Kaju Curry Recipe: ధాబా స్టైల్లో కాజు గ్రేవీ ఇలా చేసేయండి వేడివేడి అన్నంలో అదిరిపోతుంది
Kaju Curry Recipe: ధాబా స్టైల్లో చేసే వంటలు చాలా రుచిగా ఉంటాయి. ఎర్రగా కనిపించే ఇగురు తినాలన్నా కోరికను పెంచుతుంది. ఇక్కడ మేము ధాబా స్టైల్లో కాజు కర్రీ రెసిపీ ఇచ్చాము.

ధాబా స్టైల్ వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. వాటిని సింపుల్గా ఇంట్లో కూడా వండుకోవచ్చు. ఇక్కడ మేము కాజు కర్రీని ధాబా స్టైల్ లో ఎలా వండాలో ఇచ్చాము. దీన్ని వేడి వేడి అన్నంలోనే కాదు. చపాతీ, రోటీతో తిన్నా రుచిగా ఉంటుంది. దీనిలో గ్రేవీ అధికంగా ఉంటుంది. కాజు గ్రేవీ ఎలా చేయాలో తెలుసుకోండి.
కాజు గ్రేవీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
జీడిపప్పులు - పదిహేను
ఉల్లిపాయలు - మూడు
వెల్లుల్లి రెబ్బలు - పది
పచ్చిమిర్చి - అయిదు
టమోటోలు - రెండు
ఉప్పు- రుచికి సరిపడా
నెయ్యి - రెండు స్పూన్లు
లవంగాలు - నాలుగు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
బిర్యానీ ఆకు - రెండు
అనాసపువ్వు - ఒకటి
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
నూనె - రెండు స్పూన్లు
పసుపు - అర స్పూను
కారం - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
పెరుగు - రెండు స్పూన్లు
కసూరి మేథి - ఒక స్పూను
గరం మసాలా - అర స్పూను
పుదీనా తరుగు - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
కాజు కర్రీ రెసిపీ
1. ధాబా స్టైల్ లో కాజు కర్రీ చేసేందుకు ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి.
2. ఆ నెయ్యిలో కప్పు జీడిపప్పులను వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. మిగిలిన నెయ్యిలో మసాలా దినుసులు అన్నింటినీ వేసి వేయించాలి.
4. అంటే బిర్యాని ఆకు, అనాస పువ్వు, లవంగాలు, గసగసాలు, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి.
5. అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి.
6. గుప్పెడు జీడిపప్పులను కూడా వేయాలి. వీటిని బాగా వేయించుకోవాలి.
7. తర్వాత టమోటో ముక్కలను కూడా వేసి బాగా వేయించాలి.
8. ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా మసాలా ముద్దను రుబ్బుకోవాలి.
9. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి.
10. అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
11. గుప్పెడు కరివేపాకులు, ఉల్లిపాయ తరుగును కూడా వేసి వేయించుకోవాలి.
12. ఉల్లిపాయలు బాగా వేగాక కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా వేయించాలి.
13. ఇందులోనే ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
14. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. పెరుగును కూడా వేసి బాగా కలపాలి.
15. కసూరి మేతి, గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి.
16. ముందుగా వేయించిన జీడిపప్పులను కూడా వేసి బాగా కలపాలి.
17. ఈ మొత్తం మిశ్రమాన్ని చిన్నమంట మీద ఉడికించుకోవాలి.
18. పైకి నూనె తేలే వరకు చిన్న మంట మీద ఉడికించాలి.
19. పుదీనా తరుగు, కొత్తిమీర తరుగును కూడా చల్లి ఐదు నిమిషాలు పాటు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
20. అంతే ధాబా స్టైల్ లో కాజు కర్రీ రెడీ అయినట్టే. ఇది ఎంతో రుచిగా ఉంటుంది.
ధాబా స్టైల్లో చేసే కాజు కర్రీని వేడివేడి అన్నంలోనే కాదు... రోటీ, చపాతీతో కూడా తినవచ్చు. ఇడ్లీతో తిన్నా రుచిగానే ఉంటుంది. పూరీతో కూడా అద్భుతంగా ఉంటుంది. ఇందులో గ్రేవీ అధికంగా వస్తుంది. కాబట్టి కలుపుకోవడానికి ఎక్కువ ఇగురు మిగులుతుంది. ఒక్కసారి దీన్ని వండి చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం. జీడిపప్పులు రోజుకు గుప్పెడు తినడం వల్ల ఆరోగ్యకరమే. అంతకుమించి ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ చేరిపోయే అవకాశం ఉంది. కాబట్టి జీడిపప్పులను ఒక కప్పుకు మించి వేయకపోవడమే మంచిది. ఒక కప్పు జీడిపప్పులు... నలుగురు ఉన్న కుటుంబ సభ్యులకు సరిపోయేలా కర్రీ వస్తుంది. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో ఉండి చూడండి.. మీకు నచ్చడం ఖాయం.
సంబంధిత కథనం