Karthika Masam 2023 : కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం? ముఖ్యమైన రోజులివే!
Karthika Masam 2023 : ఏటా దీపావళి తర్వాత రోజు కార్తీక మాసం ప్రారంభం కాగా, ఈ ఏడాది దీపావళి తర్వాత రెండో రోజు కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. అంటే నవంబర్ 14 నుంచి కార్తీక మాసం మొదలవుతోంది.
Karthika Masam 2023 : ఏటా దీపావళి మర్నాడే కార్తీకమాసం ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాది దీపావళి మర్నాడు కాకుండా రెండో రోజు నుంచి కార్తీకమాసం మొదలవుతోంది. సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తిథే నెల ప్రారంభానికి సూచన. ఎందుకంటే కార్తీక స్నానాలు చేసేది బ్రహ్మమూహూర్తంలోనే!.. అందుకే నవంబరు 12న దీపావళి మర్నాడు నవంబరు 13 సోమవారం సూర్యోదయానికి అమావాస్య ఉంది. అందుకే నవంబరు 14 మంగళవారం సూర్యోదయం సమయానికి పాడ్యమి ఉండడంతో ఆ రోజు నుంచి ఆకాశదీపం ప్రారంభమవుతోంది. అంటే నవంబరు 14 మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలవుతోంది.
•నవంబరు 14 మంగళవారం -కార్తీకమాసం ప్రారంభం పాడ్యమి
• నవంబరు 15 బుధవారం -యమవిదియ - భగినీహస్త భోజనం
• నవంబరు 17 శుక్రవారం- నాగుల చవితి
• నవంబరు 20- కార్తీకమాసం మొదటి సోమవారం, కార్తావీర్యజయంతి
• నవంబరు 22- యాజ్ఞవల్క జయంతి
• నవంబరు 23- మతత్రయ ఏకాదశి
• నవంబరు 24 శుక్రవారం- క్షీరాబ్ది ద్వాదశి
• నవంబరు 26 ఆదివారం- జ్వాలా తోరణం
• నవంబరు 27 సోమవారం - కార్తీకమాసం రెండో సోమవారం, కార్తీకపూర్ణిమ.
• డిసెంబరు 04 -కార్తీకమాసం మూడో సోమవారం
• డిసెంబరు 11- కార్తీకమాసం నాలుగో సోమవారం
• డిసెంబరు 13 బుధవారం- పోలి స్వర్గం
కార్తీకమాసం నెలరోజులూ అత్యంత నియమనిష్టలతో ఉంటారు. కార్తీమాసం నియమాలు పాటించేవారు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోవాలని వేదపండితులు తెలిపారు. చలిగాలులు పెరిగే సమయం కాబట్టి ఈ నెలలో పేదలకు, అనాధలకు స్వెట్టర్లు, దుప్పట్లు, కంబళ్ళు దానం చేస్తే శివ కేశవవుల అనుగ్రహం లభిస్తుందంటారు. దానధర్మాలు గోప్యంగా చేసినవాటికి ఎక్కువ ఫలితాలు ఉంటాయన్నది గుర్తుంచుకోవాలంటారు పండితులు.
కార్తీకమాసంలో ఈ పనులకు దూరం
• వాంఛలు పెంచే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి.
• కనీసం ఈ నెల రోజులు ఓ నియమంలా పాటిస్తూ పాపపు ఆలోచనలు, ఒకరికి ద్రోహం చేయాలనే ఆలోచనలు మానేయాలి
• విశ్వాసం ఉంటే దేవుడిని పూజించండి లేదంటే మానేయండి... దైవదూషణ మాత్రం చేయకండి.
• దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరత్రా అవసరాలకు ఉపయోగించకండి.
• మినుములు తినకూడదు, నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు.
కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం, జ్వాలాతోరణం మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తీక పురాణంలో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి. కాబట్టి ఈ ఏడాది నవంబరు 14 మంగళవారం నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. డిసెంబరు 13 బుధవారం పోలిస్వర్గంతో కార్తీకమాసం పూర్తవుతుంది.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.