్రాంగ్‌గా ఉంటారు.
ఒక మనిషి కనీసం 7నుండి 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకున్నప్పుడు శరీరంలో అనేక కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. శరీరం రిలాక్స్ అయ్యేందుకు తగిన సమయం తీసుకుంటుంది. కళ్లకు ప్రశాంతత, హృదయానికి శాంతి, మెదడుకు ప్రశాంతత, చేతులు, కాళ్లకు ప్రశాంతత లభిస్తాయి. మంచి రాత్రి నిద్రను మీ అలవాటుగా చేసుకోండి. అది మిమ్మల్ని జీవితంలో మంచి వ్యక్తిగా చేస్తుంది.
రోజువారీ జీవితంలో ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉంటే మంచిది. వాటి ద్వారా నిద్ర సమస్యలు వస్తాయి. ధ్యానం మనస్సును ప్రశాంతంగా చేస్తుంది. బాగా నిద్రపట్టేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఉదయం లేదా సాయంత్రం ధ్యానం చేయాలి. నిద్రకు ముందు పుస్తకాలు చదవడం మంచి అలవాటు. పుస్తక పఠనం ద్వారా ప్రశాంతంగా నిద్ర వస్తుంది. మీ బెడ్ రూములో నిద్రకు భంగం కలిగించే శబ్దాలు లేకుండా చూడండి.
టాపిక్