కందిపప్పు పచ్చడి ఇలా చేశారంటే స్పైసీగా అదిరిపోతుంది, అన్నంలో కలుపుకుంటే ఆ రుచే వేరు-kandipappu pachadi recipe in telugu know how to make this tasty recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కందిపప్పు పచ్చడి ఇలా చేశారంటే స్పైసీగా అదిరిపోతుంది, అన్నంలో కలుపుకుంటే ఆ రుచే వేరు

కందిపప్పు పచ్చడి ఇలా చేశారంటే స్పైసీగా అదిరిపోతుంది, అన్నంలో కలుపుకుంటే ఆ రుచే వేరు

Haritha Chappa HT Telugu
Published Feb 14, 2025 11:30 AM IST

కందిపప్పు అనగానే అందరికీ సాంబారు, తోటకూర పప్పు వంటివే వండుకోవాలని అనుకుంటారు. దీంతో పచ్చడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ తెలుసుకోండి.

కందిపప్పు పచ్చడి రెసిపీ
కందిపప్పు పచ్చడి రెసిపీ (Amma cheti vanta/Youtube)

కందిపప్పు పచ్చడి రుచి పాతతరం వాళ్లకి తెలుస్తుంది. కొత్త తరంలో ఈ పచ్చడిని తిని చేసుకుని తినే వారి సంఖ్య తక్కువే. సాంబారుగా, పప్పుగా మాత్రమే కందిపప్పును వినియోగిస్తారు. నిజానికి కందిపప్పుతో టేస్టీ పచ్చడి చేసుకోవచ్చు. పచ్చిమిర్చి లేదా ఎండు మిర్చి వేసి స్పైసీగా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ కందిపప్పు పచ్చడి వేసుకొని తింటే అదిరిపోతుంది. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

కందిపప్పు పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

కందిపప్పు - అరకప్పు

ఉప్పు - రుచికి సరిపడా

జీలకర్ర - రెండు స్పూన్లు

ఎండుమిర్చి - పది

వెల్లుల్లి రెబ్బలు - పది

కరివేపాకులు - గుప్పెడు

చింతపండు - ఉసిరికాయ సైజులో

నీళ్లు - సరిపడినన్ని

నూనె - రెండు స్పూన్లు

ఆవాలు - అర స్పూను

కంది పచ్చడి రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.

2. అందులో ఎండుమిర్చిని వేసి వేయించాలి.

3. అలాగే కరివేపాకులు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.

4. ఈ లోపు కందిపప్పును నీళ్లలో వేసి కాసేపు నానబెట్టుకోవాలి.

5. చింతపండును కూడా కొంచెం నీళ్లలో నానబెట్టాలి.

6. ఇప్పుడు మిక్సీలో వేయించుకున్న ఎండుమిర్చి, కరివేపాకులు, జీలకర్ర, కందిపప్పు వేసి మెత్తగా రుబ్బాలి.

7. అలాగే చింతపండును కూడా వేసి బాగా రుబ్బుకోవాలి.

8. రుచికి సరిపడా ఉప్పును వేయాలి.

9. వెల్లుల్లిపాయలను కూడా వేసి బాగా దంచుకోవాలి.

10. ఈ మొత్తం మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేయాలి.

11. ఇప్పుడు దీనికి తాళింపు పెట్టేందుకు స్టవ్ మీద కళాయి పెట్టాలి.

12. అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు, వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి వేసి బాగా వేయించుకొని వాటిని పచ్చడిపై పోపులాగా వేసుకోవాలి.

13. అంతే టేస్టీ కంది పచ్చడి రెడీ అయినట్టే.

14. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.

15. ఇడ్లీని కూడా ఈ పచ్చడితో నంజుకుంటే ఆ రుచే వేరు.

16. ఒక్కసారి కందిపప్పు పచ్చడిని ఇలా చేసుకుని చూడండి ఎంత రుచిగా ఉంటుందో.

17. మీకు కావాలనుకుంటే కందిపప్పును ఒకసారి వేయించుకొని కూడా నానబెట్టుకోవచ్చు. ఎలా చేసుకున్నా కందిపప్పు పచ్చడి అద్భుతంగా ఉంటుంది.

పురాతన కాలం నుంచి మనం తింటున్న ఆహారాల్లో కందిపప్పు ఒకటి. కందిపప్పు లేనిదే ఎన్నో ఇళ్లల్లో భోజనం గడవదు. కూర వండుకున్నా కూడా పక్కన పప్పు ఉండాల్సిందే. శాఖాహారులకు కందిపప్పు ద్వారానే అధిక శాతం ప్రోటీన్ అందుతుంది. కాబట్టి కందిపప్పును తినడం ఎంతో ముఖ్యం. ఈ కందిపప్పు పచ్చడిని తింటే మీకు ఇంకా నచ్చుతుంది. పురాతన కాలంలో అమ్మమ్మలు, నానమ్మలు కందిపప్పు పచ్చడిని కచ్చితంగా చేసేవారు. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner