Kakarakaya Kobbari karam: డయాబెటిస్ పేషెంట్ల కోసం కాకరకాయ ఎండుకొబ్బరికారం, రెసిపీ అదిరిపోతుంది
Kakarakaya Kobbari karam: డయాబెటిస్ పేషెంట్లు ఏం తినాలన్నా అందులో కేలరీలు, చక్కెర, కార్బోహైడ్రేట్లు గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము వారి కోసం ప్రత్యేకంగా కాకరకాయ ఎండు కొబ్బరి కారం రెసిపీ ఇచ్చాము. ఇది వారికి ఎంతో నచ్చుతుంది.
Kakarakaya Kobbari karam: మీకు డయాబెటిస్ ఉంటే కచ్చితంగా కాకరకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి. మీకు నచ్చినా, నచ్చకపోయినా కాకరకాయను తినాల్సిందే. ఇది డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. కాకరకాయతో వండిన ఆహారాలు తినలేకపోతే... ఇక్కడ మేము చెప్పినట్టు కాకరకాయ ఎండు కొబ్బరికారం రెసిపీ ట్రై చేసి చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. కాకరకాయ నచ్చని వారు కూడా ఈ రెసిపీని ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం కూడా చాలా సులువు.
కాకరకాయ ఎండు కొబ్బరి కారం రెసిపీ
కాకరకాయలు - పావు కిలో
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
ఎండు కొబ్బరి తురుము - పావుకప్పు
కారం - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
నూనె - సరిపడినంత
ఉప్పు - రుచికి సరిపడా
కాకరకాయ కొబ్బరి కారం రెసిపీ
1. ముందుగానే కాకరకాయలను సన్నగాచ గుండ్రంగా కోసుకోవాలి.
2. ఒక గిన్నెలో నీళ్లు వేసి ఆ నీటిలో ఈ కాకరకాయలను చిటికెడు పసుపును, చిటికెడు ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి.
3. చేదును తగ్గించుకోవడం కోసం ఇలా చేస్తాము. కాకరను ఇష్టంగా తినేవారు ఇలా చేయాల్సిన అవసరం లేదు.
4. ఓ పావుగంట తర్వాత నీటిలోంచి కాకరకాయలను తీసి చేత్తోనే పిండి ఒక ప్లేట్లో విడివిడిగా వేసుకోవాలి.
5. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి తురుము, కారం, ఉప్పు వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
6. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
7. నూనెలో కాకరకాయలను వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.
8. అలా కాకరకాయలు వేగాక ముందుగా పొడిచేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
9. ఉప్పు సరిపోకపోతే మరి కొంచెం వేసుకోవచ్చు. ఇలా ఇది పొడిపొడిగా వేపుడులా అయ్యే వరకు చిన్న మంట మీద వేయించుకోవాలి.
10. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ కాకరకాయ కొబ్బరి కారం రెడీ అయినట్టే. ఇది అందరికీ నచ్చుతుంది. డయాబెటిస్ పేషెంట్లు దీన్ని ఇష్టంగా తింటారు.
కాకరకాయ తినడం వల్ల అందరికీ ప్రయోజనం ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లు కాకరకాయ తింటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు, ఊబకాయంతో బాధపడుతున్న వారు, పొట్ట సమస్యలు, అజీర్ణం, పొట్టలో మంట వంటి సమస్యలతో బాధపడేవారు కాకరకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి. కాకరకాయలో ఉండే క్యాటెచిన్, గల్లిక్ యాసిడ్, క్లోరోజనిక్ యాసిడ్... ఇవన్నీ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి మన శరీరాన్ని పటిష్టంగా మారుస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు లేనివారు కూడా కాకరకాయను వారంలో కనీసం రెండు నుంచి మూడుసార్లు తినాల్సిన అవసరం ఉంది.
టాపిక్