Chicken Fry: కేరళ స్టైల్‌లో చికెన్ వేపుడు ఇలా చేయండి, కొత్తగా చాలా టేస్టీగా ఉంటుంది, రెసిపీ ఎంతో సులువు
Chicken Fry: చికెన్ వంటకాలు అంటే మీకు ఇష్టమా? అయితే కేరళ స్టైల్ లో చికెన్ వేపుడు చేసి చూడండి. అన్నం అవసరం లేదు, ఉత్తినే ఈ కూరను తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. రెసిపీ కూడా చాలా సులువు.
Chicken Fry: ఆదివారం వస్తే ప్రతి ఇంట్లో చికెన్ వంటకాలు ఘుమఘుమలాడాల్సిందే. చికెన్ బిర్యానీ దగ్గర నుంచి చికెన్ వేపుడు వరకు అనేక రకాల రెసిపీలు దీంతో ప్రయత్నిస్తారు. ఎప్పుడూ ఒకేలాంటివి కాకుండా ఈసారి కేరళ స్టైల్‌లో చికెన్ వేపుడు చేసి చూడండి. దీనికి జతగా ఏమీ లేకపోయినా ఉత్తి కూరనే తినేయాలనిపిస్తుంది. అన్నంలో కలుపుకున్న టేస్టీగా ఉంటుంది. చపాతీతో తిన్నా కూడా రుచిగానే ఉంటుంది. ఈ కేరళ స్టైల్ లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకోండి.
కేరళ స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీకి కావలసిన పదార్థాలు
చికెన్ ముక్కలు - అరకిలో
కాశ్మీరీ కారం - ఒక స్పూను
ధనియాలు - ఒక స్పూను
ఎండుమిర్చి - పది
పసుపు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
వెల్లుల్లి తరుగు - రెండు స్పూన్లు
అల్లం - చిన్న ముక్క
నిమ్మరసం - అర స్పూను
కరివేపాకులు - గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
ఉల్లిపాయ - ఒకటి
కేరళ స్టైల్‌లో చికెన్ ఫ్రై రెసిపీ
1. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
2. ఉప్పు, పసుపు, నిమ్మరసం, కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.
3. ఆ తర్వాత మిక్సీ జార్లో ధనియాలు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి కాస్త నీరు చేర్చి బాగా ముద్దలా రుబ్బుకోవాలి.
4. ఆ పేస్టును కూడా చికెన్ లో వేసి బాగా మ్యారినేట్ చేయాలి.
5. ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు అలా వదిలేయాలి.
6. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
7. నూనె వేడెక్కాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి.
8. ఉల్లిపాయలను రింగ్స్‌లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
9. చికెన్ బాగా ఉడికే వరకు అలా చిన్న మంట మీద ఉంచాలి.
10. చికెన్ బాగా ఫ్రై అయ్యాక కరివేపాకులు చల్లుకోవాలి.
11. ఒక ప్లేట్లోకి తీసుకొని ఆనియన్ రింగ్స్ పక్కన పెట్టి సర్వ్ చేయాలి. దీని రుచి అదిరిపోతుంది.
12. తినేకొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. ఒక్కసారి మీరు చేసుకుని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.
చికెన్ వంటకాలు మితంగా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చికెన్‌లో ఉండే పోషకాలు మనకు అవసరమైనవి. దీనిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా లీన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన శరీరానికి వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని అందిస్తుంది. ప్రతిరోజూ చికెన్ తినాల్సిన అవసరం లేదు. వారంలో రెండు నుంచి మూడుసార్లు తింటే చాలు, మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ దీని నుంచి మనం పొందుతాం.
టాపిక్