Pink Tea: చల్లని వాతావరణంలో వేడి వేడి కాశ్మీరీ పింక్ టీ తాగితే ఆ రుచే వేరు, రెసిపీ ఇదిగోండి-kashmiri pink tea recipe in telugu know how to make this recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pink Tea: చల్లని వాతావరణంలో వేడి వేడి కాశ్మీరీ పింక్ టీ తాగితే ఆ రుచే వేరు, రెసిపీ ఇదిగోండి

Pink Tea: చల్లని వాతావరణంలో వేడి వేడి కాశ్మీరీ పింక్ టీ తాగితే ఆ రుచే వేరు, రెసిపీ ఇదిగోండి

Haritha Chappa HT Telugu
Dec 05, 2024 05:30 PM IST

Pink Tea: మీరు ప్రతిరోజూ ఒకేలాంటి టీ తాగుతూ ఉంటే… ఈసారి కొత్తగా కాశ్మీరీ పింక్ టీని ప్రయత్నించండి. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాశ్మీరీ పింక్ టీ రెసిపీ ఇక్కడ ఇచ్చాము. దీన్ని చేసుకుని తాగేందుకు ప్రయత్నించండి.

కాశ్మీరీ పింక్ టీ
కాశ్మీరీ పింక్ టీ (Shutterstock)

రోజులో కనీసం రెండసార్లయిన టీ తాగకపోతే ఏ పనీ చేయలేని వారు ఎంతో మంది. ముఖ్యంగా చలికాలంలో వేడి వేడి టీ తాగుతుంటే ఆ మజాయే వేరు. సాధారణంగా ఇళ్లలో అల్లం, యాలకులు వేసి ఎక్కువగా పాలతో చేసిన టీనే తాగుతూ ఉంటారు. కొంతమంది ఆరోగ్య ప్రేమికులు బ్లాక్ టీ, గ్రీన్ టీ వంటివి కూడా తాగుతారు. ఇవన్నీ ఎప్పుడూ తాగేవే. ఓసారి కొత్తగా కాశ్మీరీ పింక్ టీ తాగేందుకు ప్రయత్నించండి. దీన్ని వేడి వేడిగా తాగుతుంటే ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. కాశ్మీర్ లోయల్లో నివసించే ప్రజలు చాలా ఇష్టంగా తాగే టీ ఇది. దీనిని నూన్ టీ అని కూడా పిలుస్తారు. ఇది చల్లని వాతావరణంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. దాని రుచి కూడా సాధారణ టీ కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీన్ని ఇంట్లో సులభంగా తయారు చేయవచ్చు.

yearly horoscope entry point

కాశ్మీరీ పింక్ టీ రెసిపీకి కావలసిన పదార్థాలు

చల్లని నీరు - రెండు కప్పులు

అనాస పువ్వు - రెండు

దాల్చిన చెక్క - ఒక ముక్క

యాలకులు - మూడు

కాశ్మీరీ టీ ఆకులు లేదా గ్రీన్ టీ ఆకులు - మూడు స్పూన్లు

బేకింగ్ సోడా - అరస్పూను

ఉప్పు - చిటికెడు

పాలు - అర కప్పు

పంచదార - రెండు స్పూన్లు

పిస్తా తరుగు - ఒక స్పూను

బాదం తరుగు - ఒక స్పూను

కాశ్మీరీ పింక్ టీ రెసిపీ

  1. కాశ్మీర్ కు ప్రసిద్ధ పింక్ టీ తయారు చేయడానికి మొదట ఒక కళాయిలో రెండు కప్పుల చల్లటి నీటిని తీసుకోండి.
  2. ఆ నీటిలో యాలకులు, అనాస పువ్వు, దాల్చినచెక్క ముక్కలు వేసి మరిగించండి.
  3. కాసేపటి తరువాత గ్రీన్ టీ లేదా కశ్మీరీ టీ ఆకులను కూడా వేయండి.
  4. టీ మరుగుతున్నప్పుడే బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలపాలి.
  5. దీన్ని పెద్ద మంటపై మరిగిస్తే నీరు సగానికి తగ్గిపోతుంది. ఆ తరువాత మళ్లీ రెండు కప్పుల నీళ్లు వేసి గరిటెతో కలుపుతూనే ఉండాలి.
  6. ఇది చేయడానికి ఎక్కువ సమయమే పడుతుంది కానీ రుచి అదిరిపోతుంది.
  7. ఈ మొత్తం మిశ్రమం ఒక కప్పుకు తగ్గేవరకు అలా మరిగించాలి. తరువాత స్టవ్ కట్టేయాలా.
  8. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో వేసి దాచుకోవాలి.
  9. మీకు టీ తాగాలినిపించినప్పుడు ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు పాలు, పంచదార వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి.
  10. అందులో ఫ్రిజ్ లో రెడీ ఉన్న టీ మిశ్రమాన్ని తీసి అరకప్పు వేయాలి. తరువాత దాన్ని మరిగించాలి. ఈ మొత్తం మిశ్రమం సగానికి తగ్గేవరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.

కాశ్మీరీ పింక్ టీని కాశ్మీర్ ప్రజలు చాలా ఇష్టంగా తాగుతారు. అక్కడున్న ప్రతి ఇంట్లోనూ ఈ టీ రెడీగా ఉంటుంది. మీరు కూడా చేసుకుని ఒకసారి తాగి చూడండి మీకు నచ్చడం ఖాయం.

  1. పైన బాదం తరుగు, పిస్తా తరుగు వేసుకుంటే పింక్ టీ రెడీ అయిపోతుంది. వేడి వేడిగా తాగితే రుచి అదిరిపోతుంది.

Whats_app_banner