Kakarakaya Pulusu: అమ్మమ్మల కాలంనాటి కాకరకాయ పులుసు రెసిపీ, ఇలా తిన్నారంటే డయాబెటిస్ అదుపులోకి రావడం ఖాయం
Kakarakaya Pulusu: కాకరకాయలు డయాబెటిస్ పేషెంట్లకు వరం లాంటివి. అమ్మమ్మల స్టైల్లో ఒకసారి కాకరకాయ పులుసు చేసి చూడండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు తగ్గిస్తుంది.
కాకరకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాకరకాయలను వేయించుకుని తినే కన్నా పులుసు పెట్టుకోవడం వల్ల ఎక్కువ పోషకాలు శరీరంలో చేరుతాయి. తెలుగు వారికి కాకరకాయ పులుసుంటే ఎంతో ఇష్టం. కానీ కొంతమందికి అందులో ఉండే చేదు నచ్చదు. నిజానికి కాకరకాయ పులుసు కాస్త తియ్యగా పుల్లగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది. కానీ దీని పర్ఫెక్ట్ రెసిపీ ఇప్పుడు యువతకి తెలియదు. అందుకే అమ్మమ్మల కాలంనాటి కాకరకాయ పులుసు రెసిపీని ఇక్కడ ఇచ్చాము. ఇది చేదు కాస్త తక్కువగానే ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు వారంలో రెండు రోజులు ఈ కాకరకాయ పులుసు చేసుకొని తినేందుకు ప్రయత్నించండి. వారి ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
కాకరకాయ పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు
కాకరకాయ ముక్కలు - పావు కిలో
ఉప్పు- రుచికి సరిపడా
నీళ్లు - సరిపడినన్ని
పసుపు - అర స్పూను
నూనె - మూడు స్పూన్లు
శనగపిండి - రెండు స్పూన్లు
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - రెండు
పసుపు - చిటికెడు
కారం - ఒక స్పూను
బెల్లం తురుము - రెండు స్పూన్లు
చింతపండు - నిమ్మకాయ సైజులో
వెల్లుల్లి రెబ్బలు - ఐదు
ఎండుమిర్చి - రెండు
జీలకర్ర - ఒక స్పూన్
కరివేపాకులు - గుప్పెడు
ఆవాలు - అర స్పూను
ఇంగువ - చిటికెడు
కాకరకాయ పులుసు రెసిపీ
1. కాకరకాయలను పైన కాస్త పొట్టును చెక్కి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. దాన్ని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి పసుపును కలపాలి.
3. పసుపు, ఉప్పు కలిపి కాసేపు ఉంచాలి. తర్వాత వాటిని చేత్తోనే పిండి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద పులుసు చేసేందుకు కళాయి పెట్టాలి.
5. అందులో నూనె వేయాలి. ఆ నూనెలో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
6. ఆ తర్వాత ఎండు మిర్చి, కరివేపాకులు, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించుకోవాలి.
7. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు వేసి వేయించుకోవాలి.
8. ఉల్లిపాయలు మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
9. తర్వాత కాకరకాయ ముక్కలను వేసి బాగా కలిపి మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి.
10. తర్వాత కాకరకాయలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి.
11. చింతపండు నానబెట్టి ఆ గుజ్జును వేసుకోవాలి. అలాగే బెల్లం తురుమును కూడా వేసి మూత పెట్టి పావుగంట సేపు ఉడికించాలి.
12. పులుసు చిక్కబడుతున్నప్పుడు అరకప్పు నీళ్లలో సెనగపిండిని వేసి బాగా గిలకొట్టి ఉండలు లేకుండా చేసుకోవాలి.
13. ఆ మిశ్రమాన్ని కూడా పులుసులో వేసి బాగా కలుపుకోవాలి.
14. ఆ తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి.
15. అంతే టేస్టీ కాకరకాయ పులుసు రెడీ అయినట్టే. ఇది కాస్త చిక్కగా ఉంటుంది.
కాకరకాయ పులుసు ఎక్కువ అన్నంలో తక్కువ కూరే కలుస్తుంది. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఈ పులుసు రుచి తెలియాలంటే మీరు వేడి వేడి అన్నంలోనే కలుపుకోవాలి. అప్పుడే దీని రుచి అద్భుతంగా ఉంటుంది.
కాకరకాయ చేదని చాలామంది పక్కన పడేస్తారు. నిజానికి మనం తినే కూరగాయల్లో కాకరకాయ చేసేంత మేలు మరే కూరగాయ చేయదు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు మనకు అనేక రకాల అనారోగ్యాల నుంచి కాపాడుతాయి. కాకరకాయను తరుచూ తినడం వల్ల ఇన్ఫ్లమేషన్ శరీరంలో ఏర్పడకుండా ఉంటుంది. అలాగే మధుమేహంతో బాధపడే వారికి రక్తంలో చక్కర స్థాయిలు పెరగకుండా కాకరకాయలను సమ్మేళనాలు కాపాడతాయి. కాకరకాయలో సపోనిన్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తం నుండి కణాలకు గ్లూకోజ్ ని తరలించడంలో సహాయపడతాయి. అలాగే కాలేయం, కండరాలు గ్లూకోజ్ ను మెరుగ్గా ప్రాసెస్ చేసేలా చూస్తాయి. కాబట్టి కాకరకాయను తరచు ఆహారంలో భాగం చేసుకోవలసిన అవసరం ఉంది.