Kajal Making: కాటుకను కొంటున్నారా? ఇంట్లోనే ఇలా నేచురల్‌గా తయారు చేసేయండి
Kajal Making: చిన్న పిల్లలకు కాటుకను కచ్చితంగా పెడతారు తెలుగిళ్లల్లో. అలాగే ఆడవారు కంటి అందం కోసం దీన్ని వాడతారు. ఇంట్లోనే కాటును సులువుగా తయారు చేసుకోవచ్చు.
Kajal Making: కళ్ళకు కాటుక పెడితే అందం రెట్టింపు అవుతుంది. బయట ఎన్నో రకాలైన కాటుకలు దొరుకుతున్నాయి. వాటన్నింటిలోనూ రసాయనాలను మిక్స్ చేసి తయారు చేస్తారు. సహజంగా కాజల్‌ని ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది. దీన్ని సుర్మా అని కూడా పిలుస్తారు. అనేక సంస్కృతులలో శతాబ్దాలుగా సంప్రదాయ పద్ధతుల్లో కాటుక ఒకటిగా మారిపోయింది. నేచురల్‌గా తయారు చేసిన కాటుక కళ్ళకు సురక్షితమైనది. అదే రసాయనాలు కలిపిన కాటుకను ప్రతిరోజూ వాడితే కంటి సమస్యలు ఏవో ఒకటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సులువుగా ఇంట్లోనే కాటుకను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.

కాటుక తయారీకి కావాల్సిన పదార్థాలు ముఖ్యంగా నువ్వుల నూనె లేదా నెయ్యి, బాదం నూనె, ఆముదం. ఈ నూనెల్లో ఏవైనా రెండు నూనెలను కొని దగ్గర పెట్టుకోండి. అలాగే ఒక చిన్న స్టీలు గిన్నె, మట్టి ప్రమిద లేదా కొవ్వొత్తి. కొన్ని బాదం గింజలు కూడా అవసరం.
ముందుగా బాదం పప్పులను రాత్రంతా నానబెట్టండి. ఉదయాన పొట్టు తీసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయండి.ఒక చిన్న స్టీలు గిన్నెలో మీరు తయారు చేసుకున్న బాదం పేస్టును వేయండి. ఆ గిన్నెలోనే నువ్వుల నూనె లేదా నెయ్యిని వేసి కలపండి. ఇది మృదువుగా మారేవరకు బాగా గిలక్కొట్టండి. తరువాత ఆముదం వేసి బాగా కలపండి. ఈ గిన్నెను చిన్న మంట మీద పెట్టి వేడి చేయండి. స్టవ్ మీద పెడితే ఇదంతా మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొవ్వొత్తిని లేదా ప్రమిదలో పెట్టిన దీపాన్ని వినియోగించుకోవాలి.
కొవ్వొత్తి పైన గిన్నెను పెట్టి వేడి చేయండి. చిన్న క్లాత్‌తో గిన్నెను పట్టుకుంటే చేయి కాలకుండా ఉంటుంది. అలాగే వేడి చేస్తున్నప్పుడు చిన్న స్పూన్‌తో ఆ మిశ్రమాన్ని కలుపుతూ ఉండండి. కనీసం పావుగంటసేపు ఇలా వేడి చేసి కలుపుతూ ఉండాలి. అప్పుడు మిశ్రమం మరింత ముదురు నలుపు రంగులోకి మారుతుంది.
ఇప్పుడు కొవ్వొత్తి నుంచి గిన్నెను వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని చల్లబరచాలి. అందులో కాస్త ఆముదం లేదా బాదం నూనె వేసుకుంటే కాటుకలా వస్తుంది. దీన్ని ఒక చిన్నడబ్బాలోకి తీసుకొని మూత పెట్టి దాచుకోవాలి. ఇది ఎన్ని నెలలైనా తాజాగా ఉంటుంది. ఇందులో మనం ఎలాంటి రసాయనాలు కలపలేదు. కనుక చిన్నపిల్లల చర్మానికి ఎలాంటి హాని జరగదు. కంటికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది మంచి మెరుపుతో ఉంటుంది. ఒకసారి ఇలా ఇంట్లో తయారు చేసుకుని చూడండి... మీకు ఈ కాటుక కచ్చితంగా నచ్చుతుంది.
పూర్వం ఇంట్లోనే కాటుకను తయారు చేసి వాడుకునే వారు. కానీ ఆధునిక కాలం వచ్చాక మాత్రం కాటుకను చేయడం పూర్తిగా ఆపేశారు. రకరకాల కాటుకలు మార్కెట్లో దొరుకుతుండడంతో వాటినే వాడుతున్నారు. ఉదయం పెట్టుకున్న కాటుక రాత్రి వరకు చెరగకుండా ఉండాలని వాటిలో అనేక రకాల రసాయనాలు వినియోగిస్తున్నారు. అలాంటి వాటిని చంటి పిల్లలకు వాడడం మంచిది కాదు. పెద్ద వారు కూడా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంట్లో తయారు చేసిన కాటుకను వినియోగించడం మంచిది.