Kalonji coconut oil: జుట్టు రాలే సమస్య తగ్గించే.. మ్యాజిక్ హెయిర్ ఆయిల్..
Kalonji coconut oil: జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉందా? అయితే కొబ్బరినూనెలో కలోంజి కలిపి వాడితే మంచి ఫలితం ఉంటుంది. అదెలాగో తెలుసుకోండి.
జుట్టు రాలే సమస్య ఎక్కువగా అనిపిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్య ఎక్కువయిపోతుంది. అలాగని ఏవోవో ఉత్పత్తులు సరిగ్గా తెల్సుకోకుండా జుట్టుకు రాస్తూ పోతే సమస్య పెరుగుతుందే కానీ తగ్గదు. ముందుగా ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే ఫలితం ఉంటుంది. మనందరికీ తెలిసిన కొబ్బరినూనెలో కలోంజీ విత్తనాలు కలిపి రాసుకుంటే జుట్టు రాలే సమస్యకు చాలా ఫలితం ఉంటుంది.
నూనెతో మర్దనా:
చాలా రకాల జుట్టు సమస్యలకు ఇంట్లోనే చిట్కాలుంటాయి. ముఖ్యంగా కొబ్బరినూనె, కలోంజి వల్ల బోలెడు లాభాలుంటాయి. వీటిని కలిపి రాసుకున్నప్పుడు జుట్టు రాలే సమస్య తగ్గించి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
లాభాలు:
- కొబ్బరినూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్ల వల్ల జుట్టుకు కావాల్సిన తేమ అందుతుంది. జుట్టు పొడిగా, నిర్జీవంగా కాకుండా ఉంటుంది.
- విటమిన్ ఇ, విటమిన్ కె ఉండటం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి.
- యాంటీ మైక్రోబయల్ లక్షణాలుండటం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
- క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు ప్రొటీన్ కోల్పోదు. ఇలా ఒక కవచం లాగా పనిచేసి జుట్టు సులువుగా తెగిపోకుండా చేస్తుంది.
కలోంజీ కొబ్బరినూనె కలిపి వాడితే లాభాలు:
- కలోంజీలో ఐరన్, జింక్, విటమిన్ ఇ, ఎ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సాయపడతాయి.
- యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల మాడు ఆరోగ్యంగా ఉండేలా కాపాడతాయి.
- ఒక ఎసెన్షియల్ నూనె లాగా పనిచేసి జుట్టుకు కొత్త మెరుపు తీసుకొస్తాయి.
- జుట్టు పలుచబడే సమస్య ఉన్నవాళ్లు కలోంజీ, కొబ్బరినూనె కలిపి వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
కలోంజీ కొబ్బరినూనె ఎలా తయరు చేయాలి?
- పావు కప్పు ఆర్గానిక్ కొబ్బరినూనెను కాస్త గోరువెచ్చగా అయ్యేదాకా వేడిచేయాలి.
- ఇందులో రెండు చెంచాల కలోంజీ వేసి మరో రెండు మూడు నిమిషాలు వేడి చేయాలి.
- ఈ కొబ్బరినూనెను మరో సీసా లోకి పోసుకుని అలా ఒక పూట వదిలేయాలి.
- ఆ తర్వాత కలోంజీ గింజలను వడకట్టేసి నూనె గాజు సీసాలో భద్ర పరుచుకోవాలి.
- ఈ నూనెను తలకు మర్దనా చేసి ఒక అరగంట సేపు ఉంచుకుని తలస్నానం చేస్తే చాలు.
ఈ నూనెను వారానికి కనీసం రెండు సార్లు వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ కలోంజీ నూనె దాదాపు అందరికీ నప్పుతుంది. కాస్త సున్నితత్వం ఉన్న వాళ్లు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేస్కొని వాడితే మేలు.